Top Story: టీడీపీపై సోషల్ మీడియా వార్ కు వైసీపీ ప్లాన్ కమ్మ వర్గమే టార్గెట్
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు...వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తోందా ? ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఫార్ములాను అమలు చేసేందుకు రెడీ అవుతున్నారా ? 2019-2024 వరకు తెలుగుదేశం పార్టీ ఎలాంటి పాచికలు వేసిందో...వాటితోనే దెబ్బ కొట్టాలని వైసీపీ భావిస్తోందా ?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు…వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తోందా ? ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఫార్ములాను అమలు చేసేందుకు రెడీ అవుతున్నారా ? 2019-2024 వరకు తెలుగుదేశం పార్టీ ఎలాంటి పాచికలు వేసిందో…వాటితోనే దెబ్బ కొట్టాలని వైసీపీ భావిస్తోందా ? ఏ సోషల్ మీడియాతో అయితే టీడీపీని అధికారంలోకి తెచ్చిందో…ఇప్పుడు అదే సోషల్ మీడియా చేత తెలుగుదేశం పార్టీని చెడుగుడు ఆడుకోవాలని డిసైడ్ అయ్యారా ? వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే…అవుననే సమాధానం వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్ అయింది. సోషల్ మీడియా లేకపోతే…రాజకీయాలే లేవన్నట్లు పరిస్థితి తయారైంది. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ…ఇలా ఏ పార్టీ అయినా…సోషల్ మీడియానే నమ్ముకుంటున్నాయి. అధికారంలోకి రావాలంటే…సోషల్ మీడియానే ప్రధాన అస్రంగా నమ్ముకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పార్టీలు, నేతలు చేస్తున్న కామెంట్స్, ట్వీట్లతో రాజకీయాలు రక్తికట్టిస్తున్నారు. కొన్ని సందర్బాల్లో పార్టీలకు ఊపిరి పోస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం, ఆ పార్టీ సోషల్ మీడియాతో పాటు వారికి అనుకూలంగా పని చేసే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్స్…వైసీపీ వైఫల్యాలను ఎండగట్టాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా…రచ్చ రంబోలా చేశాయి. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…తెలుగుదేశం పార్టీ నేతల కంటే…దాని సోషల్ మీడియా, వారి అనుకూలమైన ఇన్ ఫ్లూయోన్సర్లు యాక్టివ్ పని చేశారు. జగన్ ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టి వేధించినా వెనక్కి తగ్గలేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా…వెనుకడుగు వేయలేదు. ఆశ్లీలంగా చిత్రీకరించినా…ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. వైసీపీ నేతలు, పోలీసులు ఎంత వేధించినా…వైసీపీకి చుక్కలు చూపెట్టారు. కొందర్ని పోర్న్ స్టార్లతో పోల్చినా….ఇంకొందరివి ఫేక్ న్యూడ్ ఫోటోలు పెట్టినా…తెలుగుదేశం పార్టీ కోసం పని చేశారు. ఒకరకంగా చెప్పాలంటే…పబ్లిక్ లో ఉండే రాజకీయ నేతల కంటే…సోషల్ మీడియా కార్యకర్తలతో వందశాతం టీడీపీ గెలుపు కోసం శ్రమించారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా…టీడీపీ అనుసరించిన ఫార్ములానే అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీని మించి సోషల్ మీడియాను యాక్టివేట్ చేసి…ఇరుకున పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ నేతల సమావేశాల్లో…సోషల్ మీడియా వింగ్ సమావేశాల్లోనూ…ఇదే చెబుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించి…ఏ చిన్న వైఫల్యం బయటపడినా…ఉతికి ఆరేయాలని చెప్పేశారు. కొన్నాళ్లు తాడేపల్లిలోని జగన్ నివాసం సమీపంలోని విల్లాల్లో…ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలను నిర్వహించారు. పోలీస్ కేసులు, సాంకేతిక కారణాలతో మరో ప్రాంతానికి తమ బృందాలను తరలించేసింది. తరచూ బెంగుళూరు వెళ్లిపోయి వస్తున్న జగన్….పార్టీ శ్రేణులకు వీలైనంత ఎక్కువగానే అందుబాటులో ఉంటున్నారు. మొదట్లో పార్టీ కార్యకర్తల ఆందోళనలు, నిరసన స్వరాలు వినిపించడంతో కార్యకర్తలతో కలవడానికి కూడా ఆ పార్టీ అధినేత విముఖత చూపించారు. పార్టీ శ్రేణుల్ని కలిసే కార్యక్రమాలకు స్వస్తి పలికారు. ఆ తర్వాత అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు.
వరద బాధితులకు సాయం చెల్లింపు విషయంలో…అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ సద్వినియోగం చేసకుంది. బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో జరిగిన లోపాలను గణాంకాలతో సహా కమ్యూనిస్టులు విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. మొదట్లో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం భావించింది. చివరకు బాధితులకు చెల్లించిన నష్టపరిహారం కంటే వరద సహాయక చర్యల పేరిట చేసిన ఖర్చు ఎక్కువ ఉందని జనంలోకి బలంగా వెళ్లింది. దీంతో ప్రభుత్వం చేసిన సాయం మొత్తం కొట్టుకుపోయింది. చివరకు మంత్రులు అంతా క్యూ కట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, నారాయణలు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ముఖ్య నేతల వ్యవహార శైలిపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ రీచ్ వస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లక్షలకు లక్షలు పెట్టి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే దాని కంటే…ఒక్క ట్వీట్ లేదా పోస్టింగ్ తోనే రావాల్సినంత మైలేజ్ ను వైసీపీ తెచ్చుకుంటోంది. కొంతకాలంగా వైసీపీ నేతలు కూడా బహిరంగంగా విమర్శలు చేయడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో…మంత్రి పదవుల్ని అనుభవించిన నేతలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వంగలపూడి అనిత లాంటి నేతలపై నోరు పారేసుకున్న నాయకులు ఎక్కడా చప్పుడు చేయడం లేదు.జస్ట్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ తో…అటెన్షన్ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్నారు.
కేవలం సోషల్ మీడియాలో ముఖాలు లేని ఖాతాలతో పాటు ఆ పార్టీలో మొదటి నుంచి సాగుతున్న వాళ్లు మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. పార్టీతో ప్రయోజనం పొందిన వాళ్లంతా తమకెందుకు అనవసర వివాదాలని భావిస్తున్నారు. దీంతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి…సోషల్ మీడియా వేదికగానే టీడీపీ ఫుట్ బాల్ ఆడేసుకోవాలనే యోచనలో ఉన్నారు. తక్కువ ఖర్చుతో పార్టీ కార్యక్రమాలను యాక్టివ్‌గా ఉంచడమే లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో అనుభవం ఉన్న వారిని…పంచ్ రైటర్లను వైసీపీ దిగుమతి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే టీడీపీపై వైసీపీ అటాకింగ్ పెరిగిందని అంటున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి సోషల్ మీడియా ద్వారానే…అధికార పక్షాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలోని కమ్మ సామాజికవర్గం నేతలే టార్గెట్ గా…వైసీపీ సోషల్ మీడియా పని మొదలు పెట్టేసినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సోషల్ మీడియా వార్ కాస్త…కమ్మ సామాజికవర్గం వర్సెస్ రెడ్డి సామాజికవర్గం అనేలా తయారు చేసేందుకు జగన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు.