YS Jagan: వైసీపీలో ఆ 50 మందికి టికెట్లు డౌటేనా…? ఎమ్మెల్యేల్లో మొదలైన గుబులు..!
గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరపున గెలిచారు. వారిలో దాదాపు 50 నుంచి 60మందికి ఈసారి సీటు డౌటేనన్నది వైసీపీ వర్గాల కథనం. 2019లో జగన్ వేవ్‌లో చాలామంది ఎమ్మెల్యేలు ఈజీగా గెలిచేశారు. ఎవరు నిలబడ్డారన్నది పట్టించుకోకుండా జగన్‌ను చూసి ఓట్లేశారు జనం. కానీ ఈసారి అలా కాదు.
YS Jagan: వైసీపీ ఎమ్మెల్యేలూ.. కాస్త గుండె గట్టిగా పట్టుకోండి. ఈ వార్త చదివితే మీకు హార్ట్ ఎటాక్ రావచ్చు. మీ గుండె బద్దలయ్యే నిర్ణయాన్ని వైసీపీ హైకమాండ్ తీసుకోబోతుంది. కనీసం 50మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు డౌటేనంటున్నారు. రెండోసారి గెలుపుపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. ఎలాగైనా గెలవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ప్రజావ్యతిరేకత నుంచి బయటపడటానికి సిట్టింగుల్లో చాలామందిని సాగనంపడానికి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరపున గెలిచారు. వారిలో దాదాపు 50 నుంచి 60మందికి ఈసారి సీటు డౌటేనన్నది వైసీపీ వర్గాల కథనం. 2019లో జగన్ వేవ్‌లో చాలామంది ఎమ్మెల్యేలు ఈజీగా గెలిచేశారు. ఎవరు నిలబడ్డారన్నది పట్టించుకోకుండా జగన్‌ను చూసి ఓట్లేశారు జనం. కానీ ఈసారి అలా కాదు. పోటీ గట్టిగానే ఉండబోతోంది. గతంలో ప్రతిపక్షం నుంచి చాలామంది గట్టి నేతలు ఓడిపోయారు. కానీ ఈసారి వారిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ కసరత్తు చేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. చాలామంది ప్రజలకు దూరమైపోయారు. సంపాదించుకోవడంపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం డబ్బులు పంచింది కానీ అభివృద్ధిని గాలికి వదిలేసింది. దీంతో ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు నిత్యం వివాదాలతో సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి వారి జాబితాను జగన్ సిద్ధం చేయించారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని నేతల లిస్టు దాదాపు పైనలైజ్ అయిపోయింది. జగన్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలపై సర్వేలు చేయిస్తున్నారు. ఐప్యాక్ టీమ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తూ ఎప్పటికప్పుడు జగన్‌కు నివేదికలు ఇస్తోంది. కొంతమంది మంత్రుల పరిస్థితి కూడా ఘోరంగా ఉందని సీఎం దృష్టికి వచ్చింది. వాటన్నింటి ఆధారంగా జగన్ ఎవరికి టికెట్లు ఇవ్వాలి.. ఎవరిని దూరంగా ఉంచాలన్నదానిపై కసరత్తు చేశారు. అయితే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలకు సీట్లు లేవని చెబితే అది వేరేవిధంగా వెళ్లే అవకాశం ఉంది. దీంతో టికెట్లు ఇచ్చే అవకాశం లేని నేతలకు మరో విధంగా అవకాశాలు ఇస్తామని నచ్చచెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు ఆ దిశగా సంకేతాలు వెళ్లినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ ఛైర్మన్లు వంటి హామీలను ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అధికార పార్టీ కావడంతో వైసీపీలో టికెట్ల కోసం గట్టిపోటీ ఉంది. సిట్టింగులు ఉన్నచోట్ల కూడా నలుగురైదుగురు టికెట్లు ఆశిస్తున్నారు. అందులో కొందరు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. 2014, 2019లో టికెట్లు ఆశించి భంగపడిన వారున్నారు. అధినేత మాటకు కట్టుబడి వారంతా పోటీ నుంచి తప్పుకున్నారు. వారిలో చాలామంది ఈసారి తమకు తప్పక అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. ఎంపీలుగా ఉన్నవారు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు సిట్టింగుల్లో గెలిచే అవకాశం లేని వారిని తప్పించి గతంలో తాను మాట ఇచ్చిన వారికి అవకాశం ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అది కూడా సర్వే నివేదికల ఆధారంగానే ఉండబోతోంది. ఉమ్మడి నెల్లూరులో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు, తూర్పుగోదావరిలో ముగ్గురు.. ఇలా పలు జిల్లాల్లో తప్పించాల్సిన నేతల జాబితా జగన్ దగ్గర రెడీగా ఉందంటున్నారు.
అవసరమైతే సీనియర్లను కూడా పక్కన పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నిసార్లు గెలిచినా సరే ఈసారి గెలిచే అవకాశం లేకపోతే వారికి సీటు లేనట్లేనని చెబుతున్నారు. ఈసారి పోటీ గట్టిగా ఉండబోతోందని జగన్‌కు సర్వేల ద్వారా అర్థమైంది. ప్రతిపక్ష టీడీపీ గట్టిగా పుంజుకుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే మాత్రం గెలుపు అంత ఈజీ కాదు. కాబట్టి ప్రతిసీటూ కీలకమే.. ఒక్క సీటుతోనే మొత్తం తారుమారు కావచ్చు. కాబట్టి ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదన్నది జగన్ ఆలోచన. మరి జగనన్న హిట్ లిస్ట్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది..!