Nara Lokesh: లోకేష్‌ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు..? వైసీపీ సర్వేలో ఏం తేలింది..?

చంద్రబాబును సరైన ఆధారాలు లేకుండా హడావుడిగా అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు దాన్ని సమర్ధించుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో మరిన్ని చర్యలు తీసుకోవడానికి భయపడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 17, 2023 | 07:08 PMLast Updated on: Sep 17, 2023 | 7:08 PM

Why Hasnt The Ap Government Arrested Nara Lokesh In The Skill Development Scam

Nara Lokesh: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అంటూ వైసీపీ సర్కార్ చంద్రబాబును మూసేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తోసేసింది. తర్వాత లోకేష్ వంతు అని చెప్పిన అధికార పార్టీ నేతలు సైలెంటయ్యారు. ఇంతకీ వారు ఎందుకు వెనకాముందాడుతున్నారు..? అధికారపార్టీ సర్వేలో ఏం తేలింది..?
సర్వేలో ఏం తేలింది..?
చంద్రబాబును సరైన ఆధారాలు లేకుండా హడావుడిగా అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు దాన్ని సమర్ధించుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో మరిన్ని చర్యలు తీసుకోవడానికి భయపడుతోంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలను నిశితంగా పరిశీలించిన వైసీపీ హైకమాండ్ మూడు సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. వారి ఆస్థాన ఐప్యాక్‌తో పాటు చెవిరెడ్డి సర్వే, మరో సర్వేను వేర్వేరుగా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా చేయించింది. ఆ ఫలితాల ఆధారంగా లోకేష్‌ను అరెస్ట్ చేయడంతో పాటు మరింత మంది టీడీపీ నేతలను కటకటాల్లోకి నెట్టాలని భావించింది. అయితే సర్వే ఫలితాలు మాత్రం వైసీపీ ఊహించిన దానికి భిన్నంగా ఉన్నాయని తేలింది. మూడు సర్వేల్లోనూ కాస్త అటూ ఇటుగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు గుర్తించారు. చంద్రబాబు అరెస్టును దాదాపు 60మంది వ్యతిరేకించగా కేవలం 40మంది మాత్రమే సమర్ధించారు. అదే ఇప్పుడు లోకేష్‌ను అరెస్ట్ చేసినా లేదా చంద్రబాబుపై మరిన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లోకి మరింత వ్యతిరేక సంకేతాలు వెళతాయని పార్టీ హైకమాండ్‌కు సర్వేలతో అర్ధమైంది. అది 70-30కి చేరితే ఓటమి తప్పదన్న సంకేతాలు కలవరపెట్టాయి. దీంతో కాస్త దూకుడు తగ్గించాలని నిర్ణయించింది.
ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్లాయి..?
చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజల్లోకి సరైన విధంగా తీసుకెళ్లలేకపోయామన్న భావన వైసీపీ పెద్దలకు స్పష్టమైంది. చంద్రబాబు అరెస్ట్, ఆయన్ను మంగళగిరి తీసుకొచ్చిన విధానం, ఆ తర్వాత జైలుకు తరలింపు, రెండ్రోజుల పాటు చంద్రబాబును నిద్రకూడా పోనివ్వని విధానం, బాబును అరెస్ట్ చేసిన తర్వాత మంత్రులు స్పందించిన తీరు.. అన్నీ ప్రజల్లోకి వ్యతిరేకంగా వెళ్లాయి. చంద్రబాబు అరెస్ట్ సరైనదా.. కాదా.. అని కాకుండా అరెస్ట్ చేసిన విధానం, వైసీపీ స్పందించిన తీరును ప్రజలు సమర్ధించలేదు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన వైసీపీ ప్రభుత్వం.. కేవలం రూ.3వందల కోట్ల స్కామ్‌లో ఆయన్ను అరెస్ట్ చేయడం, అందులోనూ సరైన ఆధారాలు లేకపోవడం వంటివి జనంలోకి బలంగా వెళ్లాయి. బాబు అరెస్టైన తర్వాత సజ్జల మీడియాతో రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ రెండ్రోజుల క్రితం ఆయన మాట్లాడిన మాటలు పార్టీలో కలవరాన్ని చెప్పకనే చెప్పాయి. ప్రజల్లోకి తప్పుగా వెళుతోందని ఆయన వాపోయారు.
వైసీపీలో అంతర్మథనం..
లోకేష్‌ను కూడా అరెస్ట్ చేసేసి, టీడీపీని అల్లకల్లోలం చేయాలని, ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లిపోవాలని ముఖ్యమంత్రి జగన్ భావించారు. సార్ కోరుకున్నట్లే సీఐడీ చీఫ్ కూడా స్కిల్ స్కామ్ గురించి మాట్లాడకుండా ఫైబర్ నెట్ స్కామ్, రింగ్ రోడ్ స్కామ్ అంటూ లోకేష్‌ అరెస్ట్ తప్పదన్న సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన పరిణామాలతో వైసీపీ హైకమాండ్ పునరాలోచనలో పడింది. ఇప్పటికే తాము కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నామన్న అంశం ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లింది. ఇప్పుడు లోకేష్ లేదా ఇతర నేతలను టచ్ చేస్తే అది మరింత నెగెటివ్ అవుతుందని, దాన్నుంచి బయటకు రాలేమని అర్థమైంది. నిడదవోలులో జగన్.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్‌లో అంతకుముందున్న దూకుడు లేదు. పైకి నవ్వుతూనే ఉన్నా మాటల్లో తడబాటు కనిపించింది. దీంతో తప్పు చేశామేమోనన్న అంతర్మథనంలో వైసీపీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కూడా ఇప్పటికే ఎన్నికల ముందు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని, ఇప్పుడు మిగిలిన వారి జోలికి వెళితే మొత్తానికే మోసం వస్తుందని పార్టీ పెద్దలకు మొర పెట్టుకున్నారు. దీంతో ప్రస్తుతానికి తమ రివెంజ్ పాలిటిక్స్‌కు బ్రేక్ ఇవ్వాలని వైసీపీ డిసైడైంది.