నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. మూడేళ్ల క్రితం తాలిబన్ ఫైటర్లకు చుక్కలు చూపించిన గ్రూప్. 2021లో ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్నీ ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ లోయను మాత్రం ఆక్రమించుకోలేకపోయారు. అందుకు కారణం నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్ల పోరాటమే. పంజ్‌షీర్ లోయలోకి ఒక్కరంటే ఒక్క తాలిబన్ ఫైటర్‌నూ అడుగు పెట్టనీయలేదు NRF. దీంతో ఒక దశలో పంజ్‌షీర్ లోయపై ఆశలు వదిలేసుకున్నారు తాలిబన్లు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ రంగంలోకి దిగింది. తాలిబన్లకు మద్దతుగా పంజ్‌షీర్ లోయలో NRF ఫైటర్లపై డ్రోన్లతో దాడులు చేసింది. చివరికి 2021 సెప్టెంబర్ 6న పంజ్‌షీర్ లోయ కూడా తాలిబన్ల వశమైంది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల రాజ్యంగా మారిపోయింది. తాలిబన్లకు ఇస్లామాబాద్ అంతగా మద్దతు ఇవ్వడానికి తాను చెప్పినట్టల్లా ఆడతారన్న నమ్మకమే. కానీ, అది ఎంత పెద్ద తప్పో ఆ దేశానికి ఇప్పుడే తెలిసొచ్చింది. దీంతో NRFపై దాడులు చేయించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే NRFను కాపాడండి మహాప్రభో అని వేడుకుం టోంది. అందుకోసం తజకిస్తాన్ వెళ్లి NRF కాళ్లావేళ్లాపడుతోంది. మరి మూడేళ్ల క్రితం పంజ్‌షీర్ లోయలో జరిగిన అవమానాన్ని మరచిపోయి NRF ఇస్లామాబాద్‌న్‌కు మద్దతు ఇస్తుందా? తాలిబన్ల నుంచి పాకిస్తాన్ ను నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కాపాడుతుందా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం.. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆఫ్గాన్ తాలిబన్లకు మద్దతుగా ఇస్లామాబాద్ తయారు చేసిన తెహ్రీక్-ఇ-తాలిబన్లు కాబూల్‌తో చేతులు కలిపారు. తిరిగి పాకిస్తాన్‌పైనే దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో వైమానిక దాడులు చేసింది. ఆ దాడిలో 46 మంది అమాయకులు మరణించారు. దీంతో వేల మంది ఆఫ్ఘాన్ తాలిబన్లు పాకిస్తాన్‌వైపు దూసుకొచ్చారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రం తమదే అని సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం ఒక్కటే బ్యాలెన్స్ అనేలా ఉన్నాయి పరిస్థితులు. అదే జరిగితే మూడేళ్ల క్రితం ఆఫ్ఘాన్‌ను ఎలా ఆక్రమించేసుకున్నారో ఇప్పుడు పాకిస్తాన్‌లోనూ తాలిబన్ ఫైటర్లు అదే చేస్తారు. ఈ విషయం అర్ధం చేసుకున్న షరీఫ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొదట ఆఫ్ఘనిస్తాన్‌ను బెదిరించింది. తర్వాత తమ లక్ష్యం టీటీపీనే తప్ప మీరు కాదంటూ బుజ్జగించే ప్రయత్నం చేసింది. చివరికి తాలిబన్లు అస్సలు తగ్గరని తెలుసుకుని ISIను రంగంలోకి దించింది. ఇటీవల ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ తజకిస్తాన్‌లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు రహ్మాన్‌తో సమావేశమై కీలక చర్చలు జరిపారు. అందుకు సంబంధించిన ఓ ఫొటో ఆఫ్ఘాన్ తాలిబన్ల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఎందుకంటే, ఐఎస్ఐ చీఫ్ తజకిస్తాన్ పర్యటన లక్ష్యం ఏంటో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు తెలుసు. వివరంగా చెప్పాలంటే 2021 