Janasena – BJP: టీడీపీతోనే పొత్తు సంకేతాలు.. పవన్ బీజేపీని బలి చేస్తున్నారా ?
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో నాలుగేళ్లు కలిసి తిరిగి.. తీరా ఎన్నికల సమయానికి వదిలేయడం సరికాదని బీజేపీ నేతలు అంటున్నారు. పవన్ వదిలేస్తే ఏం చేయాలి.. ఎలాంటి అడుగులు వేయాలన్నది బీజేపీ నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది.
అనుకున్నదే అయింది ! చేసిన తప్పే మళ్లీ చేయను.. బలిపశువు కాను అంటూ పవన్ కల్యాణ్ పొత్తుల మీద పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. ఐతే తాను బలి పశువును కాన్న పవన్.. బీజేపీని బలి చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. సేనాని మీద కమలం పార్టీ పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కావు. పవన్ ఏమన్నా భరించారు.. ఏం చేసినా సహించారు. జనసేనతో బీజేపీది అలాంటి అవసరం మరి ! అలాంటి పవన్ ఇప్పుడు బీజేపీకి పెద్ద హ్యాండ్ ఇవ్వబోతున్నారన్నది క్లియర్‌గా అర్థం అయింది. దీంతో బీజేపీ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. బీజేపీకి ఎందుకు దూరం జరుగుతున్నానో చెప్తూనే.. టీడీపీతో ఎందుకు కలవాల్సి వస్తుందో మచిలీపట్నం వేదికగా చెప్పకనే చెప్పారు పవన్. ఎవరితో అయిన పొత్తు పెట్టుకోవచ్చు తప్పు లేదు.. ఐతే మరి కోటి ఆశలు పెట్టుకున్న కమలం పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్. నాలుగేళ్లలో రెండు పార్టీలు కలసి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తే.. టీడీపీతో పెద్దగా అవసరం ఉండదని పవన్ భావించారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేన కూటమి ఎదుగుతుందని అనుకున్నారు. నిజానికి మచిలీపట్నంలో చెప్పింది కూడా అదే ! కట్ చేస్తే సీన్ మాత్రం ఫుల్ రివర్స్. పొత్తులో ఉన్న మాటే కానీ.. కలిసింది లేదు.. కలసి నడిచింది లేదు.. కలిసి పోరాడింది లేదు. దీంతో బంధానికి బీటలు పడే స్థాయికి వచ్చింది పరిస్థితి. లెట్స్ బ్రేకప్ అని బందరు వేదికగా చెప్పకనే చెప్పారు పవన్. కేవలం బీజేపీతో మాత్రం కలిసి వెళ్లడానికి పవన్ సిద్ధంగా లేరని.. బందరులో మాటలతో అర్థం అయింది. ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయబోనని.. బలిపశువును కానివ్వబోనని చెప్పి బీజేపీకి పరోక్ష సంకేతాలు ఇచ్చారు పవన్. టీడీపీతో కలిసేందుకు పవన్ సిద్ధం అవుతుంటే.. సైకిల్‌తో ప్రయాణం బీజేపీకి ఇష్టం లేదు. సైకిల్‌ను వదిలేసి బీజేపీతో ట్రావెల్ చేసేందుకు పవన్ ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ యాంగిల్‌లో చూసినా.. కమలానికి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో బలోపేతం కావాలని ఆశలు పడ్డ, పడుతున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో బలిపశువు కావడం ఖాయంగా అర్థం అవుతోంది. ఐతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో నాలుగేళ్లు కలిసి తిరిగి.. తీరా ఎన్నికల సమయానికి వదిలేయడం సరికాదని బీజేపీ నేతలు అంటున్నారు. పవన్ వదిలేస్తే ఏం చేయాలి.. ఎలాంటి అడుగులు వేయాలన్నది బీజేపీ నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది.