ONE NATION-ONE ELECTION: జమిలి ఎన్నికలు ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
1951 నుంచి 1967 వరకూ లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ 1968లో హర్యానా ప్రభుత్వం రద్దయింది. 1969లో బిహార్, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలు కూడా రద్దయ్యాయి. దీంతో ఆ రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు జరపాల్సి వచ్చింది.

ONE NATION-ONE ELECTION: వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న జమిలి ఎన్నికల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఉన్నట్టు పార్లమెంట్‌కు, రాష్ట్రాల శాసనసభలకు వేర్వేరుగా కాకుండా ఒకే ఎన్నిక నిర్వహించాలనేది దీని లక్ష్యం. ఈ బిల్లు సాధ్యం అవుతుందా అన్న విషయం కంటే జమిలి ఎన్నికలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ మరోసారి మొదలైంది. అసలు గతంలో జమిలి ఎన్నికలు జరిగాయా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మొదటిసారి జమిలి ఎన్నికల గురించి చర్చ జరిగింది. 1951 నుంచి 1967 వరకూ లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ 1968లో హర్యానా ప్రభుత్వం రద్దయింది. 1969లో బిహార్, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలు కూడా రద్దయ్యాయి. దీంతో ఆ రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు జరపాల్సి వచ్చింది. 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి జమిలి ఎన్నికలు సాధ్యం కాలేదు. కేంద్రంలో ఎన్డీయే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మళ్లీ జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీనిపై చర్చించడానికి 2019 జూన్‌లో ప్రధాని మోదీ అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 40 రాజకీయపార్టీలను ఆహ్వానిస్తే, 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కొన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు స్వాగతం పలికితే, మరికొన్ని వ్యతిరేకించాయి. బీజేపీ వంటి జాతీయపార్టీలకు ఈ ప్రతిపాదన లాభమనీ, ప్రాంతీయ పార్టీలకు నష్టమనే వాదనలు వచ్చాయి. అది మాత్రమే కాదు జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ఉన్నపళంగా రద్దు చేయాలి. మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కాలం పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది.
కానీ ఇలా ఎన్నికలు నిర్వహిస్తే వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కాపాడవచ్చనేది కేంద్ర ప్రభుత్వ పాయింట్. 2019లో ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.10 వేల కోట్లు. ఇక రాష్ట్రాల ఎన్నికలకు ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు రూ.250 నుంచి రూ.500 కోట్ల వరకూ ఉంటోంది. పార్లమెంట్‌కు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇందులో చాలా వరకూ సేవ్ చేయొచ్చు. అయితే రాజకీయాల పరంగా జమిలి ఎన్నికలు జాతీయ పార్టీలకు మాత్రమే లాభం అనే భావన ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా నిర్వహించిన ఓ సర్వేలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంలో, రాష్ట్రాల్లో ఒకే పార్టీ వచ్చే అవకాశాలు 71 శాతం ఉన్నట్టు తేలింది. అదే లోక్‌సభ, శాసనసభలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు 61 శాతానికి తగ్గిపోయాయి. అందుకే చాలా ప్రాంతీయ పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఇంత వ్యతిరేకతలో కేంద్ర ప్రభుత్వం ఈ ఇష్యూను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.