అమెరికా తిరస్కరించినవాళ్లను అమృత్‌సర్‌లోనే ఎందుకు దింపుతున్నారంటే

అక్రమ వలసదారుల తరలింపులో తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇప్పటికే 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపిన ట్రంప్‌ ప్రభుత్వం..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2025 | 11:45 AMLast Updated on: Feb 17, 2025 | 11:45 AM

Why Are Those Rejected By America Being Dropped In Amritsar Itself

అక్రమ వలసదారుల తరలింపులో తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇప్పటికే 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపిన ట్రంప్‌ ప్రభుత్వం.. మరో రెండు విమానాల్లో ఇంకొంత మందిని భారత్‌కు తరలించింది. ఇందులో తొలి విమానం సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌-3..119 మందితో అమృత్‌సర్‌లో దిగింది. ఈ 119 మందిలో 67 మంది పంజాబ్‌కు చెందినవారు కాగా.. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు. ఇక మరో విమానంలో ఎంత మందిని తరలించనున్నది ఇంకా ప్రకటించలేదు. 104 మంది అక్రమ వలసదారులతో వచ్చిన తొలి విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్‌ అవగా.. ఇప్పుడు వచ్చిన విమానాన్ని కూడా అక్కడే ల్యాండ్‌ చేశారు. అయితే అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకువస్తున్న విమానాలు..

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కే ఎందుకు వస్తున్నాయి..? గుజరాత్‌, హర్యానా, ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు..? ఇప్పుడు ఈ విషయం మీదే రాజకీయ వివాదం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే అక్రమ వలసదారుల విమానాలను అమృత్‌సర్‌కు పంపిస్తోందని పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌సింగ్‌ ఆరోపిస్తున్నారు. పంజాబ్‌ పేరు చెడగొట్టేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు. పంజాబీలు మాత్రమే అక్రమంగా వలస వెళతారని ప్రచారం చేయడానికే మోదీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని చెప్తున్నారు. అటు బీజేపీ మాత్రం.. పంజాబ్‌ సీఎం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. యూఎస్‌ నుంచి వచ్చే విమానాలకు అమృత్‌సర్‌ దగ్గర కాబట్టే ఆ విమానాశ్రయాన్ని ఎంచుకున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు. ఇటువంటి సున్నితమైన విషయాలను రాజకీయ లబ్ది గురించి వినియోగించుకోవడం సరైన చర్య కాదని మండిపడ్డారు. భగవంత్‌ మాన్‌ ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ముఖ్యమంత్రి తన స్థాయికి తగ్గట్టుగా నడుచుకోవాలని ఆర్పీ సింగ్‌ సూచించారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు దేశ భద్రత గురించి ఎప్పుడూ పట్టించుకోరని, రాజకీయాలు చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటారనేది ఇప్పుడు బీజేపీ చేస్తున్న వాదన. అయితే నేతల విమర్శలను పక్కన పెడితే.. అమెరికా నుండి బయల్దేరిన విమానాలకు.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టే దగ్గర. కాబట్టి అక్కడే ఆ విమానాలు ల్యాండ్‌ అవుతున్నాయని ఏవియేషన్‌ నిపుణులు చెబుతున్నారు. 104 మంది భారతీయులతో గత వారం వచ్చిన యూఎస్‌ సైనిక విమానం.. అమెరికాలోని టెక్సాస్‌ నుండి బయల్దేరింది. అక్కడి నుండి 8,420 కిలోమీటర్లు ప్రయాణం చేసి.. జర్మనీలోని రామ్‌స్టెన్‌ ఎయిర్‌బేస్‌లో హాల్ట్‌ తీసుకుంది. అక్రమ వలసదారులు కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం రామ్‌స్టెన్‌ ఎయిర్‌బేస్‌ నుండి బయల్దేరి, 5 వేల 805 కిలోమీటర్ల దూరంలోని అమృత్‌సర్‌కు చేరుకుంది.

ఇప్పుడు వచ్చిన రెండో విమానం కూడా ఇదే తరహాలో వచ్చింది. మరోవైపు మోదీ ప్రభుత్వం కూడా.. అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించిన మోదీ.. ఈ ప్రయత్నాల్లో భారత్‌కు ట్రంప్‌ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అక్రమ వలసదారుల అంశంలో ట్రంప్‌ చర్యలకు మోదీ మద్దతు పలకడంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల గుర్తింపు, వారిని స్వదేశానికి పంపించే ప్రక్రియ వేగవంతం కానుంది. అమెరికాలో మొత్తం 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్టు అంచనా. వారిలో 7 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ట్రంప్‌ చర్యల కారణంగా వారందరూ కూడా స్వదేశానికి రాక తప్పని పరిస్థితి నెలకొంది.