Andhra Pradesh: ఏపీలో వేగంగా మారుతోన్న రాజకీయం.. టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందా..?
ఒకటి రెండు ఎగ్జిట్‌పోల్స్ మినహా.. మిగతావన్నీ కర్నాటకలో కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చేశాయ్. దీంతో ఆ ఫలితం ఇప్పుడు పక్క రాష్ట్రాల మీద కనిపించనుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుంది. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ఆ ఎఫెక్ట్ క్లియర్‌గా ఉంటుంది.
Andhra Pradesh: కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. నిజానికి అది ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలే అయినా.. పక్క రాష్ట్రాల రాజకీయాల్ని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఒకటి రెండు ఎగ్జిట్‌పోల్స్ మినహా.. మిగతావన్నీ కర్నాటకలో కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చేశాయ్. దీంతో ఆ ఫలితం ఇప్పుడు పక్క రాష్ట్రాల మీద కనిపించనుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుంది. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ఆ ఎఫెక్ట్ క్లియర్‌గా ఉంటుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత.. బీజేపీ నాయకత్వం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెడుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఏపీలోనూ కొత్త రాజకీయానికి వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఒకవైపు టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. బీజేపీ అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీని కలుపుకొని వెళ్లాలనే ఈ రెండు పార్టీల ప్రతిపాదన వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేనతో కలిసి రావాలని బీజేపీ దగ్గర పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు ఉంచారు. ఐతే తమ నిర్ణయం ఏంటి అనేది.. కమలం పార్టీ నుంచి ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే ఈ రెండు పార్టీల పొత్తు.. ఫలితాలపై బీజేపీ సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నట్లు ఈ వ్యూహాలతో అర్థమవుతోంది. అందులో భాగంగా రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
దీని ప్రకారం పార్టీలో చేరికలపై ఫోకస్ చేయాలని నిర్దేశించింది. ప్రధానంగా కాపు సామాజిక వర్గం నుంచి కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించేలా బీజేపీ ప్లాన్ చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఇలా రాష్ట్రంలో సొంతంగా ఎదగాలనే బీజేపీ నిర్ణయం తీసుకుందని కొందరు అంటుంటే.. కర్ణాటక ఫలితాల ఆధారంగా ఆ నిర్ణయం మారే చాన్స్ ఉందని మరికొందరి అభిప్రాయం. కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా, ఒక వెలుగు వెలిగిన బీజేపీ ప్రభ దేశవ్యాప్తంగా కాస్త తగ్గింది అనడంలో ఎలాంటి అనుమానంలేదు. ఇలాంటి సమయంలో.. వచ్చే ఎన్నికల్లో పాత, కొత్త మిత్రుల మద్దతు అవసరం. కర్ణాటక ఫలితాలు తేడా కొడితే.. ఏపీలో బీజేపీ నిర్ణయం మారే చాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఆ సూత్రం పక్కాగా తెలిసిన పార్టీ బీజేపీ. అందుకే కర్ణాటక ఫలితం, భవిష్యత్ ప్రయాణం.. ఇలాంటి లెక్కలన్నీ వేసుకొని.. ఏపీలో బీజేపీ నిర్ణయాలు కనిపించబోతున్నాయన్నది మాత్రం క్లియర్.