Vijaya Shanthi: రాములమ్మ గారూ మీ మనసులో ఏముందో కాస్త చెప్పండి
త్వరలోనే కమలానిికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నట్టుగా చెబుతున్నారు. అందులో భాగంగానే విజయశాంతి ఇప్పటి నుంచే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం మొదలు పెట్టరాన్నది ఒక వాదన.
అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్‌లో కనిపించినంతగా బీజేపీలో ఉండదు. వ్యక్తుల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నా పైకి అంతా ఆల్ ఈజ్ వెల్ అన్నట్టే వ్యవహరిస్తారు.ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం అరుదు.ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపీలో కలహాల కాపురం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది. ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించడంపై అసంతృప్తితో ఉన్న విజయశాంతి అక్కడి నుంచి వెళ్లిపోయి తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
నల్లారిపై ఎందుకంత వ్యతిరేకత ?
అవును నిజమే…నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకించిన మాట నిజమే. అది బహిరంగ రహస్యమే. అలా వ్యతిరేకించినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయనే చివరి సీఎం. రాష్ట్ర విభజన జరిగిన 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజకీయం మారిపోయింది. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ జెండా కప్పుకున్నారు. బీజేపీ అగ్రనాయకత్వమే ఆయనకు పెద్ద పీట వేసింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలను కూడా ఆహ్వానించి ఉండొచ్చు. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి హాజరై ఉండొచ్చు. జాతీయ పార్టీ అన్నాక అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు వివిధ సందర్భాల్లో కలుస్తూ ఉంటారు. నల్లారి కూడా అలాగే వచ్చి ఉండొచ్చు.ఆ మాత్రానికి మొహం తిప్పుకుని వెళ్లిపోయాలా ? మరి రాములమ్మ అలా ఎందుకు చేశారు ?
కిరణ్ ఒక్కరే వ్యతిరేకించారా ?
సుజనా చౌదరి, సీఎం రమేశ్, పురంధేశ్వరి ఇలా చాలా మంది ఏపీ నేతలు నాడు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించారు. కానీ ఇవాళ వాళ్లే బీజేపీ కండువా కప్పుకుని తిరుగుతున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఒక్కరిని కూడా బీజేపీలో చేర్చుకునేది లేదని బీజేపీ జాతీయ స్థాయిలో ఏదైనా విధానం పెట్టుకుని ఉండి ఉంటే అప్పుడు నల్లారితో పాటు అందర్నీ వ్యతిరేకించవచ్చు. కానీ అమిత్ షా,నడ్డాకు లేని అభ్యంతరం విజయశాంతికి ఎందుకొచ్చినట్టు ?
విజయశాంతి బీజేపీపై అసంతృప్తితో ఉన్నారా ?
రాజకీయాలన్నాక, పైగా ఎన్నికల సమయంలో అనేక అంశాలు ప్రచారంలోకి వస్తాయి. ప్రస్తుతం రాములమ్మ మీద కూడా అలాంటి ప్రచారం ఒకటి ఉంది. త్వరలోనే కమలానిికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నట్టుగా చెబుతున్నారు. అందులో భాగంగానే విజయశాంతి ఇప్పటి నుంచే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం మొదలు పెట్టరాన్నది ఒక వాదన. కొంతకాలం క్రితం రాజాసింగ్ పైనా అసంతృప్తి వ్యక్తం చేసిన విజయశాంతి తాజాగా నల్లారిని టార్గెట్ చేయడం పార్టీ మార్పునకు సంకేతమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.