యంగ్ మినిస్టర్ అవుట్.. నాగబాబు ఇన్… ఏపీ కేబినేట్ లెక్క ఇదే
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం గత వారం పది రోజుల నుంచి గట్టిగా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం గత వారం పది రోజుల నుంచి గట్టిగా జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రిని అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో మంత్రిని చంద్రబాబు నాయుడు క్యాబినెట్ నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారని… కొత్తగా మంత్రులుగా అవకాశాలు కల్పించినా… వాళ్లు మాత్రం సమర్థవంతంగా పనిచేయడం లేదు అనే ఆగ్రహం లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో క్యాబినెట్ లోకి కొత్తగా ఎవరు వస్తారు అనేదానిపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే క్యాబినెట్ లోకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అలాగే జనసేన నుంచి నాగబాబు అడుగుపెట్టనున్నారు. పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక అక్కడి నుంచి ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. వెంటనే టిడిపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడంతో క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచన చేస్తున్నారు.
ఇదే టైంలో నాగబాబుని కూడా క్యాబినెట్లోకి తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. రాజ్యసభ స్థానాల విషయంలో జనసేన పార్టీకి కేటాయించే అవకాశం లేకపోవడంతో నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటామని టిడిపి అధికారిక ప్రకటన చేసింది. దీనితో ఆయనను ఎప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి నెలలో క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనబడుతోంది. కొత్త మంత్రులను ఇద్దరినీ పక్కనపెట్టి అందులో ఒక స్థానానికి నాగబాబుని మరో స్థానానికి పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారట.
ఇక మరో స్థానం కూడా ఖాళీగా ఉంటుంది ఈ స్థానం విషయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆసక్తి చూపిస్తున్నారు. క్యాబినెట్ విషయంలో అటు జనసేన పార్టీతో అలాగే భారతీయ జనతా పార్టీతో సమన్వయం చేసుకుని టిడిపి అడుగులు వేస్తోంది. మీడియా సమావేశాలకు దూరంగా ఉండటం అలాగే అసెంబ్లీ సమావేశాలను మంత్రులు లెక్కచేయకపోవడంతో చంద్రబాబు సీరియస్ గా ఉన్నారట. ఒక మంత్రికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా ఈ మంత్రులు నిర్వహించలేకపోతున్నారు అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. మంత్రివర్గంలోకి రావడంతో తెలియని ఒత్తిడిలో ఈ మంత్రులు ఉన్నారని పార్టీ కార్యాలయానికి కూడా దూరంగా ఉంటున్నారని చంద్రబాబు సీరియస్ అవుతున్నారు.