నాన్నా డబ్బు పంపించండి.. అమెరికాలో తెలుగు విద్యార్థుల అష్టకష్టాలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులను కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజురోజుకు పెరిగిపోతూ భయపెడుతుండగా.. మరోవైపు విద్యార్థులకు క్యాంపస్ బయట పార్ట్‌టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. దీంతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2025 | 03:30 PMLast Updated on: Feb 01, 2025 | 3:30 PM

With The Arrival Of Donald Trump As The President Of The United States The Indian Students There Have Been Surrounded By Difficulties

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులను కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజురోజుకు పెరిగిపోతూ భయపెడుతుండగా.. మరోవైపు విద్యార్థులకు క్యాంపస్ బయట పార్ట్‌టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. దీంతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్ అదికారులు సోదాలు చేస్తూ.. కఠినంగా వ్యవహరిస్తుండటంతో.. తమపైనా నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్‌ టైమ్ ఉద్యోగాలను మానేస్తున్నారు. అమెరికా వెళ్లి చదువుకుంటున్నారంటే వాళ్లు చాలా రిచ్‌ అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నిజానికి అది వాస్తవం కావు. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు అక్కడ క్యాంపస్‌లో ఉద్యోగాలు చేస్తారు. క్యాంపస్‌లో ఉద్యోగం రాకపోతే బయట ఎక్కడైనా పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తారు. అలా ఉద్యోగాల ద్వారా వచ్చే డబ్బుతో వాళ్ల ఖర్చులు చూసుకుంటారు. దాంతో పాటే అమెరికా వెళ్లేందుకు చేసిన అప్పులను కూడా తీర్చుతూ ఉంటారు.

ఇంకొంతమంది ఇండియాలో వాళ్ల కుటుంబ ఆర్థిక అవసరాలు కూడా తీర్చుతూ ఉంటారు. దాదాపు అంతా ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తారు. కానీ బైడెన్‌ ఓడిపోయి ట్రంప్‌ అధ్యక్షుడిగా గెలిచిన తరువాత ఈ పద్ధతికి చెక్‌పేట్టే నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్‌. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే ప్రయత్నంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ట్రంప్‌ ఆదేశాలతో ఇమిగ్రేషన్‌ అధికారులు అమెరికా మొత్తం జల్లెడ పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్నవాళ్లందరినీ వెనక్కి పంపేస్తున్నారు. విసాలు రద్దు చేసి భారత్‌కు ప్యాక్‌ చేస్తున్నారు. దీంతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు పార్ట్‌టైం ఉద్యోగాలు మానేయాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో వాళ్ల ఖర్చుల కోసం డబ్బు పంపించండీ అంటూ ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులు తమ యూనివర్సిటీల్లో వారానికి 20 గంటల చొప్పున ‘ఆన్ క్యాంపస్’ జాబ్ పేరిట పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకోవచ్చు. వేసవి నెలవులు, సెమిస్టర్ల మధ్య వ్యవధిలో వారానికి 40 గంటలు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే అక్కడ లీగల్‌. చదువుకుంటూ క్యాంపస్‌ బయట పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకోడానికి అనుమతి లేదు. అయితే అందరికీ క్యాంపస్‌లో ఉద్యోగాలు దొరకవు. దీంతో మన విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ బయట పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. సూపర్ మార్కెట్లు, షెట్రోల్ బంకులు, హోటళ్లలో పని చేస్తున్నారు.

ఇదే పని స్థానికులు పనిచేస్తే గంటకు 20-30 డాలర్లు డిమాండ్‌ చేస్తారు. కానీ భారతీయ విద్యార్థులైతే గంటకు 6 నుంచి 10 డాలర్లు ఇచ్చినా పనిచేస్తారు. అందుకే ఆయా వ్యాపార యజమానులు మన వారికి అవకాశం ఇస్తుంటారు. ఆ మొత్తంతో విద్యార్థులు జీవన వ్యయంతోపాటు ఫీజులు కూడా చెల్లిస్తూ తల్లిదండ్రులపై ఆర్థికభారం లేకుండా చూసుకుంటున్నారు. ఇది ఇప్పుడు మొదలైన వ్యవహారం కాదు. చాలా ఏళ్ల నుంచి అమెరికా వెళ్తున్న తెలుగు విద్యార్థులు ఇలానే జీవనం గడుపుతున్నారు. కానీ ఇలా ఉద్యోగాలు చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. ఇలాంటి వారిని వీళ్లతో పాటు అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వారికి దొరికితే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఇదే జరిగితే మళ్లీ జీవితంలో అమెరికా వెళ్లలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్న భారతీయ విద్యార్థులు వేల మంది పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు మానేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి సర్దుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. అప్పటివరకు నెలవారీ ఇంటి అద్దె, భోజనం లాంటి ఖర్చులకు డబ్బు పంపాలని భారత్‌లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోరుతున్నారు. ప్రాంతాలను బట్టి విద్యార్థులకు నెలకు జీవన వ్యయం 50 వేల నుంచి 80 వేల వరకు ఖర్చవుతుంది. ఇన్నాళ్లు పార్ట్‌టైం ఉద్యగాలతో వాళ్ల డబ్బు వాళ్లే సంపాదించుకునేవాళ్లు.

కానీ ఇప్పుడు ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొన్ని నెలలు ఓపికపడితే పరిస్థితి మారిపోతుంది. ఆ తరువాత అంతా నార్మల్‌ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. చాలా మంది ఇప్పటికే ఉద్యోగాలు మానేసి ఇండియా వైపు చూస్తున్నారు కూడా. అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘ఓపెన్ డోర్’ నివేదిక ప్రకారం 2023-24లో అక్కడి అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇండియా నుంచే ఉన్నారు. అమెరికాలో 11 లక్ష 26 వేల మంది విదేశీ విద్యార్థులు ఉండగా.. అందులో భారతీయ విద్యార్థులు 3 లక్షల 30 వేల మంది. అంటే ప్రతి 100 మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 30 మంది మనవాళ్లే. వాళ్లలో తెలుగు రాష్ట్రాల వారే 56% మంది ఉన్నారు. ఓ హోటల్లో 10 మంది సిబ్బంది ఉంటే అందులో ఏడెనిమిది మంది ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసేవాళ్లే. ఇప్పుడు ఒకేసారి వారందరూ మానేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయి. దీనిపై నిర్వాహకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఒకవేళ రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేస్తే స్థానికులకు ఇబ్బంది అవుతుంది.

‘సంపాదించు.. ఖర్చు చేయి’ తరహా ఆర్థిక విధానం అమెరికావాసులది. ఇంట్లో వండుకోవడం తక్కువ. ఈ నేపథ్యంలో ఏప్రిల్ వరకు మాత్రమే పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటున్న విద్యార్థులపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ ట్రంప్‌ ఈ విషయాన్ని మరీ సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తే మాత్రం ఇక విద్యార్థులకు కష్టాలు తప్పవు. చాలా మంది ఇండియాలో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు అమెరికా వెళ్తుంటారు. కానీ ఇప్పుడు అక్కడ మారుతున్న పరిస్థితులు చూస్తుంటే అమెరికా వెళ్లడమే ఓ ఆర్థిక ఇబ్బందిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. మరి ట్రంప్‌ సర్కార్‌ ఈ విషయంలో మనసు మార్చుకుంటుందా.. లేదా ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తుందా చూడాలి.