BJP: గేర్ మార్చుతున్న బీజేపీ.. కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. ఎలక్షన్ టీమ్ రెడీ..!

సమయం లేదు మిత్రమా..! విపక్షాలకు ఏమాత్రం అవకాశమిచ్చినా మనం నిండా మునిగిపోతాం..ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేయకపోతే.. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ మనకు ఎదురుదెబ్బ తగిలే ప్రమాదముంది. బయటకు తీయండి అస్త్రాలు.. మన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాదు.. కొత్త ఓటర్లు కూడా మనకే పట్టం కట్టాలి..ఆ దిశగా అందరూ పనిచేయాల్సిందే.. ఇది బీజేపీ అధినాకత్వం.. పార్టీ శ్రేణులకు ఇచ్చిన సందేశం. బలంగా ఉన్న చోట ఎలాగో గెలుస్తాం.. అసలు బలహీనంగా ఉన్న చోటే.. మనం రాజకీయం మొదలు పెట్టాలి అంటూ కార్యకర్తల స్థాయి వరకు సందేశాలు పంపుతోంది కమలదళం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 11, 2023 | 02:59 PMLast Updated on: Jun 11, 2023 | 3:25 PM

Will The Bjp Which Is Preparing For The Election War With The New Cabinet Be Prepared With The Election Team

కేంద్ర కేబినెట్‌లో మార్పులు అందుకేనా ?

2024 లోక్‌సభ ఎన్నికలకు సంవత్సరం కూడా సమయం లేదు. ఇప్పటి నుంచే ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేసుకోకపోతే చివరి నిమిషయంలో ఫలితాలు బెడిసికొట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేసి ఎన్నికల కోసమే ప్రత్యేకంగా టీమ్‌ను రెడీ చేస్తోంది బీజేపీ. ఈ నెల 26న కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పై మాటల తూటాలు పేల్చే బండి సంజయ్‌ని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచార సారథి బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించే అవకాశాలు లేకపోలేదు. ఈటల అసోం ముఖ్యమంత్రితో చర్చలు జరపడం వెనుక కారణం కూడా ఇదే అంటున్నాయి బీజేపీ వర్గాలు.

తెలంగాణలో జెండా పాతేదెలా ?

ఏ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకురావడం బీజేపీకి కత్తిమీదసాములా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో జోష్ తగ్గింది. భారీగా చేరికలు ఉంటాయని ఆశించినా.. పొంగులేటి, జూపల్లి వంటి నేతలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నారు. పైకి ఆర్భాటపు ప్రచారాలు నిర్వహిస్తున్నా.. బీఆర్ఎస్‌ను నేరుగా ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ లేనట్టు కనిపిస్తోంది. గతంతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ బలపడటం, అభివృద్ధి ఎజెండాగా హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తుండటంతో తెలంగాణలో అధికారంలోకి రావడం కమలానికి అంత ఈజీ వ్యవహారంగా కనిపించడంలేదు. కర్ణాటక ఫలితాల తర్వాత మారిన రాజకీయ సమీకరణాల కారణంగా.. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ను కూడా ఢీకొట్టగలిగితేనే బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని.. ఈటల, డీకే అరుణ వంటి నేతల సేవలను పార్టీ గెలుపు కోసం వాడుకోవాలన్న ఆలోచన చేస్తోంది బీజేపీ. కర్ణాటక ప్రజల తీర్పుతో సౌత్‌లో బీజేపీ దుకాణం బంద్ అయ్యింది. దక్షిణాదిన బీజేపీకి ఎంత సత్తా ఉందో తెలంగాణ ఎన్నికల ఫలితాలే డిసైడ్ చేస్తాయి. అందుకే రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మార్పులతో పాటు మోదీ, అమిత్ వంటి కీలక నేతలను రంగంలోకి దించుతోంది.

అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలే గీటురాయి

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తుండటం.. కర్ణాటకలో ఓటు షేర్ కాపాడుకోగలిగినా.. సీట్లను కోల్పోవడంతో ఈ ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. ఈ రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక తిరుగుండదని.. మోదీ మానియాతో కేంద్రంలో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని బీజేపీ భావిస్తోంది. తెలంగాణతో పాటు ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్ మినహాయిస్తే బీజేపీ ఎక్కడా అధికారంలో లేదు. ఈ రాష్ట్రాల్లో జెండా పాతగలిగితే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. కానీ కర్ణాటక ఓటమి తర్వాత బీజేపీపై ప్రతికూలత పెరిగింది . అదే సమయంలో కాంగ్రెస్ పై వివిధ వర్గాల్లో సానుకూల భావం పెరిగింది. ఈ రెండూ ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయన్నది కీలకంగా మారింది.

