వైసీపీలో జగన్ ఒంటరి వాడేనా ? నేతల గప్ చుప్ వెనుకున్న కథేంటి ?
తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. జగన్ హయాంలోనే యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ...ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్ని పార్టీల నేతలు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు.
తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. జగన్ హయాంలోనే యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ…ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్ని పార్టీల నేతలు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీశారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా జగన్ ను ఉతికి ఆరేస్తున్నారు. సీబీఐతో విచారణ చేయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో జగన్ పై దాడి చేస్తున్నా…వైసీపీ నేతలు అదే స్థాయిలో తిప్పికొట్టలేకపోతున్నారు. ఐదేళ్ల పాటు మంత్రి పదవులతో పాటు కీలకంగా వ్యవహరించిన వారు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అసలే అధికారం లేదు…అలాంటపుడు మనమెందుకు జగన్ కు మద్దతుగా మాట్లాడాలనే ధోరణితో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలపై విరుచుకుపడిన మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేశ్, సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటి నేతలు అడ్రస్ లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమెందుకు స్పందించాలనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అనవసరంగా స్పందించి…అధికార పార్టీకి ఎందుకు టార్గెట్ కావాలని అనుకుంటున్నారు.
తిరుమల లడ్డు వ్యవహారంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రమే జగన్ కు బాసటగా నిలిచారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణారెడ్డిలు…టీటీడీ మాజీ ఛైర్మన్లుగా చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చుకున్నారు తప్పా…పార్టీ పరంగా కాదనే వాదనలు కూడా ఉన్నాయి. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజాలు… ప్రభుత్వ ఆరోపణలను ఆలస్యంగా తిప్పికొట్టారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. కష్టకాలంగా అండగా ఉండాల్సిన నేతలు…చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు అయిపోయారు. జగన్ కు అనుకూలంగా మాట్లాడితే…కూటమి ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఐదేళ్ల కాలంలో తమను కలవడానికి కూడా ఇష్టపడని జగన్…ఇపుడు తమ మద్దతు ఆశించడం కూడా తప్పేనని కొందరు వైసీపీ నేతలు మనసులో మాటను బయటపెడుతున్నారు. అసలే సెన్సిటివ్ వ్యవహారం…పైగా హిందువుల సెంటిమెంట్ విషయంలో తలదూర్చకపోవడమే మంచిదని తమ సన్నిహితులు వద్ద చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారని…తమను ఏనాడూ పట్టించుకోలేదని…చీడపురుగుల చూసేవాడని కొందరు మాజీ ఎమ్మెల్యేలు అనుచరులతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో తమను చేర దీసి…సమస్యలను విని ఉంటే…ఇప్పుడు జగన్ కు నేతలు మద్దతగా నిలిచేవారని అంటున్నారు. తమ అవసరం ఉన్నపుడు పిలిచి…లేనపుడు అంటిముట్టినట్లు వ్యవహరిస్తే…పరిస్థితి ఇలాగే ఉంటుందని వైసీపీ సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు ఒకలా…లేనపుడు మరో ఉండకూడదని హితబోధ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మనం ఎదిస్తే…అదే వస్తుంది అనే సామెత ఉంది. జగన్ విషయంలో అదే నిర్దారణ అయింది. గత ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ప్రభుత్వాన్ని అక్కడి నుంచే నడిపించారు. తన ఇంటినే సచివాలయంలా మార్చేశారు. మంత్రులైనా, సీనియర్ నేతలైనా, ఐఏఎస్ లు, ఐపీఎస్ లైనా సరే…మాట్లాడేందుకు సమయం ఇచ్చేవాడు కాదు. కనీసం కలవడానికి కూడా ఇష్టపడే వాడు కాదు. ఎంతో మంది నేతలు ఇంటి దాకా వెళ్లినా…గేటు లోపల అడుగుపెట్టనిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఐదేళ్ల పాటు తానేం చేసినా నడుస్తుందని…తానే ఒక చక్రవర్తిలా…నియంతలా వ్యవహరించాడు. ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే…శాసనసభ్యులను తన కాళ్ల కింద చెప్పుల్లా చూశాడు. ఎమ్మెల్యేలు కానీ. మంత్రులు కానీ…జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ముందు అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందే. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డిల గ్రీన్ సిగ్నల్ వస్తేనే…పార్టీ నేతలను కలిసేవాడు జగన్. మంత్రులైనా, ఎమ్మెల్యేలైకైనా…అసెంబ్లీ సమావేశాల్లో మాత్రమే దర్శనం ఉండేది. ఆ తర్వాత ఏ మంత్రి కూడా ప్రత్యక్షంగా కలిసిన సందర్భాలు లేనే లేవు. ఎవరైనా సరే తమ సమస్యలను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకే చెప్పుకునే వారు.
