YSRCP : పాణ్యంలో పీక్స్ కు చేరిన వైసీపీ వర్గ పోరు..

పాణ్యం వైసీపీలో వార్‌ ఓ రేంజ్‌లో జరుగుతోందట. నువ్వు డాష్‌ అంటే నువ్వే పెద్ద డాష్‌ అంటూ.. రెండు వర్గాలు మాటల యుద్ధం చేస్తున్నాయట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2023 | 12:45 PMLast Updated on: Dec 17, 2023 | 12:45 PM

Ycp Faction War Reached Peaks In Panyam

పాణ్యం వైసీపీలో వార్‌ ఓ రేంజ్‌లో జరుగుతోందట. నువ్వు డాష్‌ అంటే నువ్వే పెద్ద డాష్‌ అంటూ.. రెండు వర్గాలు మాటల యుద్ధం చేస్తున్నాయట. అదీ కూడా.. పార్టీ మీటింగుల్లోనో.. మరో ప్రైవేట్‌ సమావేశాల్లోనో కాదు.. ఏకంగా యావత్‌ ప్రపంచానికి తెలిసేట్టు సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టింగ్స్‌ పెడుతుండటంతో.. ఇది శృతి మించి ఎంత దూరం పోతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోందట కేడర్‌లో. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గాలు ఈసారి టిక్కెట్‌ మా నాయకుడికి అంటే మా నాయకుడికేనంటూ డిజిటల్‌ వార్‌కు తెరలేపాయి.

అది కూడా మామూలుగా అయితే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, ఇద్దరు ముఖ్య నేతలే టార్గెట్‌గా.. బూతు పురాణంతో విచ్చలవిడిగా ట్రోల్స్‌ పెరిగిపోతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనగా ఉందంటున్నాయి పాణ్యం రాజకీయ వర్గాలు. అంత జరుగుతున్నా.. ఇద్దరు నాయకులు స్పందించడం లేదని, ఆ మౌనం ఎట్నుంచి ఎటు దారి తీస్తుందోనన్న కంగారు కూడా పెరిగిపోతోందంటున్నారు. రెండేళ్ళుగా అడపా దడపా జరుగుతున్నా.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో రెండు వర్గాల సోషల్‌ మీడియా పోస్టింగ్స్‌ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఈసారి పాణ్యం టికెట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికేనంటూ.. ఆయన అనుచరులు పోస్టింగ్స్‌తో హల్‌చల్‌ చేయడం, దానికి ఎమ్మెల్యే కాటసాని వర్గీయులు కౌంటర్ ఇవ్వడంతో హీట్‌ పెరుగుతోందంటున్నారు. కర్నూలు సిటీలో కొంత భాగం పాణ్యం నియోజకవర్గం పరిధిలో కూడా ఉండడంతో ఈ హడావిడి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.

ఇద్దరి గౌరవాన్ని దిగజార్చేలా యుద్ధం జరుగుతున్నా.. ఎవ్వరూ కిమ్మనకపోవడమేంటోనంటున్నారు పరిశీలకులు. మరోవైపు పాణ్యం టికెట్‌పై వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని అంటున్నాయి పార్టీ వర్గాలు. త్వరలోనే దీని మీద ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అయినా.. రెండు వర్గాలు తగ్గకుండా బూతు పోస్టింగ్స్‌ పెడుతున్నాయి. ఇప్పటికైనా చెక్‌ పడకుండే.. వ్యవహారం శృతి మించి రెండు వర్గాలు బాహాబాహీకి దిగే ప్రమాదం సైతం ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో రేపు ఇద్దరిలో ఒకరికి సీటు ఇస్తే.. మరొకరు సహకరిస్తారా అన్న డౌట్స్‌ కూడా వస్తున్నాయట పార్టీ వర్గాలకు. పార్టీ నిర్ణయం వచ్చాక పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.