మంత్రులు, కాంగ్రెస్‌ నేతల నిర్మాణాలు.. హైడ్రాకు వీటిని కూల్చే దమ్ముందా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2024 | 05:03 PMLast Updated on: Aug 24, 2024 | 5:03 PM

Will Hydra Demolishes The Congress Leaders Illegal Constructions

అక్రమ నిర్మాణాల అంతు తేలుస్తూ హైడ్రా దూసుకుపోతోంది. ఎవరు.. ఏంటి అని కాదు.. అక్రమం అని తేలిందా కూల్చేయడమే అన్నట్లుగా దూకుడు చూపిస్తోంది. జన్వాడలో కేటీఆర్‌ ఫామ్‌హౌస్ అక్రమం అంటూ.. హైడ్రా ఇచ్చిన నోటీసులతో మొదలైన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తర్వాత ఈ వ్యవహారం మరింత కాక రేపుతోంది. ఐతే హైడ్రాను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ సర్కార్ కొంతమందినే టార్గెట్ చేస్తోందని.. అక్రమంగా నిర్మించిన ప్రతీ కట్టడాన్ని కూల్చే దమ్ముందా అంటూ.. బీఆర్ఎస్‌ కొత్త డిమాండ్‌ను తెరమీదకు తీసుకువస్తోంది. కాంగ్రెస్ నేతలు, మంత్రులు, మాజీలు.. వ్యాపారవేత్తలకు చెందిన నిర్మాణాలను హైలైట్ చేస్తూ.. రేవంత్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. హిమాయత్‌సాగర్‌కు ఆనుకొని.. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన సోదరులకు గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయ్. రెడ్ కలర్‌ రూఫ్‌టైల్స్‌తో ఉన్న బిల్డింగ్‌ పొంగులేటిదే. ఈ నిర్మాణాల పక్కనే జలాశయం ఉంది. ఈ గెస్ట్‌హౌస్‌లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయ్‌. దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ హైలైట్ చేస్తోంది. ఇక అటు ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.. హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌లోనే గెస్ట్‌హౌస్‌ నిర్మించుకున్నారు. ఒకప్పుడు జలాశయాల దగ్గర ఫాంహౌస్‌ల కల్చర్ ఉండేది. ఐతే గెస్ట్‌హౌస్‌ సంస్కృతిని పట్నం వారే పట్నానికి ప్రవేశపెట్టారనే ఆరోపణలు ఉన్నాయ్. దీన్ని కూల్చే దమ్ముందా అని ఇప్పుడు కారు పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కూడా.. హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌లో గెస్ట్‌హౌస్‌ నిర్మించుకున్నారు. విశాలమైన రోడ్డుతో చెరువు కనిపించకుండా చుట్టేసిన ఈ గెస్ట్‌హౌస్‌కు అనంతం అని పేరు పెట్టారు. చుట్టూ భారీ ప్రహరి నిర్మాణంతో పాటు లోపల కూడా భారీ నిర్మాణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయ్. అటు హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి భారీ స్థలం ఉంది. ఏకంగా సాగర్‌లో భారీ ట్రక్కులతో వందల క్యూబిక్‌ మీటర్ల మట్టి పోసి రిజర్వాయర్‌ కుంచించుకుపోయేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయ్‌. ఆరు అడుగుల ఎత్తున కొత్తగా మట్టి నింపారనేది స్థానికుల మాట. ప్రస్తుతానికి చుట్టూ భారీ ప్రహరి నిర్మాణం పూర్తయింది. ఇప్పటికైతే ఇంకా నిర్మాణాలు మొదలు కాలేదు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కూడా ఎఫ్‌టీఎల్‌ జోన్‌లో భారీ నిర్మాణం ఉందనే ఆరోపణలు ఉన్నాయ్. దశాబ్దాల కిందే పూర్తిగా బఫర్‌జోన్‌లో పెద్ద ఎత్తున ఫాంహౌస్‌ నిర్మాణం జరిగింది. కొంతకాలం కిందట మరో భవనాన్ని కూడా నిర్మించారు. అదైతే పూర్తిగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఉందనేది ప్రధాన ఆరోపణ. ఇక రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామ పరిధిలో సీఎం రేవంత్‌రెడ్డి సమీప బంధువు రవికాంత్‌రెడ్డి పేరుతో ఓ బిల్డింగ్ ఉంది. 111 జీవో నిబంధనలకు నీళ్లొదిలి చేపట్టిన నిర్మాణం ఇది. నిబంధనల ప్రకారం ఉన్న విస్తీర్ణంలో కేవలం పది శాతం మాత్రమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి అందమైన భవనాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ నిర్మాణాలకు వట్టినాగులపల్లి అప్పటి సర్పంచ్‌ అనుమతులు ఉన్నాయని తెలుస్తోంది. శ్రీనిధి విద్యా సంస్థల యజమాని కేటీ మహికి.. హిమాయత్‌సాగర్‌ను ఆనుకొని ఒక మహా సామ్రాజ్యంలాంటి నిర్మాణం ఉంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి ఆయన చాలా క్లోజ్ అనే టాక్ ఉంది. ఈ నిర్మాణం కొంత ఎఫ్‌టీఎల్‌లో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. బఫర్‌జోన్‌ను పూర్తిగా ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేపట్టారట. గండిపేట జలాశయం ఎఫ్‌టీఎల్‌ పరిధిలో రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి సమీప బంధువుకు ఓ ఇల్లు ఉందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు ఆమె. ఆ నిర్మాణంలో కొంతమేర ఎఫ్‌టీఎల్‌ పరిధి ఉండగా… బఫర్‌జోన్‌లోనూ చాలా మేరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పంట పొలాల మధ్యలో రాజసాన్ని ఒలకబోసేలా నిర్మించిన శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఓ ఫాంహౌస్‌ ఉంది. హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ హద్దు రాయి సాక్షిగా ఈ భారీ నిర్మాణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయ్. నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. అయినప్పటికీ ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇక గండిపేట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో గ్రీన్‌కో గ్రూపు ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌కి గెస్ట్ హౌస్ ఉంది. ప్రధాన రహదారి నుంచి మొదలై జలాశయం ఎఫ్‌టీఎల్‌లోకి చొరబడి మరీ ఈ గెస్ట్‌హౌస్‌ నిర్మాణాన్ని చేపట్టారు. గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలో ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని బిల్డింగ్‌లను హైడ్రా కూల్చేసింది. ఐతే సెలబ్రిటీల ఇళ్లు హైడ్రాకు కనిపించడం లేదా.. వారికి ఒక న్యాయం.. తమకు ఒక న్యాయమా అని సామాన్యుడు నిలదీస్తున్నాడంటూ.. బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. సామాన్యులను ఇబ్బంది పెట్టడం కాదు.. దమ్ముంటే వీటిని కూల్చండి.. వీటి జోలికి వెళ్లే సీన్ మీకుందా అంటూ సవాల్ విసురుతున్నాయ్ బీఆర్ఎస్ శ్రేణులు..