VV Lakshmi Narayana  : వీవీ మరో కేజ్రీవాల్ అవుతారా ?

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్తపార్టీ పుట్టింది. జై భారత్ పేరుతో పార్టీ పెడుతున్నట్టు CBI మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ పార్టీ నుంచే ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్యూరోక్రాట్లు జయప్రకాశ్ నారాయణ, RS ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోయారు. మరి లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటి ? కేజ్రీవాల్ లాగా పాతుకుపోతారా ? మిగతా మాజీ అధికారుల్లాగే కొన్నాళ్ళ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతారా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 01:46 PMLast Updated on: Dec 23, 2023 | 1:46 PM

Will Vv Lakshmi Narayana Be Another Kejriwal

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్తపార్టీ పుట్టింది. జై భారత్ పేరుతో పార్టీ పెడుతున్నట్టు CBI మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ పార్టీ నుంచే ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్యూరోక్రాట్లు జయప్రకాశ్ నారాయణ, RS ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోయారు. మరి లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటి ? కేజ్రీవాల్ లాగా పాతుకుపోతారా ? మిగతా మాజీ అధికారుల్లాగే కొన్నాళ్ళ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతారా ?

IPS అధికారిగా.. సీబీఐ మాజీ జేడీగా వీవీ లక్ష్మినారాయణకు ఎంతో మంచి పేరు ఉంది. రిటైర్డ్ అయ్యాక.. జనానికి ఏదో మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో జనసేన నుంచి వైజాగ్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి.. ఓడిపోయారు. తర్వాత ఆ పార్టీకి రిజైన్ చేసినా.. అప్పటి నుంచీ జనంలో తిరుగుతూనే ఉన్నారు. రైతులు, యువత, మత్స్యకారులు.. ఇలా ఏదో వర్గంతో సమావేశాలు అవుతూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ ఉన్నారు. వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ పార్టీ పిలిచినా.. ఈ పార్టీ పిలిచినా వెళ్ళకుండా ఇప్పుడు డైరెక్ట్ గా లక్ష్మీనారాయణ సొంతంగా జై భారత్ పార్టీ పెట్టుకున్నారు.

దేశంతోపాటు రాష్ట్రంలోనూ బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి రావడం ఎప్పటి నుంచి చూస్తూన్నాం. IAS అధికారి జయప్రకాశ్ నారాయణ్ లోక్ సత్తా పేరుతో NGO పెట్టి.. తర్వాత దాన్ని పొలిటికల్ పార్టీగా మార్చారు. 2009లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అడిషినల్ డీజీ ఉద్యోగానికి రిజైన్ చేసి.. బీఎస్పీలో చేరారు. సిర్పూర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసినా గెలవలేదు. కానీ కొందరు మాజీ అధికారులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన వారు కూడా ఉన్నారు. హర్దీప్ సింగ్ పురి, వీరేంద్ర సింగ్, అశ్వినీ వైష్ణవ్ లాంటి వారు బీజేపీ నుంచి గెలిచి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. IRS అధికారి కేజ్రీవాల్ అయితే ఆప్ పార్టీ పెట్టి.. ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. పంజాబ్ లోనూ తమ పార్టీని అధికారంలోకి తెచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే.. అధికార వైసీపీ గట్టిగానే పాతుకుపోయింది. నెక్ట్స్ ఎలక్షన్స్ లో ఆ పార్టీకి పోటీ ఇవ్వడానికి టీడీపీ, జనసేన రెడీ అయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ కూడా ఉనికిలో ఉన్నాయి. ఈ టైమ్ లో వీవీ లక్ష్మినారాయణ కొత్త పార్టీ పెట్టడం పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. పొలిటికల్ పార్టీ పెట్టడం ఈజీయే.. కాన్ని సమర్థంగా నడపడంలోనే విజయం ఆధారపడి ఉంది. ఆ విషయంలో కేజ్రీవాల్ ఒక్కరే ఇప్పటి దాకా సక్సెస్ అయ్యారు. పార్టీని నడిపించాలంటే ముందు సమర్థులైన లీడర్లు కావాలి. అలాంటి బలమైన నేతలనే ఎన్నికల్లో నిలబెట్టాలి. ప్రత్యర్థి పార్టీల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. ప్రతి పార్టీలోనూ టిక్కెట్ల గొడవలు, సామాజిక సమీకరణాలు లాంటివి ఉంటాయి. వీటిన్నింటికీ మించి అర్థ బలం ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో.. డబ్బులు లేకపోతే పార్టీ నడపడం చాలా కష్టం. అభిమానం ఓట్లు కురిపిస్తుందా అంటే అస్సలు కాదు.. ఎందుకంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు గానీ.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనకు గానీ సీట్లు, ఓట్లు రావడం లేదు.

మాజీ జేడీ లక్ష్మినారాయణ మాత్రం.. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే జై భారత్ పార్టీ పెట్టానంటున్నారు. ప్రజలు ఆకాంక్షలు, ఆలోచనల నుంచి పుట్టిన పార్టీ అని చెబుతున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ తన లక్ష్యమని తెలిపారు. లక్ష్మీనారాయణ 2019లోనే కొత్త పార్టీ పెట్టాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు కొందరు రిటైర్డ్ IAS, IPS అధికారుల సలహాలు, సహకారంతో కొత్త పార్టీ పెట్టినట్టు తెలుస్తోంది. జై భారత్ కు కూడా ప్రభుత్వం వ్యతిరేక ఓట్లే మళ్ళే అవకాశాలున్నాయి. కాపులు కూడా కొంతవరకూ VVL కి సహకరిస్తారన్న టాక్ ఉంది. కానీ పార్టీ ఎజెండా, ఇతర లక్ష్యాలు, ఆ పార్టీలో చేరే ప్రముఖులు లాంటి అంశాలపై క్లారిటీ వచ్చాక గానీ ఏపీ జనం ఎంతవరకూ ఆదరిస్తారన్నది అర్థమవుతుంది.