YS Jagan: మరిన్ని సంక్షేమ పథకాలతో వైసీపీ మేనిఫెస్టో.. తీవ్రంగా కసరత్తు చేస్తున్న జగన్
సంక్షేమ పథకాల అమలుపై తనకు అనువైన రాజకీయ నేతలు, సీనియర్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రైతులకు ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం ద్వారా రూ.18,750 అందిస్తున్నారు. ఈ పథకంలో కొన్ని మార్పులు చేసి, మరింత లబ్ధి చేకూర్చేలా రూపొందించబోతున్నారు.
YS Jagan: ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని నెలల్లోనే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టో రూపకల్పనపై ప్రత్యేకదృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు, వాటివల్ల ఎక్కువ మందికి లబ్ధి కలిగించేందుకు ఉన్న అవకాశాల్ని జగన్ పరిశీలిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించబోతున్నారు. నవరత్నాల్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.
రుణమాఫీ చేస్తారా..?
సంక్షేమ పథకాల అమలుపై తనకు అనువైన రాజకీయ నేతలు, సీనియర్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రైతులకు ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం ద్వారా రూ.18,750 అందిస్తున్నారు. ఈ పథకంలో కొన్ని మార్పులు చేసి, మరింత లబ్ధి చేకూర్చేలా రూపొందించబోతున్నారు. అలాగే రైతులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న రుణమాఫీ అమలుపై కూడా కసరత్తు చేస్తున్నారు. సగటున ఏటా రూ.20 వేల చొప్పున ఐదేళ్లకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రైతు భరోసా కింద ఇచ్చే బదులు.. దీన్నే రూ.20 వేలకు రుణమాఫీగా మార్చే యోచన చేస్తున్నారు. ఈ పథకం సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. అయితే, రైతు భరోసా పథకాన్ని మార్చడంకంటే.. కొత్త పథకాల్ని తీసుకొస్తేనే ప్రయోజనం ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్నాలపై కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సరికొత్త నవరత్నాలను తీసుకొచ్చే ఆలోచన కూడా జగన్ చేస్తున్నారు.
మహిళల నుంచి అందిన ఫిర్యాదులు, సలహాల్ని పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందించే అవకాశం ఉంది. ప్రస్తుతం మేనిఫెస్టో అమలుపై జగన్ సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ.. ఇందుకోసం ఏర్పాటైన కమిటీ ఆగష్టు 15 నుంచి పూర్తిస్థాయిలో పనిలోకి దిగుతుందని, నెల రోజుల వ్యవధిలో మేనిఫెస్టోపై సూచనలు చేసి నివేదిక రూపొందిస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ కమిటీ అందించే సూచనలను జగన్ పరిశీలించి ఆమోదముద్ర వేస్తారు. అనంతరం కొద్ది రోజుల్లోనే మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంటుంది. గతంలోలాగా వైసీపీకి ఇప్పుడు పరిస్థితులు పూర్తి అనుకూలంగా లేనందున మరింత జాగ్రత్తగా మేనిఫెస్టో రూపొందించాలని జగన్ భావిస్తున్నారు. జనసేన, టీడీపీ నుంచి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాజకీయాలపై జగన్ పూర్తిగా దృష్టిసారించబోతున్నారు.