ఐదేళ్ల కాలంలో ఎంత మంది ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా కలిశారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టాల్సిందే. ఎంత ఫోటుగాడైనా…మరెంత ప్రజాదరణ ఉన్న నేత అయినా సరే…తనకు ఇష్టముంటేనే కలిసేవాడు. లేదంటే గేటు బయట నుంచే పంపించేసేవారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులను కలిశారు. అది కూడా సర్వేల్లో పాజిటివ్ టాక్ వచ్చిన నేతలను మాత్రమే. ఐప్యాక్ సర్వేలో నెగిటివ్ టాక్ వచ్చిన నేతలను…ఆమడదూరం పెట్టేశాడు. వారినొక అంటరాని నేతల్లా చూశాడు. టికెట్ల కోసం కాళ్లకు బలపం కట్టుకొని తిరిగినా…కనీసం గేటు లోపలికి రానివ్వలేదు. మీరెంత, మీ స్థాయి ఎంటి అనేలా వ్యవహరించాడు. అసెంబ్లీ టికెట్లు దక్కిన నేతలను బీ ఫామ్ ఇచ్చే సమయంలోనే కలిశాడు. అందర్ని కలిశాడా అంటే అది లేదు. అందులోను కొందరికి మాత్రమే బీఫామ్ లు ఇచ్చాడు. మిగిలిన వారికి సజ్జల రామక్రిష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డిలో పంపిణీ చేశారు. కొన్ని సందర్భాల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వారికే అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న వాదనలు కూడా ఉన్నాయి.
సీన్ కట్ చేస్తే…2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలయింది. జస్ట్…11 సీట్లకే పరిమితం అయింది. కూటమి 164 సీట్లతో జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ పట్టున్న జిల్లాల్లోనూ…కూటమి కోలుకోనివ్వకుండా చేసింది. ఒక్క కడపలో మాత్రమే వైసీపీని ప్రజలు ఆదరించారు. మిగిలిన చోట్ల ఆ పార్టీని అరేబియా సముద్రంలో కలిపేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేతలు ఒక్కొక్కరుగా జగన్ కు రాం రాం చెబుతున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి తొలిసారి ఊహించని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత…నేతలు ఒక్కొక్కరుగా జగన్ కు దూరమవుతున్నారు. పార్టీకి రాజీనామా చేసి తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇంకొందరు పార్టీలో ఉన్నప్పటికీ…జగన్ తో అంటిముట్టినట్లు వస్తున్నారు. మరికొందరు మెరుపుతీగల్లా కనిపించిపోతున్నారు. విజయవాడలో వరదల బీభత్సంతో ఇళ్లు, నీళ్లు ఏకమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించినా…కీలక నేతలెవరు పెద్దగా పక్కన కనిపించలేదు. చంద్రబాబు కొట్టిన దెబ్బతో జగన్ కోలుకోవడం అంత ఈజీ కాదని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా జగన్ సమాధి కట్టాడని…జగన్ కోలుకోలేని విధంగా స్ట్రోక్ ఇచ్చారని అంటున్నారు. దీన్నుంచి కోలుకోవాలంటే దేవుడే జగన్మోహన్ రెడ్డిని రక్షించాలని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎవర్ని పట్టించుకోకుండా విర్రవీగితే…పరిస్థితి ఇలాగే ఉంటుందని నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారు వైసీపీ నేతలు. గత ఐదేళ్ల పాలనపై కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడినా…అన్నింటికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే సమాధానం చెప్పాల్సి వస్తోంది. అన్నింటికి ఆయన్నే ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే…జగన్ మాత్రం ఒంటరిగా…ఏకాకిలా కౌంటర్ ఇవ్వాల్సి వస్తోంది.