Y.S.Jagan: జగన్ కు భయం మొదలైందా..?

వైసీపీ పెద్దలకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. ఉద్యోగ అనుకూల ప్రభుత్వమంటూనే ఉద్యోగులకు చుక్కలు చూపిన ప్రభుత్వం... ఇప్పుడు వాళ్లు తమకు చుక్కలు చూపించకుండా చర్యలు మొదలుపెట్టింది. మరి ఉద్యోగులు మెత్తబడతారా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2023 | 01:28 PMLast Updated on: Mar 10, 2023 | 3:06 PM

Y S Jagan Possitive On Employees

ఉద్యోగసంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారు కోరుతున్న ఆర్ధిక అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఉద్యోగులకు పెట్టిన వేలకోట్ల బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు అంగీకరించింది. ఇన్నాళ్లూ ఎన్నిసార్లు చర్చలు జరిగినా, ఉద్యోగులు ఎంత మొత్తుకున్నా హామీ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా కొత్తగా హామీలు ఇవ్వడంతో ఇంత మార్పు ఏంటా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో ఉద్యోగులను ప్రభుత్వం దువ్వుతోందని కొందరు.. కాదు కాదు సమస్యల పరిష్కారం కోసం సిన్సియర్ గా చేస్తున్న ప్రయత్నమని మరికొందరు చెప్పారు. కానీ తెరవెనక కథ వేరే ఉంది.

ఎన్నికలకు ఏడాది కూడా లేదు. ఒకరిద్దరు ఉద్యోగ సంఘం నేతలకు తప్ప ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వంపై పీకల దాకా కోపముందన్నది బహిరంగ రహస్యమే. ఉద్యోగుల సంఖ్య లక్షల్లో ఉంది. మరి వారి కుటుంబాల్లో ఎన్ని ఓట్లుంటాయో ఊహించండి. రేపు ఎన్నికల్లో వారు ఎక్కడ తమకు వ్యతిరేకంగా పనిచేస్తారోనని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారు. ఇప్పటికే టీచర్లు దాదాపు దూరమయ్యారు. ఇక ఉద్యోగులు కూడా దూరమైతే ఇబ్బందులు తప్పవన్నది వారి భయం. పైగా రేపు ఓటింగ్ దగ్గర ఉండేది వారే.. ఉద్యోగులు తలచుకుంటే ఏమైనా చేయగలరు. పోయినసారి ఉద్యోగులు తమకు ఎంతో కొంత సాయం చేశారని వైసీపీ నేతలే ఒప్పుకుంటారు. ఆ చేత్తో ఈ చేత్తో ఓట్లు గుద్దించామని ఉద్యోగ సంఘం నేతలు మైకుల ముందే చెప్పేశారు. ఇప్పుడు వారు ప్రతిపక్షంవైపు మొగ్గు చూపితే కొంపమునుగుతుందన్నది ప్రభుత్వ పెద్దల భయం. కొన్ని ఓట్లను వారు ప్రభావితం చేసినా ఫలితం తారుమారు అవుతుంది.

ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేకపోతున్నారు. వారి జీపీఎఫ్ సొమ్ము ప్రభుత్వం వాడేసుకుంది. డీఏలు ఇవ్వడం లేదు. ఇవన్నీ ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. దీంతో ఉద్యోగులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇది మంచిది కాదనుకున్న ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగమే విడతల వారీగా నిధుల విడుదల హామీ. అయితే ఇలా రెండు మూడు నెలలకోసారి కొంత మొత్తం విడుదల చేసినా పూర్తి బకాయిలు చెల్లించడానికి కొన్నేళ్లు పడుతుందన్నది ఉద్యోగుల వాదన. దీంతో ఎలాగైనా వారిని బుజ్జగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉద్యోగులతో ప్రభుత్వం మొదట్నుంచి ఘర్షణాత్మక వైఖరినే అవలంభిస్తోంది. పీఆర్సీ నుంచి మొదలైన పంతాలు కంటిన్యూ అవుతున్నాయి. వారు అడిగినంత ప్రభుత్వం ఇవ్వలేదు. సాధారణంగా ఎప్పుడూ ఉద్యోగులు కాస్త ఎక్కువే అడగటం ప్రభుత్వం కాస్త తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. వాళ్లు అడిగిన దానికి వీళ్లు ఇచ్చిన దానికి పొంతన లేదు. దానికి తోడు జీతాలు పెరగాల్సింది పోయి కోతపడింది. ఇవన్నీ ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. జీతాల విషయంలో ఉద్యోగులను ప్రజల్లో విలన్లుగా చూపించే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇది వారి ఆగ్రహానికి కారణమైంది. వారిని తక్కువగా అంచనా వేసే గతంలో ఓసారి దెబ్బతింది. నిర్బంధాలను తట్టుకుని మరీ విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులు తమ సత్తా చాటారు. దాంతో దిగిరాక తప్పలేదు. మరోసారి అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని వైసీపీ భావిస్తోంది.

ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ప్రశాంతంగా ఉండలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో ఉద్యోగులతో ఘర్షణ వద్దనుకుంటోంది. కనీసం ఎన్నికల వరకైనా వారితో సామరస్యంగా ఉండాలనుకుంటోంది. మరి ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో.. ఉద్యోగులు ఎంత మేర మెత్తబడతారో..చూడాలి మరి..

(KK)