విజయమ్మను మళ్లీ అధ్యక్షరాలుని చేద్దాం.. జగన్ కి సీనియర్స్ సలహా
మాజీ మంత్రి సాకే శైలజానాథ్...అంతమాట అనేశారేంటి ? పార్టీలో చేరి పది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది.

మాజీ మంత్రి సాకే శైలజానాథ్…అంతమాట అనేశారేంటి ? పార్టీలో చేరి పది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది. పార్టీ చీఫ్ గా జగన్మోహన్ రెడ్డి…సరిగా బాధ్యతలు నిర్వర్తించడం లేదా ? లేదంటే వ్యూహాత్మకంగానే విజయమ్మ పేరును ప్రస్తావించారా ? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది ? శైలూ వ్యాఖ్యలు వ్యక్తిగతమా ? లేదంటే పార్టీ ఏజెండానా ? ఇప్పుడిదే హాట్ టాపిక్ మారింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…వైసీపీ అధినేత వ్యవహరిస్తున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయనే చీఫ్. 2010 నవంబరు 29న లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2011 మార్చిలో తూర్పు గోదావరి జిల్లాలో…పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డే ప్రెసిడెంట్. 14 సంవత్సరాలకు పైగా ఆయన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఉన్నట్టుండి వైసీపీలో డైలాగ్ వినిపిస్తోంది. అదే వైఎస్ విజయమ్మ పార్టీలో చేరాలి…పార్టీకి నాయకత్వం వహించాలి. ఇది ఏ సాధారణ కార్యకర్తో…లేదంటే అభిమానులో అనలేదు. రెండు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి మంత్రిగా పని చేసిన శైలజానాథ్ చేసిన కామెంట్స్.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో శైలజానాథ్…విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పని చేశారు. ఆ స్థాయి వ్యక్తి విజయమ్మ పార్టీ బాధ్యతలు తీసుకోవాలని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నిన్న గాక మొన్న చేరిన శైలజానాథ్ సొంతంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ? లేదంటే ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా ? పార్టీలో అసలీ కొత్తరాగం ఏంటన్న చర్చ నడుస్తోంది. విజయమ్మను పార్టీ బాధ్యతలు తీసుకోమంటున్నారు సరే…మరీ ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు ? ఆయన వైసీపీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత విజయమ్మ…పులివెందుల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2011 మార్చిలో పులివెందుల శాసనసభ స్థానానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత…ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్లలేదు. 2022 వైసీపీ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో… విజయమ్మ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి వైసీపీకీ, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విజయమ్మ పార్టీ బాధ్యతలు చేపట్టాలని కామెంట్స్ చేయడం వెనుక…వైసీపీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ చీఫ్ గా విజయమ్మ పార్టీలోకి వచ్చి బాధ్యతలు తీసుకుంటే…జగన్, షర్మిల మధ్య ఉన్న ఆస్తుల వివాదం సద్దు మణుగుతుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు.
ఎన్సీఎల్టీలో ఇప్పటికే విజయమ్మ, షర్మిల కౌంటర్లు దాఖలు చేశారు. షేర్ల బదిలీ…చట్టప్రకారమే జరిగిందని జగన్ కు వ్యతిరేకంగా విజయమ్మ కౌంటర్ పిటిషన్ వేశారు. కుటుంబ గొడవలు మరింత రచ్చ కాకుండా ఉండేందుకు విజయమ్మను మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే పార్టీ డైరెక్షన్ లేకుండానే శైలజానాథ్…అంతటి కామెంట్స్ చేస్తారా ? మిగిలిన పార్టీల్లా ఎలా పడితే అలా…ఏది పడితే అది మాట్లాడే హక్కు వైసీపీలో ఉండదన్న ప్రచారమూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో శైలజానాథ్…విజయమ్మను మళ్లీ రాజకీయాల్లోకి ఎందుకు లాగారన్నది అంతుచిక్కడం లేదు.