YCP vs TDP: వైసీపీతో పోటీకి టీడీపీ సూపర్‌ప్లాన్.. సారథుల యుద్ధం ఎలా సాగబోతోంది ?
గృహసారధులు, కుటుంబసారధుల మధ్య యుద్ధం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కుటుంబాలకు కలిసే క్రమంలో రెండుపార్టీల సారధుల మధ్య పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందనే టెన్షన్ కూడా కనిపిస్తోంది.
అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకొని తీరాలని టీడీపీ.. ఎవరికి వారు వేస్తున్న అడుగులతో.. సంధిస్తున్న వ్యూహాలతో ఏపీ రాజకీయం కొత్త ఆసక్తి రేపుతోంది. 2024 టార్గెట్‌గా గడపగడపకు కార్యక్రమం చేపట్టిన వైసీపీ.. ఆ తర్వాత ప్రతీ 50ఇళ్లకు గృహ సారథులను నియమించి.. వారితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇప్పుడు దీనికి కౌంటర్‌గా టీడీపీ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయింది.
వైసీపీ ప్రతీ 50ఇళ్లకు ఇద్దరు గృహసారథులను నియమిస్తే.. ప్రతీ 30ఇళ్లకు ఇద్దరు కుటుంబ సాధికారిక సారథులను నియమించాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే ఇప్పుడు రాజకీయాన్ని హీటెక్కించింది. తమ కార్యక్రమాలను టీడీపీ కాపీ చేస్తోందని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబ సారధులుగా నియమితులైన ఒక్కొక్కరికి… 30కుటుంబాల బాధ్యతలను అప్పగిస్తారు. జనాల్లో టీడీపీపై నమ్మకం కలిగించడం, ఎన్నికల హామీలను ఇంటింటికి తీసుకెళ్లడమే కాకుండా.. వారందరినీ టీడీపీకి ఓటేసేలా చేయడమే ఈ కుటుంబసారధుల కాన్సెప్ట్. కుటుంబ సారథులు ఎప్పుడు ఏం చేయాలనే విషయాలపై.. పార్టీ నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తూ ఉంటాయ్. ఈ కుటుంబ సారధుల టీమ్‌లో తప్పనిసరిగా ఒక మహిళ, ఒక పురుషుడు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు గ్రామాల యూనిట్‌గా రాజకీయాలు జరిగేవి. అది కాస్త ఇప్పుడు కుటుంబాలను యూనిట్‌గా తీసుకొని రాజకీయాలు చేస్తున్నాయ్ పొలిటికల్ పార్టీలు. గృహసారథుల పేరుతో వైసీపీ జనాల దగ్గరకు వెళ్తుంటే.. దానికి పోటీగా కుటుంబ సారధులు అంటూ టీడీపీ ప్రత్యేక వ్యవస్థను తీసుకురాబోతోంది. కాపీ వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా.. రెండు పార్టీల మధ్య సారధుల యుద్ధం మాత్రం పీక్స్‌కు చేరేలా కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య కొత్త యుద్ధానికి శ్రీకారం పడినట్లు కచ్చితంగా అర్థం అవుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. చంద్రబాబు టూర్‌లు అడ్డుకోవడానికే జీవో నంబర్ వన్ తీసుకొచ్చారని.. సైకిల్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇలాంటి సమయంలో గృహసారధులు, కుటుంబసారధుల మధ్య యుద్ధం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కుటుంబాలకు కలిసే క్రమంలో రెండుపార్టీల సారధుల మధ్య పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందనే టెన్షన్ కూడా కనిపిస్తోంది. సారధుల కాన్సెప్ట్ కొత్తగా కనిపిస్తున్నా.. ఇది రాజకీయంగా కొత్త యుద్ధానికి దారి తీయడం మాత్రం ఖాయం