Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం..! లోక్‌సభలో నెగ్గిన చారిత్రాత్మక బిల్లు..!!
సాయంత్రం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా రెండు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది ఉన్నారు. వీరిలో ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ జలీల్ మాత్రమే బిల్లును వ్యతిరేకించారు.
Women’s Reservation Bill: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించబోతుంది. బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సాయంత్రం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా రెండు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది ఉన్నారు. వీరిలో ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ జలీల్ మాత్రమే బిల్లును వ్యతిరేకించారు. దీంతో లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. తర్వాత ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది.
ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో బిల్లు అమల్లోకి వస్తుంది. నూతన పార్లమెంట్ భవనంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాతి రోజే చారిత్రాత్మక మహిళా బిల్లు ఆమోదం పొందడం విశేషం. ఈ బిల్లు పాసైనప్పటికీ అమల్లోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. బిల్లుకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది. పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాల్ని విభజించిన తర్వాత నుంచి చట్ట సభల్లో మహిళా కోటా అమలవుతుంది. ఈ బిల్లు ప్రకారం మహిళలకు చట్ట సభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలి. నారిశక్తి వందన్ అధినియం పేరిట కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై దాదాపు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లు అసంపూర్తిగా ఉందనే కారణంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఉండడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు.
పార్లమెంట్ సిబ్బంది.. సభ్యులకు స్లిప్పులు అందించారు. వాటిపై ఎస్, నో అని ఉంటాయి. ఈ స్లిప్పులపై ఎస్ లేదా నో అనే ఆప్షన్‌పై సభ్యులు సంతకం చేసి పేరు, ఐడీ నెంబర్, నియోజకవర్గం, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం వంటి వివరాలు రాయాలి. ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన తర్వాత, ఓటింగ్ జరిగే సమయంలో సభలో 456 మంది ఉన్నారు. వారిలో ఇద్దరు మాత్రమే నో అని వోట్ చేశారు. మిగతా 454 మంది ఎస్ అని వోట్ చేయడంతో బిల్లు పాసైనట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.