NDA – Janasena – TDP: వైసీపీ, టీడీపీల్లో ఎన్డీఏలో చేరేదెవరు…! జనసేనకు ఆహ్వానం అందుతుందా…?
ఏపీలో బీజేపీ మిత్రులెవరు....? ఈ ప్రశ్నకు సమాధానం అత్యంత ఆసక్తికరం... జనసేన బీజేపీకి ఉందో లేదో తెలియని మిత్రపక్షం.. ఇక వైసీపీది బలవంతపు బంధం.. టీడీపీది రహస్య బంధం... అయితే మరి వీటిలో ఎన్డీయేలో చేరబోయేది ఎవరు...? ఎవరికి ఆహ్వానం అందబోతోంది....?
ఏపీలో బీజేపీ మిత్రులెవరు….? ఈ ప్రశ్నకు సమాధానం అత్యంత ఆసక్తికరం… జనసేన బీజేపీకి ఉందో లేదో తెలియని మిత్రపక్షం.. ఇక వైసీపీది బలవంతపు బంధం.. టీడీపీది రహస్య బంధం… అయితే మరి వీటిలో ఎన్డీయేలో చేరబోయేది ఎవరు…? ఎవరికి ఆహ్వానం అందబోతోంది….?
ఈనెల 18న ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరగబోతోంది. ఎనిమిదేళ్లలో మిత్రపక్షాలతో బీజేపీ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లూ ఎదురులేని బీజేపీ.. దేశంలో ఎదురుగాలి వీస్తోందన్న విషయాన్ని గ్రహించింది. 2024లో గెలుపు అంత ఈజీ కాదని అర్థమవడంతో వ్యూహాన్ని మార్చింది. ఒంటెత్తు పోకడలు మానేసి పాత మిత్రులను మరింత దగ్గర చేసుకోవడంతో పాటు కొత్తగా స్నేహాన్ని ఆశిస్తున్న పార్టీలను కలుపుకుపోవాలని భావిస్తోంది. చాలా పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి… మరి ఏపీలో ఏ పార్టీకి ఆహ్వానం వస్తుందన్నది మాత్రం ఆసక్తిని రేపుతోంది…
ఏపీలో బీజేపీ, జనసేనలు చాలాకాలంగా జర్నీ చేస్తున్నాయి. మధ్యలో కొంత దూరం పెరిగినా బంధం మాత్రం పూర్తిగా తెగిపోలేదు. పవన్ అప్పుడప్పుడు ఢిల్లీ పెద్దలను కలుస్తూనే వస్తున్నారు. అయితే ఇంకా ఎన్డీయే సమావేశానికి పవన్‌కు ఆహ్వానం అందలేదని సమాచారం. ఇక వైసీపీ, టీడీపీల్లో ఎవరికి ఎన్డీయేలోకి చేరాలన్న ఆహ్వానం అందుతుందన్నది ఆసక్తిని రేపుతోంది. వైసీపీ బీజేపీతో రహస్య బంధాన్ని నడుపుతోంది. కేంద్రం చెప్పిన ప్రతిదానికీ జగన్ తలఊపుతున్నారు. ఇటీవల జగన్‌ను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించిన బీజేపీ పెద్దలు ఎన్డీయేలో చేరాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే జగన్ అందుకు నిరాకరించారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల కారణంగా బయట నుంచే మద్దతు ఇవ్వాలన్న తమ విధానాన్ని కంటిన్యూ చేస్తానని ఆయన చెప్పారు. అయితే గోడ మీద పిల్లులు తమకు అవసరం లేదన్నది బీజేపీ ఆలోచన. దీంతో జగన్‌కు ఎన్డీయేలో చేరాలన్న ఆహ్వానం అందడం అనుమానే.
ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు చాలాకాలంగా బీజేపీతో కలసి నడవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నోసార్లు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ దక్కలేదు. అయితే అనుకోకుండా అమిత్‌షా నుంచి కాల్ రావడంతో ఆ అవకాశాన్ని ఆయన ఆబగా అందుకున్నారు. ఎన్డీయేలో చేరడానికి రెడీ అన్నారు. అయితే దానిపై అటు బీజేపీ కానీ, ఇటు టీడీపీ కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. చంద్రబాబు కూడా తన కేడర్‌కు పొత్తు ఉందా లేదా అన్నదానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు.
చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత బీజేపీ వైఖరిలో మార్పు వచ్చింది. వైసీపీపై కాస్త మెతక వైఖరిని అవలంభిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పక్కన పెట్టారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. చంద్రబాబుకు ఆమె దగ్గరి బంధువు కూడా. ఆమె అయితేనే మూడు పార్టీల మధ్య సయోధ్య సఖ్యంగా సాగుతుందన్నది బీజేపీ ఆలోచన. ఇక చిన్నమ్మ బాధ్యతలు తీసుకోగానే వైసీపీని టార్గెట్ చేశారు. ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. దీన్నిబట్టి చూస్తే టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎన్డీయే సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందుతుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. పిలుపు అందడం అంటే తమ మిత్రపక్షమని బహిరంగంగా చెప్పడం. మరి బీజేపీ దాన్నే కోరుకుంటుందా లేక తమ స్నేహాన్ని కొంతకాలం అలాగే రహస్యంగా ఉంచుతుందా అన్నది తేలాలంటే 18వరకు ఆగాల్సిందే.