ఓడిన చోటే కాషాయ జెండా ఎగరాలి

మిగతా జాతీయ పార్టీలతో పోలిస్తే బీజేపీ ఎన్నికల వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయి. కచ్చితంగా గెలిచే అవకాశమున్న స్థానలపై మాత్రమే చాలా పార్టీ దృష్టి పెడతాయి. కానీ బీజేపీ అలాకాదు.. గతంలో ఓడిపోయిన స్థానాల్లో ఈ సారి కచ్చితంగా గెలిచి తీరాలి అన్న పట్టుదలతో వ్యూహాలు రచిస్తుంది. దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలు ఉంటే.. గత ఎన్నికల్లో బీజేపీ 160 సీట్లలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2024లో జరగబోయే ఎన్నికల్లో ఈ స్థానాల్లో కచ్చితంగా విజయం సాధించి తీరాలని ప్రధాని మంత్రి మోదీ పార్టీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. మమ్మల్ని ఎందుకు ఓడించారు.. పలానా పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలిపిచారు..ఈ ఒక్క ప్రశ్ననే ఆధారంగా తీసుకుని బూత్ స్థాయిలో ఓటర్లను కలుస్తున్నారు బీజేపీ నేతలు. దేశవ్యాప్తంగా 40 వేల మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే లక్షలకు పైగా ఎన్నికల బూతుల్లో సర్వేలు నిర్వహించారు.

మోదీ.. బీజేపీకి మళ్లీ ఇదే తారకమంత్రం

బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే బీజేపీ నేతలు చెప్పే ఒకే ఒక్క సమాధానం.. మోదీ మార్క్ పాలన. అవినీతి రహిత పాలన కావాలంటే మోదీని గెలిపించండి.. ఇదే బీజేపీ ఎన్నికల సూత్రం. రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రచారానికి ఫేస్ ఆఫ్ ది పార్టీగా మోదీ నిలవబోతున్నారు. ఆంధ్ర, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మోదీ టూర్లను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మోదీ మానియా మరోసారి ఓట్ల వర్షాన్ని కురిపిస్తుందన్న నమ్మకం బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోంది

మైనార్టీలను అక్కున చేర్చుకునే ప్రయత్నం

హిందుత్వ పార్టీగా ముద్రవేసుకున్న కాషాయ పార్టీ ముస్లిం మైనార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నాలు వేగంగా చేస్తోంది. దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా 30 శాతానికి పైగా ఉన్న 65కి పైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముస్లిం మైనార్టీల్లో భరోసా కల్పించేందుకు వీలుగా వాళ్ల జనాభా ఎక్కువగా ఉన్న స్థానాల్లో మోదీ మిత్ర పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించబోతున్నారు. ఈ స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను ఆ పార్టీ మైనార్టీ మోర్చా తీసుకుంది. ఈ నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి మోదీ ర్యాలీలు కూడా చేపట్టబోతున్నారు.

బీజేపీ వర్సెస్ విపక్షం

అవతల వ్యక్తుల బలహీనతలే కొన్నిసార్లు మనకు బలంగా మారుతుంది. బీజేపీని ఓడించాలని.. హ్యాట్రిక్ విజయం రాకుడా అడ్డుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆప్ సహా చాలా పార్టీలు కోరుకుంటున్నా..ఇప్పటి వరకు అవి ఉమ్మడి వ్యూహాలను ఖరారు చేయకపోవడం బీజేపీకి ఆయుధంగా మారింది. కాంగ్రెస్‌ లేకుండా కూటమి సాధ్యం కాదని నితీశ్ కుమార్ లాంటి వాళ్లు బలంగా నమ్ముతుంటే.. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో జరగబోయే ఎన్నికలు ఇండియన్ పొలటికల్ స్క్రీన్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తున్నాయి. విపక్షం అనైక్యతే బీజేపీకి వరంగా మారుతుంది.