YS JAGAN: ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో.. జగన్ ఎన్నికల ప్లాన్ ఇదే..!
ఏపీలో మార్చి లేదా ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ముందస్తుకు వెళ్లే ఉద్దేశం లేదన్నారు. వచ్చే ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. మార్చిలో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ఏపీ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు.
YS JAGAN: తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మరోవైపు ఏపీలోనూ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలకు మరో ఆరు నెలలుపైగానే సమయం ఉంది. అయినప్పటికీ, పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికల ప్రణాళికల్ని అమలు చేస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ కూడా ఇప్పుడు ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నికలపై పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసే ఉద్దేశంతో విజయవాడలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.
దీనిలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. ఏపీలో మార్చి లేదా ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ముందస్తుకు వెళ్లే ఉద్దేశం లేదన్నారు. వచ్చే ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. మార్చిలో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ఏపీ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 10 వరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణులు.. గ్రామస్థాయిలోకి పార్టీని తీసుకెళ్లాలన్నారు. నేతలు మండలస్థాయిలో సచివాలయాలను సందర్శించాలని, ఏపీలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. అలాగే అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని ఆదేశించారు.
ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించాలని, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇది బస్సు యాత్ర మాత్రమే కాదని.. సామాజిక న్యాయ యాత్ర కూడా అని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ద్వారా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించబోతున్నట్లు తెలిపారు. వచ్చే జనవరి నుంచి పెన్షన్ పెంపు అమలు చేయబోతున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. జనవరి నుంచి దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు రూ.3,000 పింఛన్ అందజేయనున్నట్లు చెప్పారు. జనవరి 10 నుంచి వైఎస్సార్ చేయూత నిధులు అందజేస్తామన్నారు. జగనన్న సురక్ష పథకం, పేదలకు ఇండ్ల నిర్మాణం గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఇలా రాబోయే మూడు నెలల వరకు ఏదో ఒక కార్యక్రమం ద్వారా పార్టీకి ప్రచారం కల్పించాలని, జనంలోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. అయితే, జగన్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.