Mynampally Hanumanth Rao: మైనంపల్లితో రాజీ చేస్తున్నదెవరు..? హరీష్ రియాక్షనేంటి..?
మైనంపల్లి పార్టీ హైకమాండ్‌పై.. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఓ మహిళా ఎమ్మెల్యేకు సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు.
Mynampally Hanumanth Rao: మైనంపల్లి హన్మంతరావు.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే.. హైకమాండ్‌నే చెడుగుడు ఆడుతున్న ఈ నేతపై బీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? హరీష్ గుర్రుగా ఉన్నా గులాబీ బాస్ పట్టించుకోవడం లేదా..? మైనంపల్లిని దారికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఎవరు..? మైనంపల్లి పెడుతున్న కొత్త డిమాండ్స్ ఏంటి..?
మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లికి టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే సమస్యంతా ఆయన కుమారుడు డాక్టర్ రోహిత్ విషయంలోనే వచ్చింది. మెదక్ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో కొన్ని నెలలుగా సొంత డబ్బుతో నియోజకవర్గంలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ మాత్రం ఆయన్ను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మైనంపల్లి పార్టీ హైకమాండ్‌పై.. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఓ మహిళా ఎమ్మెల్యేకు సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు. మెదక్ సీటును పద్మా దేవేందర్‌కు హరీష్ కోటాలోనే ఇచ్చారని మైనంపల్లి భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయన కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడిన ఆడియో కూడా వైరల్ అయ్యింది. ఇంత జరిగినా పార్టీ హైకమాండ్ మాత్రం మైనంపల్లిపై చర్యలు తీసుకోలేదు. ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థంకాని ప్రశ్నగా మారింది. సాధారణంగా ఎవరైనా తోకజాడిస్తే వెంటనే కట్ చేసే కేసీఆర్.. ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో ఏదో జరుగుతోందన్న చర్చ నడుస్తోంది.
అడకత్తెరలో పోకచెక్కలా కేసీఆర్
మైనంపల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది హైకమాండ్‌కే అర్థం కావడం లేదు. ఆయన్ను దూరం చేసుకోవడం కేటీఆర్‌కు ఇష్టం లేదు. తాను వచ్చేవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన స్పష్టం చేశారంటున్నారు. ఇటు కవిత కూడా మైనంపల్లితో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని వీడొద్దని, కొంత వేచి చూడాలని ఆమె నచ్చచెబుతున్నట్లు సమాచారం. ఇటీవల అభిమానులతో సమావేశం తర్వాత మాట్లాడిన మైనంపల్లి ఓ బీఆర్ఎస్ ముఖ్యనేత తనతో మాట్లాడినట్లు చెప్పారు. కొన్నిరోజులు ఆగాలని సూచించారన్నారు. అది కవితే అని తెలుస్తోంది. కేటీఆర్ వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పినట్లు కవిత నచ్చచెప్పినట్లుగా మైనంపల్లి క్యాంప్ అంటోంది. మరోవైపు హరీష్‌రావు మాత్రం మైనంపల్లిపై చర్యలు తీసుకోవాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారని సమాచారం. తనపై ఇన్ని ఆరోపణలు చేసిన మైనంపల్లిని క్షమిస్తే చాలామంది ఇలాగే చేస్తారని హరీష్ అంటున్నారు. దీంతో కేసీఆర్ ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారని తెలుస్తోంది.
మైనంపల్లి వెనక ఎవరైనా ఉన్నారా..?
పొలిటికల్ సర్కిల్స్‌లో మరో ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్‌పై హరీష్‌రావు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మైనంపల్లితో కావాలని అలా మాట్లాడించారని హరీష్ అభిమానులు కొందరు అనుమానిస్తున్నారు. మైనంపల్లిపై చర్యలకు వెనకాడటంతో ఆ డౌట్లు ఇంకా పెరుగుతున్నాయి.
మైనంపల్లి కొత్త డిమాండ్ ఏంటి..?
మైనంపల్లి పార్టీ పెద్దల ముందు ఓ ప్రతిపాదన ఉంచినట్లు కూడా చెబుతున్నారు. తను పార్టీలో కంటిన్యూ అవ్వాలంటే తన కుమారుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు అంగీకరించాలని కోరుతున్నారు. అంటే తాను బీఆర్ఎస్ తరపున మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, తన కుమారుడు మెదక్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి పార్టీ ఓకే అనాలంటున్నారు. అంటే ఆ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా తాను పనిచేస్తానని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. మైనంపల్లి ప్రస్తుతానికి పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించలేదు. పార్టీ నుంచి బయటకు వచ్చి, అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని తండ్రీకొడుకులు ఇద్దరూ భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానం అందినట్లు చెబుతున్నారు. మరి మైనంపల్లి ఏం చేయబోతున్నారు..? బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది..? ప్రస్తుతానికి సస్పెన్స్.