ఒక్కడ్నే ఉన్నా రండన్నా ప్లీజ్, వైసీపీ నేతలకు జగన్ ఫోన్లు
వైసీపీ కార్యకర్తల్లో ఓ బాధ తీవ్రంగా ఉంటుంది. పార్టీ ఓడిపోయినందుకంటే తమ జగన్ అందుబాటులో లేరు అనే బాధ ఆ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ ఉంటుంది.
వైసీపీ కార్యకర్తల్లో ఓ బాధ తీవ్రంగా ఉంటుంది. పార్టీ ఓడిపోయినందుకంటే తమ జగన్ అందుబాటులో లేరు అనే బాధ ఆ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ ఉంటుంది. కీలక సమయంలో, జగన్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అందుబాటులో లేకుండా పార్టీ నాయకులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారని… అది కూడా కొంతమంది నాయకులు మాత్రమే జగన్ వద్దకు వెళ్లగలుగుతున్నారనే కోపం కార్యకర్తలలోను నాయకులలోను తీవ్ర స్థాయిలో ఉంది. క్షేత్రస్థాయి నాయకులను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పట్టించుకోలేదనే ఆగ్రహం ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూనే ఉంటారు.
ఓవైపు ఇతర పార్టీల నాయకులు ప్రజల్లో తిరుగుతుంటే, చివరకు కమ్యూనిస్టు పార్టీల నాయకులు కూడా అప్పుడప్పుడు ప్రజల్లో పోరాటాలు చేస్తుంటే జగన్ మాత్రం అసలు పార్టీ కేంద్ర కార్యాలయం వదిలి బయటకు రావడంలేదని, అధికారం కోల్పోయిన తర్వాత బెంగళూరు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్నారని పలువురు సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్న సరే జగన్ మాత్రం వారిని పరామర్శించే ప్రయత్నం కూడా చేయటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఇక నాయకుల్లో అయితే జగన్ పై ముందు నుంచి అసంతృప్తి ఉంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని విధాలుగా పార్టీలో కీలకంగా మారటం ప్రభుత్వంలో కూడా ఆయనే చక్రం తిప్పడంతో చాలామంది మంత్రులు కూడా బొమ్మలుగా మారిపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితిని జగన్ అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు నాయకులను దూరం పెట్టిన జగన్ ఇకనుంచి వారికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని వారిలో ధైర్యం నూరిపోయారని నానా కష్టాలు పడుతున్నట్లుగా సమాచారం. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నాయకులు సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో ఇప్పుడు వారందరికీ జగన్ స్వయంగా ఫోన్లు చేస్తున్నారు.
బుధవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ సమావేశం ఉందని పార్టీ కీలక నేతలు అందరూ హాజరు కావాలని అలాగే కీలక పదవుల్లో ఉన్న వారిని నాయకులు వెంటబెట్టుకుని రావాల్సిన అవసరం ఉందని స్వయంగా ఫోన్లు చేసి చెప్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు అలాగే జనరల్ సెక్రటరీలు పార్టీ సెక్రటరీలు అందరూ తాడేపల్లి రావాలని జగన్ కోరినట్లుగా సమాచారం. గతంలో ఈ విధంగా ఎప్పుడు జగన్ నాయకులకు ఫోన్లు చేసి ఆహ్వానించిన పరిస్థితి లేదు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే మరికొంతమంది మాత్రమే ఈ విధంగా మాట్లాడేవారు.
ఇప్పుడు బుధవారం ఏర్పాటు చేసే సమావేశంలో పార్టీ పరంగా కమిటీలు ఏర్పాటు వాటి భర్తీపై కూడా నాయకులతో జగన్ చర్చించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులు పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారట. అలాగే భారీగా కరెంటు చార్జీలను పెంచి చంద్రబాబు సర్కార్ ప్రజలను వేధిస్తోందని అలాగే ఫీజు రీ యింబర్స్మెంట్ సహాయం మరికొన్ని కీలక పథకాలు అమలు కావడం లేదని, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారని వీటి పై మనం పోరాడాల్సిన అవసరం ఉందని నాయకులకు జగన్ నూరిపోయనున్నారు.
అలాగే ఇప్పటివరకు ఆందోళనలకు పార్టీ దూరంగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే రైతులు, విద్యార్థులు, యువతను కలుపుకొని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని… ప్రజల్లోకి వెళ్లడానికి మీ సలహాలు సూచనలు కూడా తనకు తెలియజేయాలని జగన్ పార్టీ నాయకులను కోరనున్నారు. ఇప్పటికీ కేసులు భయంతో ఉన్న నాయకులు మరి జగన్ కు ఎంతవరకు సహకరిస్తారనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ సమావేశంలో జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించే అంశంపై కూడా పార్టీ నేతలు నుంచి సలహాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.