చంద్రబాబు కాదు చంద్రముఖి, అందుకే ఓడిపోయా: జగన్
ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదన్న జగన్… ప్రతి కుటుంబానికి మనం మంచిచేశామన్నారు. కాని చంద్రబాబు అంతకంటే ఎక్కడు చేస్తానంటూ, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక హామీ ఇచ్చాడని… మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారన్నారు.
గడచిన ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చామని తెలిపిన ఆయన… ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామన్నారు. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకు వచ్చాం, ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేశామని తెలిపారు. కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశామన్నారు జగన్. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించామని తెలిపారు.
క్యాలెండర్ ప్రకారం ప్రతి పథకాన్ని అమలు చేశామని దేశ చరిత్రలో అమలు చేసిన పార్టీ ఒక్క వైయస్సార్‌సీపీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలను పదిశాతం ప్రజలు నమ్మారు, నమ్మించగలిగారని అందుకనే పరాజయం పాలయ్యామన్నారు జగన్. జగన్ చేశాడు కదా… చంద్రబాబు కూడా చేస్తాడేమోనని కొంతమంది అనుకున్నారని ఆరు నెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మన అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబుగారిని నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పానన్నారు. దాన్ని ఇవాళ చంద్రబాబు గారు నిజం చేస్తున్నారని మండిపడ్డారు.