YS Jagan: విశాఖ నుంచి జగన్ పాలన.. వారానికి మూడు రోజులే..
జగన్ తన నివాసాన్ని విశాఖకు మార్చబోతున్నారు. అయితే, వారానికి మూడు రోజులు మాత్రమే విశాఖలో ఉండే అవకాశం ఉంది. రుషికొండలో నిర్మాణం అవుతున్న భవన సముదాయంలోనే సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకానుంది.
YS Jagan: విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామని ఏపీ సీఎం జగన్ చాలా కాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే అక్టోబర్ 24 నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు యంత్రాంగాన్ని రెడీ చేస్తున్నారు. జగన్ తన నివాసాన్ని విశాఖకు మార్చబోతున్నారు. అయితే, వారానికి మూడు రోజులు మాత్రమే విశాఖలో ఉండే అవకాశం ఉంది.
రుషికొండలో నిర్మాణం అవుతున్న భవన సముదాయంలోనే సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకానుంది. అక్కడ సీఎం ఉండేందుకు అనువైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఎం భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) అధికారులు పరిశీలించారు. రుషికొండపై పర్యాటక ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని గతంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ.. అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణమవుతుండటం విశేషం. అక్కడ నిర్మిస్తున్న భవనాలు పర్యాటక కేంద్రాలుగా కాకుండా.. సీఎం అధికారికి నివాసానికి కావాల్సినట్లుగా ఉంటున్నాయి.
ప్రస్తుతం భవనాల్లోపల ఇంటీరియర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ భవనానికి ఇంటెలిజెన్స్ అధికారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాగా, విశాఖలో వారానికి మూడు రోజులు మాత్రమే జగన్ ఉంటారు. ఆయనతోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఇక్కడే ఉండి పాలన సాగిస్తారు. మిగిలిన మూడు రోజులు అమరావతి నుంచి పాలన సాగిస్తారు. సీఎంతోపాటు ఉన్నతాధికారులు కూడా ఇలా వారానికి మూడు రోజులు విశాఖలో, మరో మూడు రోజులు అమరావతిలో ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీఎంతోపాటు ఉన్నతాధికారులు, మంత్రులు ఉండేందుకు అనువుగా విశాఖలో భవనాల్ని వెతికేపనిలో స్థానిక సిబ్బంది ఉన్నారు.
రుషికొండలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.200 కోట్లతో నిర్మాణ పనులు సాగుతున్నాయి. మొదటిదశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇక్కడి బే పార్క్‌లో జగన్ తన కుటుంబంతో కలిసి ఉంటారు. ఇది కూడా పర్యాటకశాఖ ప్రాజెక్టే. నిబంధనల ప్రకారం.. ఇక్కడ పర్యాటక శాఖ భవనాలు తప్ప అధికారిక నివాసాలకు తావు లేదు. కానీ, ప్రభుత్వ నిర్ణయం కావడంతో పనులుచకచకా జరగుతున్నాయి. మంత్రులు, ఇతర అధికారుల కోసం రుషికొండ, ఎండాడలతో పాటు సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్‌లో కొన్ని ఫ్లాట్లు, మరికొన్నిచోట్ల విల్లాలను అధికారులు రిజర్వ్ చేసి పెట్టారు. త్వరలోనే అధికారయంత్రాంగం.. తాడేపల్లి నుంచి విశాఖకు బదిలీ కాబోతుంది.