Jana Sena : జనసైనికుల అత్యుత్సాహం.. అప్పుడే ఎందుకంత తొందర
ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనే సామెత విన్నారా. ఇప్పుడు జనసేన సోషల్ మీడియా వింగ్ చేస్తున్న పోస్ట్‌లు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనే సామెత విన్నారా. ఇప్పుడు జనసేన సోషల్ మీడియా వింగ్ చేస్తున్న పోస్ట్‌లు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మే 13న అలా పోలింగ్ ముగిసిందో లేదో.. ఇలా కృతజ్ఞతా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు సహకరించిన టీడీపీ నేత వర్మకు చాలా థాంక్స్ అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
ఇక పవన్ కోసం ప్రచారం చేసిన జబర్దస్థ్ ఆర్టిస్టులకు, జూనియర్ ఆర్టిస్టులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఫారిన్ నుంచి పార్టీకి ఫండ్స్ పంపించిన ఎన్నారైలకు, పవన్ కోసం విదేశాల నుంచి వచ్చి క్యాంపెయిన్ చేసిన ఎన్నారైలకు థాంక్స్ చెప్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. రీసెంట్‌గా ముద్రగద పద్మనాభం గురించి కూడా జనసేన కార్యకర్తలు ఓ పోస్ట్ వైరల్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ ఓ కామెంట్ చేశారు. పోలింగ్ అలా ముగిసిందో లేదో.. ముద్రగడ నామకరణ మహోత్సవ ఆహ్వానం అంటూ ఓ ఇన్విటేషన్ కార్డ్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు జనసేన కార్యకర్తలు. పవన్ గెలుస్తాడు కాబట్టి ముద్రగడ పేరు మార్చే కార్యక్రమానికి అంతా హాజరు కావాలంటూ ఇన్విటేషన్ పోస్ట్ చేశారు.
ఇలాంటి సెటైరికల్ పోస్ట్‌లు, కృతజ్ఞతా పోస్ట్‌లు వేయడం తప్పు కాదు. కానీ దానికి ఓ సమయం సందర్భం ఉంటుంది. పోలింగ్ పూర్తై వారం కూడా కాలేదు. పిఠాపురంలో పరిస్థితి అనుకూలంగానే ఉన్నా.. రిజల్ట్ ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటప్పుడు ఎంత అనుకువగా ఉంటే అంత బెటర్. అలా కాకుండా అప్పుడే గెలిచేశాం అనే ఇలాంటి పోస్ట్‌లు వేస్తే అది అత్యుత్సాహానికి సంకేతం తప్ప ఎలాంటి లాభం లేదు అంటున్నారు ఈ పోస్ట్‌లు చూసిన విశ్లేషకులు.
గత ఎన్నికల్లో భీమవరంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. పవన్ ఆల్మోస్ట్ గెలిచేశాడు అని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం వేరుగా వచ్చింది. గతంలో పోలిస్తే ఇప్పుడు జనసేన పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ఇలాంటి ముందుజాగ్రత్త చర్యలు పార్టీకి అంత మంచివి కావు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నా.. రిజల్ట్ వచ్చాక సెలబ్రేట్ చేసుకుంటే బెటర్ అని సలహా ఇస్తున్నారు.