ఉండవల్లే దిక్కు..? కాంగ్రెస్ మాజీ ఎంపీలకు జగన్ ఫోన్లు…!
వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు ఢిల్లీలో పట్టు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ మనుగడ కొనసాగించాలి అంటే కచ్చితంగా ఢిల్లీలో ఏదో ఒక జాతీయ పార్టీతో జగన్ కో స్నేహం చేయడం అత్యంత కీలకం.

వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు ఢిల్లీలో పట్టు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ మనుగడ కొనసాగించాలి అంటే కచ్చితంగా ఢిల్లీలో ఏదో ఒక జాతీయ పార్టీతో జగన్ కో స్నేహం చేయడం అత్యంత కీలకం. ఇప్పటివరకు బిజెపి ఆయనకు అండగా నిలబడింది. 2019 తర్వాత జగన్ బిజెపికి బాగా దగ్గరయ్యారు. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో జగన్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2024 ఎన్నికల్లో ఘోర ఓటమితో జగన్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఇక జగన్ కాంగ్రెస్ కు దగ్గర అయ్యే ప్రయత్నాలు కూడా చేశారనే వార్తలు వచ్చాయి. ఈ సమయంలో విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం.. జగన్ కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. జగన్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకపాత్ర పోషించిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు సైలెంట్ అయిపోవడంతో, జగన్ ఏం చేయాలనే దానిపై ఆ పార్టీ కీలక నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ ప్రజల్లోకి వెళ్లే మార్గాలను కూడా జగన్ అన్వేషిస్తున్నారు.
అటు వైసీపీ సోషల్ మీడియా కూడా పెద్దగా యాక్టివ్ గా కనబడటం లేదు. ఈ సమయంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను పార్టీలోకి తీసుకోవాలని, ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దగ్గర కావాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఉండవల్లి అరుణ్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్టానానికి మంచి సంబంధాలు ఉన్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా స్వేచ్ఛగా వెళ్లేవారు అని చెబుతూ ఉంటారు.
ఇప్పుడు ఆయన ద్వారా జగన్ ఢిల్లీలో తనకు అనుకూల పరిస్థితులు సృష్టించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అటు మరో మాజీ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి వైపు కూడా జగన్ దృష్టి పెట్టారు. సుబ్బరామిరెడ్డికి కూడా కాంగ్రెస్ అధిష్టానంతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. వీళ్ళిద్దరూ తనను ఢిల్లీలో కాపాడుతారనే అభిప్రాయంలో జగన్ అన్నట్లు సమాచారం. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకు కీలక పదవి కూడా ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇక వీళ్లిద్దరికి ఇప్పటికే జగన్ సీటు హామీలు కూడా ఇవ్వటానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ విషయంలో కూడా జగన్ కాస్త సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ నేతలు అందరిని దగ్గర చేసుకునేందుకు జగన్ ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ విషయంలో కూడా జగన్ ఆసక్తికరంగా ఉన్నట్లు సమాచారం. ఇలా కీలక నేతలను దగ్గర చేసుకుని రాహుల్ గాంధీకి గాలం వేసే ప్రయత్నం మొదలుపెట్టారు జగన్.