Yediyurappa: యడియూరప్పే బీజేపీ కొంపముంచారా ?

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు.. కర్ణాటకలో బీజేపీ ఓటమికి వంద కారణాలు వినిపిస్తున్నాయిప్పుడు ! కన్నడనాట బీజేపీకి కష్టమే అని అంతా వేశారు కానీ.. కమలం పార్టీకి ఇంత దారుణమైన ఓటమి ఎదురవుతుందని బహుశా ఎవరూ ఊహించలేకపోయారు. బలం అనుకున్న ప్రతీది.. బలహీనతగా మారింది. ఎన్నికల్లో బొక్కాబోర్లా పడేలా చేసింది. మిగతా కారణాల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ ఈ స్థాయి ఓటమికి యడియూరప్పే ప్రధాన కారణం అయ్యారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 13, 2023 | 04:22 PMLast Updated on: May 13, 2023 | 4:22 PM

Yediyurappa Inpact On Bjp

బీజేపీకి బలం అనుకున్న లింగాయత్‌ ఓటర్లు.. దారుణంగా హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఘోరపరాభవం ఎదురైంది. లింగాయత్‌లు ఎదురు తిరగడానికి ప్రధాన కారణం.. యడియూరప్ప విషయంలో బీజేపీ వేసిన అడుగులే అనే చర్చ జరుగుతోంది. 80ఏళ్ల వయసు పైబడిన వారిని యాక్టివ్‌ పాలిటిక్స్‌ నుంచి పక్కన పెట్టాలన్న నిర్ణయం.. బీజేపీకి శాపంగా మారినట్లు కనిపిస్తోంది. యడియూరప్పను పక్కన పెట్టారన్న కోపంతోనే లింగాయత్‌ సామాజికవర్గం అంతా.. కాంగ్రెస్‌ వైపు మొగ్గిందా అనే చర్చ జరుగుతోంది. కర్ణాటక మొత్తం జనాభాలో లింగాయత్‌ వర్గం ఓటర్లు 17శాతం ఉంటారు. దాదాపు 100సీట్లలో లింగాయత్‌లు డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉంటారు.

అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతీసారి.. లింగాయత్‌ వర్గం కరుణా కటాక్షాల కోసం పార్టీలన్నీ పోటీపడుతుంటాయ్. లింగాయత్‌ వర్గం నుంచి యడియూరప్ప పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో.. ఆ సామాజికవర్గం కోసం చాలా కష్టపడ్డారు. ఐతే అలాంటి వ్యక్తిని పక్కనపెట్టారని బీజేపీ మీద లింగాయత్‌లు కోపం పెంచుకున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఉత్తర కర్ణాటకలో లింగాయత్‌ల ప్రభావం ఎక్కువ. బెలగావి, ఉత్తర కన్నడ, హవేరి, గడగ్‌, విజయపుర, బంగలోకోట్‌, దర్వాద్‌ ప్రాంతాల్లో లింగాయత్‌లదే కీ రోల్.

ఈ ప్రాంతాల్లోని 56 స్థానాల్లో దాదాపు 44 నియోజకవర్గాల్లో బీజేపీకి పరాభవమే ఎదురైంది. దీంతో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం లభించింది. నిజానికి యుడియూరప్ప వ్యవహారంలో లింగాయత్‌లు తిరుగుబాటు చేస్తారని బీజేపీ అధిష్టానం కూడా గ్రహించింది. మోదీ, అమిత్‌ షాతో సహా.. జాతీయ నాయకత్వం అంతా రంగంలోకి దిగి.. సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేసింది. ఐనా అప్పటికే పుణ్యకాలం అయిపోయింది. లింగాయత్‌లు కాంగ్రెస్ వైపు చూశారు. దీంతో బీజేపీకి భారీ పరాభవం తప్పలేదు. ఇలా ఒకరకంగా బీజేపీ ఓటమికి యడియూరప్ప వ్యవహారం కూడా కారణం అయిందనే చర్చ జోరుగా సాగుతోంది.