YS JAGAN: జగన్‌కు తెలియకుండానే చంద్రబాబు అరెస్టు జరిగిందా..? సీఎం వ్యాఖ్యలపై సెటైర్లు..!
సోమవారం జరిగిన వైసీపీ సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై తొలిసారి స్పందించారు. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా పెద్దగా తేడా లేదని, అలాంటి చంద్రబాబును అరెస్టు చేసే ఉద్దేశం తమకు లేదన్నారు.
YS JAGAN: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడంలో తన పాత్ర లేదని ఏపీ సీఎం జగన్ చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంకు తెలియకుండానే అరెస్టు జరిగిందా అంటూ అటు టీడీపీ శ్రేణులు, ఇటు బీజేపీ నేతలు కూడా అంటున్నారు. సోమవారం జరిగిన వైసీపీ సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై తొలిసారి స్పందించారు. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా పెద్దగా తేడా లేదని, అలాంటి చంద్రబాబును అరెస్టు చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత అనేది లేదని, అలాంటి వ్యక్తిని అరెస్టు చేయించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. తాను లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్టు చేశారని, ఈ అరెస్టుతో తనకేం సంబంధం లేదన్నాడు. కక్ష సాధింపుతో ఆయనను అరెస్టు చేయలేదని జగన్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకే సంబంధం ఉందన్నట్లుగా జగన్ మాట్లాడారు. అయితే, జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రతిపక్ష నేత అరెస్టు జరిగితే తనకేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటం సరైందేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలంతా జగన్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబను అరెస్టు చేయించాడని అనుకుంటున్నారని, ఈ విషయం జగన్ ఒప్పుకోలేనంత మాత్రాన అది అబద్ధం కాకుండా పోదని అంటున్నారు. టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ వంటి నేతలు ఈ విషయంలో జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తనకు తెలియకుండానే ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ జరిగిందని ముఖ్యమంత్రి అంటున్నారంటే రాష్ట్రంలో పాలన ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నదో తెలుస్తోందని సత్యకుమార్ అన్నారు. చంద్రబాబు అరెస్టును కేంద్ర సంస్థలపై నెట్టేసి, బీజేపీపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. ప్రజా సమస్యలపై సమీక్షలు జరపరు కానీ.. అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయనప్పుడు సీఎం పదవి ఎందుకు అంటూ జగన్‌ను ప్రశ్నించారు. పలువురు టీడీపీ నేతలు కూడా జగన్ తీరును తప్పుబడుతున్నారు.
భయమా.. వ్యూహమా..?
గతంలో జరిగిన సభలో జగన్.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అవినీతి గురించి ప్రశ్నించారు. పరోక్షంగా అరెస్టు గురించి మాట్లాడారు. అయితే, సోమవారం నాటి సభలో మాత్రం చంద్రబాబు అరెస్టుపై తనకేం సబంధం లేదనడంపై సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుపై వెల్లువెత్తుతున్న సానుభూతిని, ఈ విషయంలో తనపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు జగన్ ఇలా వ్యాఖ్యానించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వ్యవహారం తనపై రాకుండా చూసే ఎత్తుగడా.. లేక ఇంకేదైనా వ్యూహంతో ఇలా మాట్లాడారా అంటూ విమర్శకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎక్కువ మంది మాత్రం చంద్రబాబును జగన్ కావాలనే అరెస్టు చేయించారని నమ్ముతున్నారు.