YASHASWINI REDDY: విజయకేతనం.. వయస్సు కొంచెం.. గెలుపు ఘనం..
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. వయస్సు పరంగా పిన్న వయస్కురాలు కావడమే కాదు.. ఆమెకు రాజకీయంగానూ ఎలాంటి అనుభవం లేదు.

YASHASWINI REDDY: యశస్విని రెడ్డి.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతోంది. తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన నలుగురు మహిళల్లో యశస్విని రెడ్డి, లాస్య నందిత, చిట్టెం పర్ణిక రెడ్డి, మట్టా రాగమయి ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యశస్విని రెడ్డి గురించే. నిండా 30 ఏళ్ల వయస్సు కూడా లేని యశస్విని రెడ్డి.. పాలకుర్తి నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకరరావుపై 47,634 ఓట్ల తేడాతో గెలిచారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి.
CM Revanth Reddy : రేవంత్ మొదటి సంతకం దేనిపై అంటే !
వయస్సు పరంగా పిన్న వయస్కురాలు కావడమే కాదు.. ఆమెకు రాజకీయంగానూ ఎలాంటి అనుభవం లేదు. అలాంటి యశస్విని అనూహ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయాన్ని అందుకోవడమే కాదు ఎర్రబెల్లికి చేదు అనుభవాన్ని మిగిల్చారు. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి అమెరికాలో వ్యాపార రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆమెకు భారత పౌరసత్వం లేకపోవడంతో టికెట్ దక్కలేదు. దీంతో ఆమె కోడలు యశస్విని రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. యశస్విని భర్త రాజమోహన్ రెడ్డి కూడా అమెరికాలోనే ఉంటారు. ఆయనకు కూడా భారత పౌరసత్వం లేదు. అయితే.. హైదరాబాద్‌లోనే బీటెక్ చదువుకున్న యశస్విని.. వివాహమైన తరువాత భర్తతో అమెరికా వెళ్లినప్పటికీ మళ్లీ కొన్నాళ్లుగా తెలంగాణలోనే ఉంటున్నారు. తన అత్తకు బదులుగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన యశస్విని రెడ్డి.. తన మొదటి పోటీలోనే రాజకీయ ఉద్ధండుడైన ఎర్రబెల్లిపై పోటీకి దిగడమే ఓ సంచలనం సృష్టించింది. వీరివురి పోటీ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎర్రబెల్లి దయాకర్‌రావుపై యశస్విని పోటీకి దిగడాన్ని చాలా మంది ఆశ్చర్యంగా చూసారు. ఆమె విజయం సాధిస్తారా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆమె విజయంపై అనేక అనుమానాలు కలిగాయి. ఆమె ప్రచారంలో కాస్త తడబడటం కూడా ఆ అనుమానాలను మరింత పెంచి పోషించింది. తన ప్రచార సభల్లో జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అవాక్కయ్యారు. యశస్విని రెడ్డి గెలుస్తారా అంటూ కొందరు నవ్వుకున్నారు. కానీ అనూహ్యంగా పాలకుర్తిలో యశస్విని రెడ్డి విజయం సాధించి ఎర్రబెల్లికి షాకిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు..