Karnataka CM: డీకేనా, సిద్ధరామయ్యనా.. సీఎం ఎవరు ? కాంగ్రెస్ పెద్దల మనసులో ఏముంది ?
అంచనాలే నిజం అయ్యాయ్. కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. బీజేపీ బలం అనుకున్న ప్రతీ విషయం మీద కాంగ్రెస్ దెబ్బకొట్టింది. కమలానికి దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా చేసింది. పని అయిపోయిందని హేళన చేస్తున్న బీజేపీకి.. పిక్చర్ అభీ బాకీ హై అని కాంగ్రెస్ గర్వంగా చెప్పిన విజయం ఇది. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కాంగ్రెస్ నుంచి కాబోయే సీఎం ఎవరన్న దానిపై ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.
డీకే శివకుమార్, సిద్ధరామయ్య.. ప్రస్తుతం సీఎం రేసులో ఉన్నారు. ఇద్దరిలో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని సెలక్ట్ చేస్తుందన్నది కీలకంగా మారింది. అద్భుతమైన ఫలితాలు రావడంతో.. కొత్త సీఎంతో పాటుగా.. నయా ఫార్ములాను కాంగ్రెస్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సిద్ధరామయ్య గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ గెలిస్తే.. సిద్ధరామయ్యే సీఎంగా మొదటి ఛాయిస్ అనే అంచనాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయ్. సీఎంగా ఉన్నప్పుడు సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయాలు.. ఈసారి ఎన్నికల ప్రచారంలో బాగా ఉపయోగపడ్డాయ్. కాంగ్రెస్ వైపు కొత్త ఓటర్లు ఆకర్షితులు అయ్యేలా చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎమోషనల్ పాలిటిక్స్‌ను తెరమీదకు తీసుకువచ్చారు సిద్ధరామయ్య.
ఇవే తన చివరి ఎన్నికలు అంటూ.. ఓటర్ల మనసు కదిలించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ సిద్ధరామయ్యకు ప్లస్ కాబోతుండగా.. డీకే శివకుమార్‌ను తక్కువ చేసే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం 8సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు డీకే. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు వెనక.. ఆర్థికంగా, రాజకీయంగా పెద్దదిక్కుగా నిలిచారు. ఎన్నికలకు ముందు కేంద్ర విచారణ సంస్థల విచారణతో పాటు.. కేసులు ఎదుర్కొన్నారు. అవన్నీ సింపథీ తీసుకువచ్చాయ్. తన మీద జరిగిన విచారణలను.. బీజేపీ మీద ఆయుధంగా వాడుకోవడం డీకే శివకుమార్ సక్సెస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగాలంటే.. డీకే శివకుమార్‌కే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఇద్దరిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని సీఎం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కరిని పక్కనపెట్టినా.. ఆ ప్రభావం రాజకీయంగా భారీగా ఉంటుంది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి మళ్లీ బీజేపీ బలపడే చాన్స్ ఉంటుంది. దీంతో చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.