సెప్టెంబర్ 6న పంజ్‌షీర్ లోయను ఆక్రమించుకున్న కొద్ది రోజుల తర్వాత నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లు తజకిస్తాన్‌కు వెళ్లిపోయారు. వాళ్లు మళ్లీ పంజ్‌షీర్ లోయలో అడుగు పెడితే ఏం జరుగుతుందో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు తెలుసు. తమ సరిహద్దుల్లో కాచుక్కూర్చున్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ అమలు చేస్తున్న వ్యూహం కూడా అదే. NRFను మళ్లీ పంజ్‌షీర్‌లో దించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి అంతర్యుద్ధాన్ని రేపాలనేది పాక్ ఆలోచన. కానీ, అందుకు నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లు ఒప్పుకుంటారా? పంజ్‌షీర్ లోయను తిరిగి సొంతం చేసుకునే అవకాశం కోసమే NRF ఫైటర్లు ఎదురు చూస్తున్నారు. అందుకు పాకిస్తాన్ మద్దతు ఇస్తుందంటే అంగీకరించే అవకాశాలు లేకపోలేదు. పైగా NRFకు అహ్మద్ మసూద్ నాయకత్వం వహిస్తున్నారు. మసూద్ 1980, 90ల్లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ షా మసూద్ కుమారుడు. ఆయన ఒక ముజాహిదీన్ కమాండర్. సోవియట్, తాలిబన్ బలగాలను ఎదిరించారు. తన తండ్రి ఆశయం కోసం చివరి వరకూ పోరాడటానికి మసూద్ సిద్ధంగా ఉన్నాడు. అందుకే, పాకిస్తాన్ ప్రతిపాదనను మసూద్ కాదనడానికి అవకాశాలు తక్కువే. ఐతే, మూడేళ్ల తర్వాత పంజ్‌షీర్ లోయలో అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. 2021కి ముందు పంజ్‌షీర్ లోయ భౌగోళిక పరిస్థితులను NRF ఫైటర్లు ఎలా అయితే ఉపయోగించుకున్నారో ఇప్పుడు తాలిబన్ ఫైటర్లూ అదే చేస్తారు. ఐతే, ఇక్కడ పాకిస్తాన్ కేవలం NRFను మాత్రమే సాయం కోరడం లేదు.. ఇరాన్, తజకిస్తాన్, యూరప్ అంతటా తాలిబన్ వ్యతిరేక నాయకులను సంప్రదిస్తోంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో మరో అంతర్యుద్ధానికి దారితీసి తాలిబన్లను గద్దె దించాలని చూస్తోంది. మొదట నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లను బలోపేతం చేస్తారు.. తర్వాత ఆఫ్ఘాన్‌లో టీటీపీ స్థావరాలే లక్ష్యంగా మరిన్ని వైమానిక దాడులు దాడులు చేస్తారు. వీలైతే ఇతర దేశాల్లో ఉన్న తాలిబన్ వ్యతిరేక నాయకులనూ రంగంలోకి దించి ఆఫ్ఘనిస్తాన్‌ను చుట్టుముడతారు. ఫలితంగా ఒకేసారి ఎక్కువ లక్ష్యాలపై పోరాడలేక ఆఫ్ఘాన్ తాలిబన్లు లొంగిపోతారు. సింపుల్‌గా చెప్పాలంటే ISI మార్క్ మైండ్ గేమ్ ఇదే. కానీ, ఇవన్నీ చేయడానికి పాకిస్తాన్‌కు చాలా సమయం పడుతుంది. ఈలోగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు డ్యూరాండ్ లైన్ క్రాస్ చేస్తే పాకిస్తాన్ పనైపోయినట్టే. తాలిబన్ ఫైటర్లు ప్రస్తుతం ఆ దిశగానే అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. దాడులు చేయకపోయినా కీలక ఖైబర్ ప్రాంతాన్ని తమదిగా ప్రకటించుకోవడం ద్వారా ఆల్రెడీ యుద్ధం ప్రకటించేశారు. ఇలాంటి టైంలో NRF ఫైటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తే సరిహద్దులు దాటడానికి అస్సలు సంకోచించరు. కాబట్టి ISI మైండ్ గేమ్ తాలిబన్ల దగ్గర వర్క్‌ఔట్ అయ్యే అవకాశమే లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ చేసిన పాపాలన్నింటికీ శిక్ష అనుభవించి తీరాల్సిందే.[embed]https://www.youtube.com/watch?v=HD1vKpcsmbw[/embed]