వైసీపీకి షాకుల మీద షాకులు సాయి రె,డ్డి జగన్ కి జలక్ ఎందుకిచ్చాడు? పార్టీ లో ఏం జరుగుతుంది?

ములిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా...వైసీపీ పరిస్థితి తయారవుతోంది. అసలే అధికారం కోల్పోయిన వైసీపీ...ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2025 | 07:09 PMLast Updated on: Jan 25, 2025 | 7:09 PM

Ycp Mp Vijayasai Reddy Gave An Unexpected Shock To Jaganmohan Reddy

ములిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా…వైసీపీ పరిస్థితి తయారవుతోంది. అసలే అధికారం కోల్పోయిన వైసీపీ…ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూసింది. ఆర్నెళ్లు గడిచాయో లేదో…నేతలు ఒక్కొక్కరుగా పార్టీ బై బై చెప్పేస్తున్నారు. జగన్‌తో పాటు జైలుకు వెళ్లిన వాళ్లే కాదు..వైఎస్‌ కుటుంబంతో 40 ఏళ్ల అనుబంధం ఉన్న వాళ్లు ఝలక్‌ ఇస్తున్నారు. ఈ ఊహించని పరిణామంతో వైసీపీలో ఏం జరుగుతోంది ? ఇంకా ఎంత మంది ఎంపీలు రాజీనామా చేస్తారు అన్న చర్చ జరుగుతోంది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి…జగన్మోహన్‌రెడ్డికి ఊహించని షాక్‌ ఇచ్చారు. కొన్నేళ్లుగా జగన్మోహన్‌రెడ్డికి తోడు నీడలా ఉంటున్న విజయసాయిరెడ్డి…అనూహ్యంగా వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ పదవితో పాటు ఎంపీ పదవికి గుడ్‌బై చెప్పడం…రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్‌కు అన్ని తానై వ్యవహరించిన విజయసాయిరెడ్డే…వైసీపీకి రాం రాం అంటే…మిగిలిన నేతల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్‌ చేసిన విజయసాయి…జగన్‌తో పాటు జైలుకు వెళ్లారు. అనేక కేసుల్లో ఏ2 నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయి. నాలుగు దశాబ్దాలకుపైగా వైఎస్‌ కుటుంబంతో ఉంటున్న విజయసాయి…వైసీపీకి రాజీనామా చేయడం…పార్టీ నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న విజయసాయిరెడ్డి…కాషాయ పార్టీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన తర్వాతే రాజీనామా చేశారన్న చర్చ మొదలైంది.

ఏ రాజకీయపార్టీ లోను చేరడం లేదని ప్రకటించిన విజయసాయి… వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తి గతమని…ఎలాంటి ఒత్తిళ్లు లేవని…ఎవరూ ప్రభావితం చేయలేదని వెల్లడించారు. అయితే ఇక్కడే అనేక అనుమానాలు వైసీపీ శ్రేణులను వెంటాడుతున్నాయి. వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్‌గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి.. జగన్ కుటుంబానికి చెందిన కంపెనీలకు సలహాదారుగా పని చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్నారు. 2012 జనవరి 2న విజయసాయిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో జగన్‌ కంటే ముందు అరెస్ట్ అయ్యింది ఆయనే. సండూరు పవర్ కంపెనీ షేర్ల అమ్మకంలో అవకతవకల్లోనూ విజయసాయిపై అభియోగాలు నమోదయ్యాయి. విపత్కర పరిస్థితుల్లోనూ జగన్ వెంట నడిచిన విజయసాయిరెడ్డి…వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. 2016లో ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడు అయ్యాక…ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. ఓ వైపు జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతూ ప్రజల మధ్య తిరుగుతుంటే.. విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో పార్టీకి సంబంధించిన పనులు చక్కబెట్టారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలతో ఆయన సన్నిహితంగా మెలిగారు. వైసీపీ, బీజేపీ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడంలో విజయసాయి రెడ్డిదే కీలక పాత్ర. వైసీపీకి తెర వెనుక నుంచి వ్యూహాలు రచించారు. ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల ముందు ప్రశాంత్ కిశోర్‌ను వైఎస్సార్సీపీ కోసం పని చేసేలా ఒప్పించింది విజయ సాయిరెడ్డేనని చెబుతారు. అలాంటి వైసీపీకి రాజీనామా చేయడం…జగన్‌కు దూరం కావడం నమ్మశక్యంగా లేని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత…పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటి దాకా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి…సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు జగన్‌. అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా విజయసాయిని తప్పించారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి కంటే సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత పెరిగిపోయింది. ప్రభుత్వంలో ఏం జరిగినా…సజ్జల మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చేవారు. విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిపోవడం..సజ్జలకు పార్టీలో ఇంపార్టెన్సీ పెరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తారకరత్న మరణించిన సమయంలో…కూతురు అలేఖ్యకు అండగా నిలిచారు. చంద్రబాబు పక్కనే ఉండి…కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు…తనకు అన్నయ్య అవుతాడని చెప్పారు. ఈ వ్యవహారం వైసీపీ నేతలకు రుచించలేదు. విజయసాయిపై అనేక విమర్శలు చేశారు. ఇలా అనేక పరిణామాలతో వైసీపీ సాయిరెడ్డి గుడ్‌ బై చెప్పినట్లు తెలుస్తోంది.