BRS MLA LIST: సిట్టింగులకు ఎందుకు హ్యాండ్ ఇచ్చారు..? కొత్త అభ్యర్థులు గెలుస్తారా..?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 115 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ప్రకటించిన వారిలో ఏడుగురు మినహా మిగతా అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. వీరితోపాటు కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో కేసీఆర్ పోటీ చేయబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2023 | 06:19 PMLast Updated on: Aug 21, 2023 | 6:19 PM

Why Did Cm Kcr Give A Hand To The Sittings Will The New Candidates Win

BRS MLA LIST: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 115 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ప్రకటించిన వారిలో ఏడుగురు మినహా మిగతా అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. వీరితోపాటు కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. అంటే మొత్తం ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాన్ని కేసీఆర్ మార్చారు. ఏడుగురు సిట్టింగులను మార్చడం వెనుక కారణాలేంటి..?
వేములవాడలో చెన్నమనేని రమేశ్ బాబు స్థానంలో చల్మెడ లక్ష్మీ నరసింహారావు పోటీ చేస్తున్నారు. చెన్నమనేనికి సంబంధించి పౌరసత్వం విషయంలో వివాదం నడుస్తోంది. ఆయన జర్మన్ పౌరసత్వం కలిగి ఉన్నారని, అందువల్ల ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం చెల్లదని కోర్టులో కేసు నడుస్తోంది. గతంలో ఒకసారి ఆ‍యన సభ్యత్వాన్ని కోర్టు రద్దు కూడా చేసింది. ఈ నేపథ్యంలో చెన్నమనేనికి మరోసారి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి, గెలిచినా.. పౌరసత్వం విషయంలో న్యాయపరమైన చిక్కులు తప్పవు. అందుకే ఈసారి ఆయనకు మొండిచేయి చూపించారు. ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చల్మెడకు స్థానం కల్పించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై స్థానికంగా వ్యతిరేకత ఉంది. గతంలో రెండుసార్లు వరుసగా గెలిచినప్పటికీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్థానిక నేతల్లో కూడా ఆమెపై వ్యతిరేకత కనిపిస్తోంది. సర్వేలు కూడా రేఖా నాయక్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి. దీంతో ఆమె స్థానంలో జాన్సన్ భూక్యా నాయక్ పోటీ చేస్తారు.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఒక మహిళా సర్పంచ్‌పై వేధింపులకు పాల్పడినట్లు ఆమె చేసిన ఆరోపణలు రాజయ్యకు ఇబ్బందిగా మారాయి. గతంలో కూడా మహిళల విషయంలో రాజయ్య ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంది. పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆడియో క్లిప్పింగులు బయటపడటం వంటివి ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఈసారి సీటిచ్చారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానంలో బానోత్ మదన్‌లాల్‌కు సీటిచ్చారు. రాములు నాయక్‌పై స్థానికంగా ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆయనను తప్పించినట్లు తెలుస్తోంది. అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే భేతిరెడ్డి సుభాష్ రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మి పోటీ చేయబోతున్నారు. బోథ్‌కు సంబంధించి ఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావు స్థానంలో అనిల్ జాదవ్ పోటీ చేస్తారు. బాపూ రావుపై తీవ్ర వ్యతిరేకత ఉందని, టిక్కెట్ ఇచ్చినా గెలవడం కష్టమేనని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా బాపూ రావుకు చెప్పారు. ఆయన స్థానంలో సరైన అభ్యర్థి కోసం వెతకగా.. నేరడగొండ జడ్పీటీసీగా ఉన్న అనిల్ జాదవ్ అయితే, బెటరని ఆయనను ఎంపిక చేశారు.

నిజానికి సిట్టింగు ఎమ్మెల్యేల్లో ఏ ఏడుగురిపై కూడా స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది. పలు సర్వేల్లో వీరు గెలిచే అవకాశాలు తక్కువే అని తేలింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థుల్ని మార్చాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. సిట్టింగుల స్థానాల్లో పోటీ చేస్తున్న వారిలో కడియం శ్రీహరి గతంలో మంత్రిగా పనిచేశారు. అసిఫాబాద్ నుంచి పోటీ చేయనున్న కోవ లక్ష్మి కూడా గతంలో ఇక్కడినుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. వీళ్లందరికీ అటు బీఆర్ఎస్, కేసీఆర్ ఇమేజ్‌తోపాటు, వ్యక్తిగత ఇమేజ్ కలిసొస్తే గెలుపు తథ్యమని అధిష్టానం నమ్ముతోంది.