రజనీని వదలని ఎంపీ.. నిండా ముంచేస్తాడా..?
వైసిపి నేతల విషయంలో టిడిపి నేతలు కొంతమంది కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కొంతమంది టీడీపీ నేతలు గతంలో తమ ఇబ్బంది పెట్టిన నాయకుల విషయంలో వెనక్కు తగ్గడం లేదు.

వైసిపి నేతల విషయంలో టిడిపి నేతలు కొంతమంది కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కొంతమంది టీడీపీ నేతలు గతంలో తమ ఇబ్బంది పెట్టిన నాయకుల విషయంలో వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయంలో పల్నాడు జిల్లా ముందుంటుంది. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వర్సెస్ చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజిని ల మధ్య వాతావరణం చినికి చినికి గాలి వానగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎంపీ కంటే మంత్రిగా ఉన్న రజిని పవర్ ఫుల్ గా ఉండేవారు.
ఆమె మాటకు వైసీపీ అధిష్టానం వద్ద కాస్త వెయిట్ ఎక్కువగా ఉండేది. దీనితో రజిని ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. దీనికి తోడు అధికారులు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆమెకు పెద్ద ఎత్తున సహకరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా సహకరించబట్టే ఐపీఎస్ అధికారులను అడ్డం పెట్టుకుని.. ఒక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి ఏకంగా రెండు కోట్ల రూపాయలు రజనీ తీసుకున్నారు అనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఇక రజనీ విషయంలో లావు కృష్ణదేవరాయలు ఇప్పుడు దూకుడుగా ఉన్నారు.
ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. లావు కృష్ణదేవరాయలపై ఆరోపణలు చేసిన రజిని ఆ తర్వాత ఎంపీ ఇచ్చిన స్ట్రోక్ కి కంగుతిన్నారు. ఆమె మొదలు పెట్టారని తాను ఆపే ప్రసక్తే లేదని.. ఇది ఎక్కడ వరకు వెళుతుందో చూడాలంటూ లావు కృష్ణదేవరాయలు ఘాటుగా మాట్లాడారు. చాలెంజ్ కు తగ్గట్టు ఇప్పుడు రజిని వ్యవహారాలపై ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆమె చేసిన అక్రమాలకు.. సంబంధించి నివేదికలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పెద్దలకు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా రైతుల భూముల విషయంలో ఆమె అనుసరించిన వైఖరి, పాల్పడిన అక్రమాలపై సాక్షా లతో సహా ఆయన ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఆమె మరిది గోపిని అడ్డం పెట్టుకొని ఆమె పెద్ద ఎత్తున చిలకలూరిపేట నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఎంపీ ఆరోపణ. ఇప్పుడు వాటిని రుజువు చేసేందుకు పక్కా.. ఆధారాలతో ఆయన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తాజాగా చిలకలూరిపేటలో జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ లో కొంతమంది రైతులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు కూడా చేసారు.
రజినీ పై చర్యలు తీసుకోవాలని ఆమె మరిది గోపి పై కేసు నమోదు చేయాలని కోరారు. ఇలాగే మరికొన్ని కేసులు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి తీసుకునే కేసు నమోదు చేశారు. దీనితో భవిష్యత్తులో రజనీకి ఇబ్బందులు తప్పవని.. ముఖ్యంగా లావు కృష్ణదేవరాయల నుంచి ఆమె మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని, ఇదే ఆమె రాజకీయ జీవితాన్ని నాశనం చేసినా ఆశ్చర్యం లేదంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.