YS Jagan: జగన్‌ను భయపెడుతున్న విజయసాయిరెడ్డి..!

ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో వైసీపీకి చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ నేతలే ఆయనపై సీఎంకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. తాము తింటున్న దాంట్లో ఆయన సింహభాగాన్ని కోరడాన్ని ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2023 | 06:13 PMLast Updated on: Aug 28, 2023 | 6:13 PM

Ys Jagan Fearing About Vijayasai Reddy Over Visakhapatnams Turlavada Konda Lands

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి తెగ టెన్షన్ పెడుతున్నారు. గతంలో జరిగిన పొరపాటును సరిచేయాలని తాను ప్రయత్నిస్తుంటే.. దాన్ని మళ్లీ విజయసాయిరెడ్డి కెలకడం జగన్‌కు మింగుడు పడటం లేదు. అలాగని గట్టిగా ఏం అనలేక.. సుతిమెత్తగా, మరో రకంగా చెప్పాలంటే కాస్త కంట్రోల్‌లో ఉండాలని ఎంపీని బతిమిలాడుకున్నారు ముఖ్యమంత్రి. విశాఖలో మరోసారి విజయసాయిరెడ్డి వేలు పెట్టడం వైసీపీ అధినేత జగన్‌కు నిద్రలేకుండా చేస్తోంది. అమరావతిలో ఎలాగూ నమ్మట్లేదు. విశాఖను అయినా అడ్డాగా మార్చుకుందామని చూస్తుంటే అక్కడ విజయసాయిరెడ్డి మరోసారి పార్టీని డ్యామేజ్ చేసేలా వ్యవరించడంతో జగన్ తెగ ఇబ్బందిపడిపోతున్నారు.
విశాఖలో విజయసాయిరెడ్డి హవా..!
ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో వైసీపీకి చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ నేతలే ఆయనపై సీఎంకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. తాము తింటున్న దాంట్లో ఆయన సింహభాగాన్ని కోరడాన్ని ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోయారు. పార్టీని బలపరుస్తారనుకుంటే విశాఖను మరింత డ్యామేజ్ చేశారు విజయసాయిరెడ్డి. ఆయన పేరు చెప్పుకుని చాలామంది భూకబ్జాల వంటి వాటికి తెగబడ్డారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని ఇస్తామని చెప్పినా, ఆ ప్రాంతంలో అనుకున్న స్థాయిలో మైలేజ్ రాకపోవడానికి కారణం విజయసాయిరెడ్డేనని వైసీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు రాజధాని వచ్చాక తమను బతకనివ్వరేమోనన్న భయం విశాఖ వాసుల్లో పెరిగింది. ఒకటి, రెండుసార్లు జగన్ సుతిమెత్తగా చెప్పినా వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విశాఖ నుంచి తప్పించారు. దీంతో కొంతకాలం విజయసాయిరెడ్డి అలిగారు. బీజేపీలోకి వెళతారన్న ప్రచారమూ సాగింది. జగన్ కూడా కాస్త అంటీముట్టనట్లుగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ సీన్ మారింది. వేరే బాధ్యతలు అప్పగించి అలక తీర్చారు జగన్.
తుర్లవాడ కొండను కబ్జా చేయబోతున్నారా..?
విజయసాయిరెడ్డిని తప్పించిన తర్వాత వైవీ.సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. నానా తంటాలు పడి ప్రజల్లో వ్యతిరేకతను కొంతమేర తగ్గించగలిగింది వైసీపీ. అంతా పర్లేదనుకుంటున్న సమయంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వార్త మరోసారి కలకలం రేపింది. విజయసాయిరెడ్డి తన కుమార్తె కోసం విశాఖ తుర్లవాడ కొండను కబ్జా చేయడానికి ప్రయత్నించారని చెప్పుకున్నారు. సుమారు 2 వందల ఎకరాలను కూతురుకు రాసిచ్చేందుకు ఆయన పావులు కదిపినట్లు చెప్పుకున్నారు. అక్కడ కూతురు పేరిట ప్రపంచస్థాయి యూనివర్శిటీ కట్టాలన్నది విజయసాయిరెడ్డి ఆలోచన. ఇటీవల ఆయన తన మనుషులతో కలిసి తుర్లవాడ కొండకు వెళ్లినప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. మన ప్రభుత్వమే కాబట్టి మేటర్ ఈజీగా తెగిపోతుందని విజయసాయిరెడ్డి భావించారు. ఆ కొండపై దేవుడి పాదాలున్నాయని ప్రజలు నమ్ముతారు. అలాంటి కొండ కబ్జా వార్త విశాఖలో వైరల్‌లా మారిపోయింది. ఈ న్యూస్ పాకిపోవడంతో జగన్ మరోసారి తలపట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే విశాఖలో విజయసాయిరెడ్డి అల్లుడు భారీ నిర్మాణం చేస్తున్నారు. అదో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో మరోసారి అది తమను ఎక్కడ దెబ్బతీస్తుందోనని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.
జగన్ ఏమన్నారంటే..!
ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ సమయంలో దీనిపై సీఎం జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇదేంటన్నా నేను పాత తప్పులను ప్యాచ్ చేసుకుంటూ వస్తుంటే మీరేంటి ఇలా చేస్తున్నారు అన్నారట జగన్. ఆ ఆలోచన వదులుకోవాలని తర్వాత చూద్దామని చెప్పినట్లు వైసీపీ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే విజయసాయిరెడ్డిని జగన్ గట్టిగా ఏమీ అనలేదు. అనలేరు కూడా. ఎందుకంటే సీబీఐ కేసుల్లో వీరిద్దరూ సహనిందితులు. జగన్ గుట్టుమట్లన్నీ విజయసాయిరెడ్డికి తెలుసు. అందుకే బతిమాలుకోవడం మినహా బెదిరించేలా ఏం చేయలేరు జగన్. ఈసారి కూడా అలాగే చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఇలా చేస్తే విశాఖలో పార్టీ దెబ్బతింటుంది కాబట్టి తర్వాత మాట్లాడదామని కోపం రాకుండా విజయసాయిరెడ్డికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అదే వేరే వ్యక్తి అయితే జగన్ ట్రీట్‌మెంట్ వేరేలా ఉండేది.
మరిప్పుడు జగన్ ఏం చేస్తారు..? జగన్ మాటలను లెక్కచేయకుండా విజయసాయిరెడ్డి కొండను కబ్జా చేస్తారా..? ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టినా విశాఖ వాసులు వైసీపీని విశ్వసిస్తారా..?