TDP-Janasena: జనసేనకు టీడీపీ ఇచ్చేది 15 సీట్లేనా ?
జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయిస్తే.. అది మళ్లీ వైసీపీకే ప్లస్ అవుతుందని.. ఈ విషయం చెప్పి.. 15సీట్లు తీసుకునేందుకు పవన్‌ను ఒప్పించాలన్నది చంద్రబాబు ప్లాన్‌గా తెలుస్తోంది.
ఏపీ రాజకీయం అంతా కాపుల చుట్టూ.. ముఖ్యంగా జనసేన చుట్టు తిరుగుతోందిప్పుడు ! పవన్‌ను ఎట్టి పరిస్థితుల్లో కలుపుకొని తీరాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పొత్తు కూడా దాదాపు కన్ఫార్మ్ అయింది రెండు పార్టీలు మధ్య ! ఇప్పుడే చెప్పడం ఎందుకు అనుకున్నారో.. బీజేపీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదో కానీ.. ఎన్నికల నాటికి నిర్ణయం తీసుకుంటామని పవన్ అంటున్నారు. పైకి ఈ మాట వినిపిస్తున్నా.. పొత్తులకు, పంపకాలకు సంబంధించి తెరవెనక పావులు వేగంగా కదుపుతున్నాయ్.
సీట్ల విషయంలో పవన్ క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తున్నా.. టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సీట్ల పంపకాలకు సంబంధించి ఇప్పుడో కీలక విషయం రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. జనసేనకు 15సీట్లు మాత్రమే ఇచ్చేందుకు టీడీపీ ప్లాన్ చేస్తుందనే టాక్ నడుస్తోంది. గెలుపులో జనసేన కీలక పాత్ర పోషిస్తుందేమో కానీ.. గెలిచేంత బలం లేదని.. టీడీపీ భావిస్తోందని తెలుస్తోంది. కాపు సామాజికవర్గం కాకుండా.. మిగతా విషయాల్లో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ లేదన్నది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయిస్తే.. అది మళ్లీ వైసీపీకే ప్లస్ అవుతుందని.. ఈ విషయం చెప్పి.. 15సీట్లు తీసుకునేందుకు పవన్‌ను ఒప్పించాలన్నది చంద్రబాబు ప్లాన్‌గా తెలుస్తోంది. ఎన్నికలు అయ్యాక.. జనసేన నుంచి ఆశావహులకు అవసరం అయితే మండలిలో చోటు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
తక్కువలో తక్కువ 54 సీట్లు కావాలన్నది జనసేన డిమాండ్. ఈ కోరిక వెనక బలమైన కారణం ఉంది కూడా ! గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్ల కంటే.. వైసీపీ సాధించిన మెజారిటీ తక్కువ. అలాంటి స్థానాలు రాష్ట్రంలో 50 ప్లస్ ఉన్నాయని.. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అంగీకరిస్తే పొత్తుకు సిద్ధం అన్నట్లుగా జనసేన కనిపిస్తోంది. ఐతే అందులో మూడోవంతు సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. మరి జనసేన రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు జనసేనకు టీడీపీ.. టీడీపీతో పొత్తు జనసేనకు అవసరం ! గెలుపోటముల సంగతి పక్కనపెడితే.. జగన్ ను గద్దె దించాలన్నది ఇద్దరి కల. మరి ఇద్దరు ఒక్కటవుతారా.. సీట్ల పంపకాలతో తేడాలతో ఎవరి దారి వారు చూసుకుంటారా.. చంద్రబాబు డిమాండ్ కు పవన్ ఓకే చెప్తారా.. ఇవే ప్రశ్నలు రాజకీయవర్గాలను వెంటాడుతున్నాయ్.