వైసీపీలో అంతర్యుద్దం.. పార్టీని నిండా ముంచుతుందా…?

2024 ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడం ఏమోగానీ ఇప్పుడు ఆ పార్టీ పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. ఒకవైపు జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 11:00 PMLast Updated on: Mar 12, 2025 | 11:00 PM

Will The Civil War In Ysrcp Engulf The Party

2024 ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడం ఏమోగానీ ఇప్పుడు ఆ పార్టీ పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. ఒకవైపు జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం… మరోవైపు 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండటం.. వాళ్లు కూడా జగన్ తరుపున పోరాటం చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం వంటివి… ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక జగన్ కూడా ఆశించిన స్థాయిలో పోరాటాలు చేయడం లేదనే అసహనం కూడా పార్టీ కార్యకర్తలను వెంటాడుతుంది. ఈ సమయంలో అంతర్గత సమస్యలు వైసీపీని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

2024 ఎన్నికలకు ముందు వైఎస్ కుటుంబంలో వచ్చిన ఓ చీలిక ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంది. జగన్ రాజకీయ జీవితంలో కీలకపాత్ర పోషించిన ఆయన సోదరి వైయస్ షర్మిల.. జగన్ తో విభేదించి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా ఆమె జగన్ పై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అటు వైయస్ విజయమ్మ కూడా జగన్ పై ఆగ్రహం గానే ఉన్నారు. ముఖ్యంగా ఆస్తులు వ్యవహారాల్లో జగన్ ఏకపక్షంగా వ్యవహరించడం కుటుంబంలో చీలిక తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి వ్యవహారం కూడా జగన్ ను కచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.జగన్ రాజకీయ జీవితంతో పాటుగా వ్యక్తిగత వ్యాపార జీవితంలో… విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. 2004 నుంచి జగన్ వ్యాపారవేత్తగా ఎదగడానికి విజయసాయిరెడ్డి మూల కారణం. ఇక జగన్ తో పాటుగా సిబిఐ కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి ఇబ్బందులు పడ్డారు. అలాగే జగన్ రాజకీయ జీవితంలో కూడా ఆయనకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి.. విజయసాయిరెడ్డి జగన్ ను 2019లో అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి జగన్ కు దూరం కావడం ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా జగన్ ను భయపెడుతున్నాయి. ఒకవైపు షర్మిల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్… ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏ అడుగు వేసిన సరే… అది జగన్ రాజకీయ వ్యక్తిగత జీవితానికి ఇబ్బందికర పరిస్తితి తెచ్చినట్లే. ఆస్తి పంపకాల వ్యవహారంలో విజయసాయిరెడ్డి అత్యంత కీలక వ్యక్తి. దీనితో ఆయన ఏ పరిస్థితిలో అయినా షర్మిలకు సహకరిస్తే… ఖచ్చితంగా జగన్ ఇబ్బందులు పడవచ్చు అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. వైఎస్ జగన్ కు.. ఎక్కడ ఏ ఆస్తులున్నాయి, అలాగే ఏ వ్యాపారాలు ఉన్నాయి అనేదానిపై విజయసాయి రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉంది. ఈ సమయంలో ఆయన షర్మిలకు ఏ రూపంలో మద్దతు ఇచ్చిన సరే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగా రాజకీయాలకు విజయసాయిరెడ్డి దూరమయ్యారు. జగన్… సజ్జల మాటలు వినడాన్ని విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన తన మనసు విరిగిపోయిందని మళ్లీ అతుక్కోదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ పరిణామాలు వైసీపీని వైయస్ జగన్ ను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తాయి అనేది చూడాలి. ఇప్పటికే లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను విజయసాయి కలిసిన సంగతి తెలిసిందే.