బొత్స గెలుపు వెనక ఇంత జరిగిందా.. చక్రం తిప్పింది ఆయనే..
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం వైసీపీకి కొత్త ఊపిరి ఊదినట్లు అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదే అని దిగాలు పడిపోతున్న వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయయ్ారు. పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకోగా.. స్వతంత్ర్య అభ్యర్థిగా ఉన్న షఫీ.. తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. పోటీలో ఎవరు లేకపోవడంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీయాదవ్ రాజీనామాతో.. ఎన్నిక అనివార్యం అయింది. ఐతే విశాఖ విజయం వెనక ఉన్నది వన్ అండ్ ఓన్లీ జగన్ మాత్రమే. ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల్లో వైసీపీకి తిరుగులేని మెజారిటీ ఉంది. ఐతే కూటమి అధికారంలో ఉండడంతో.. ఏమైనా జరగొచ్చు అనే చర్చ జరిగింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన జగన్.. అభ్యర్థి ఎంపిక నుంచి ఓటర్లను కాపాడుకోవడం వరకు.. ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అనుకున్న వ్యూహాలను.. అనుకున్నట్లుగా అమలు చేయగలిగారు. విశాఖ స్థానం వైసీపీ చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థి ప్రకటన తర్వాత క్షణం నుంచి నియోజకవర్గాల వారీగా మీటింగ్‌లతో వైసీపీ దూసుకుపోయింది. ఆత్మీయ సమావేశాల పేరుతో ఓటర్లు చేజారకుండా.. బొత్స అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికితోడు సొంతసామాజికవర్గం కూడా బొత్స కోసం కష్టపడింది. జగన్ సలహాలు, సూచనలతో.. బొత్స వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇక అటు జగన్ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. ఓటర్లను క్యాంప్‌నకు తరలించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలు బెంగళూరుకు తరలించారు. ఇక అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టూర్ బాధ్యతలు అప్పగించిన జగన్.. ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేశారు. ఓటర్లను కాపాడుకుంటూనే.. మరోవైపు కూటమిని కార్నర్ చేశాడు. బలం లేకపోయినా పోటీలో దిగుతున్నారు అని విమర్శలు గుప్పిస్తూ.. టీడీపీని కార్నర్ చేశారు జగన్. ఇలాంటి పరిస్థితుల మధ్య.. పోటీ నుంచి తప్పుకోవడమే బెటర్ అని టీడీపీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏమైనా విశాఖ విజయం.. వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. నిజానికి జగన్ కోరుకున్నది కూడా ఇదే. నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు ఇలాంటి విజయం మెడిసిన్‌లా పనిచేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏకగ్రీవంగా విజయం సాధిస్తారని.. ప్రతిపక్షంలో ఉండి, అది కూడా జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేని చోట ఏకగ్రీవంగా గెలవడం అంటే మామూలు విషయం కాదని వైసీపీ నేతలు మురిసిపోతున్నారు.