I-N-D-I-A Manipur: మీ ఓదార్పు సరే.. మణిపూర్ గాయానికి చికిత్స చేసేదెవరు ?
కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా... ఇప్పటి వరకు సభలో మణిపూర్‌పై చర్చే జరగలేదు. కాలం గడిచే కొద్దీ.. అన్ని పార్టీలకు మణిపూర్ కూడా ఎన్నికల అంశంగా మారిపోతుంది. ఎవరి ప్రయోజనాలు వాళ్లు కాపాడుకునే బిజీలో ఉంటారు. మణిపూర్ మాత్రం నగ్నంగా రోధిస్తూనే ఉంటుంది.
దేశాన్ని నగ్న దేహంగా మార్చి తనకు తాను కుమిలిపోతున్న మణిపూర్‌లో ఇప్పుడు ఓదార్పు యాత్రలు మొదలయ్యాయి. 21 సభ్యుల ఇండియా కూటమికి చెందిన బృందం ప్రస్తుతం మణిపూర్‌లో పర్యటిస్తోంది. మూడు నెలలుగా మణిపూర్‌లో ఏం జరుగుతుందో స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. కొండ ప్రాంతాల్లో కుకీ ప్రజలతో పాటు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్యలతో ఇండియా కూటమి సభ్యులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. దేశం చరిత్రలో మర్చిపోలేని హింసాకాండకు బీజం ఎక్కడ పడింది ? దీని వెనుక ఎవరున్నారు ? డబుల్ ఇంజెన్ సర్కార్ మణిపూర్ మంటలను ఎందుకు చల్లార్చలేకపోతోంది వంటి ప్రశ్నలకు నేరుగా సమాధానం తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఏదైనా విధ్వంసం జరిగినప్పుడు.. ప్రజా సమూహాలకు తీవ్ర అన్యాయం జరిగినప్పుడు, మాన,ప్రాణాలకు నష్టం వాటిల్లినప్పుడు నేతలను వాళ్లకు భరోసా కల్గించే ప్రయత్నాలు సహజంగానే చేస్తారు. అయితే అటు కేంద్రంలోనూ…ఇటు మణిపూర్‌లోనూ అధికారం చెలాయిస్తున్న బీజేపీ నేతలు మాత్రం బాధితులను ఓదార్చేందుకు ముందుకు రాలేదు. మణిపూర్ రావణకాష్టంలా తగలబడుతున్న సమయంలోనే ప్రధానమంత్రి మోదీ విదేశాలకు వెళ్లివచ్చారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్నారు. కానీ ఆయనకు గానీ.. ఆయన పార్టీ పరివారానికి గానీ….మణిపూర్‌లో అడుగుపెట్టే తీరికలేదు.
ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయా ?
రాజకీయ పార్టీలు రాజకీయం మాత్రమే చేస్తాయి. అయితే వాళ్ల ప్రతి చర్యను రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, పాలకులు, అధికారులు మొద్దు నిద్రపోతున్నప్పుడు బాధితుల కన్నీరు తుడిచే ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. అయితే ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడిన పార్టీలు, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కూడా కడిగిన ముత్యాలేమీ కాదు.. రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న దారుణాలకు ఏం సమాధానం చెబుతారని.. ఇండియా కూటమి సభ్యులను బీజేపీ ప్రశ్నిస్తోంది. వాస్తవమే ఆయా రాష్ట్రాల్లో కూడా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కానీ మణిపూర్ గాయాన్ని వాటికి ముడిపెట్టగలమా..? మెజార్టీ మైతేయిలు, మైనార్టీ కుకీ-నాగాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం లబ్ది పొందాలనకుంటున్నది ఎవరు ? రాష్ట్రం తగలబడుతున్నా.. ప్రజలు తుపాకులు పట్టుకుని రోడ్లపై వీరంగం సృష్టిస్తూ.. తమకు గిట్టని వాళ్లను పిట్టల్లా కాల్చేస్తున్న కనీస బాధ్యత వహించని రాష్ట్ర ప్రభుత్వం ఇంత జరిగిన తర్వాత కూడా రాజకీయ ప్రయోజినాల కోసం పాకులాడమే మణిపూర్ ఘటనలో అతిపెద్ద విషాదం.
పరిష్కారం ఎవరి చేతుల్లో ఉంది
మణిపూర్ గాయం ఓదార్పులతో పోయేది కాదు. ఓవర్గంపై మరోవర్గం ప్రజలు వ్యతిరేకత కనిపించినంత కాలం… దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు వాడుకున్నంత కాలం మణిపూర్ రావణకాష్టంలా మండుతూనే ఉంటుంది. హిందూ మెజార్టీ వర్గంగా కనిపిస్తున్న మైతేయిలు, క్రిస్టియన్ మైనార్టీ వర్గంగా కనిపిస్తున్న కుకీల మధ్య విభజన రేఖలను చెరిపివేయడం కూడా అంత ఈజీ వ్యవహారం కాదు. కానీ ఇక్కడ పాలక వర్గాలు బాధితుల పక్షాన నిలుస్తున్నాయా.. లేక తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని వర్గాలను ఎగదోస్తున్నాయా అన్నదే ప్రశ్న. మహిళలను నగ్నంగా రోడ్లపై ఊరేగించే స్థాయికి పరిస్థితులు దిగజారిపోతున్నా మౌనంగా వ్యవహరించిన పార్టీలు, నేతలు ఇవాళ మణిపూర్ భవిష్యత్తు తరాలకు ఏం సమాధానం చెప్పాలనకుంటున్నారు. మణిపూర్‌ను క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చే కుట్ర కుకీల రూపంలో జరుగుతుందని… హిందుత్వ వాదులు ఎందుకు గగ్గోలుపెడుతున్నారు ? ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు సామరస్య పూర్వకంగా జీవించాల్సిన రాష్ట్రంలో మతం చిచ్చు పెట్టిన పార్టీ జనం నెత్తురు చిందిస్తుంటే… మహిళల మానాలు పోతుంటే.. మౌనంగా ఉంటుందెవరు ? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు ? ఇండియా కూటమికి చెందిన 21 మంది సభ్యులు రెండు రోజుల పాటు మణిపూర్ లో పర్యటించడం వల్ల వారికి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం అయ్యే అవకాశముంది. అయితే వాళ్లంతా ఢిల్లీ వచ్చి ఏం చేస్తారు ? ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి పెంచుతారు. కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా… ఇప్పటి వరకు సభలో మణిపూర్‌పై చర్చే జరగలేదు. కాలం గడిచే కొద్దీ.. అన్ని పార్టీలకు మణిపూర్ కూడా ఎన్నికల అంశంగా మారిపోతుంది. ఎవరి ప్రయోజనాలు వాళ్లు కాపాడుకునే బిజీలో ఉంటారు. మణిపూర్ మాత్రం నగ్నంగా రోధిస్తూనే ఉంటుంది.