YS Jagan: వివేకా కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదా.. మరి ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు ?

కోడి కత్తి కేసులో కాస్తలో మిస్ అయ్యాం అనుకుంటుంటే.. వైఎస్‌ వివేకా కేసు ఇప్పుడు వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం.. ఆయన చుట్టూ కూడా సీబీఐ ఉచ్చు బిగిస్తుండడంతో.. జగన్‌కు టెన్షన్ మొదలైందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోందిప్పుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2023 | 04:15 PMLast Updated on: Apr 18, 2023 | 4:34 PM

Ys Jagan Special Meeting With Senior Leaders At Tadepalli

వివేకా హత్య కేసులో ఇప్పటికే దూకుడు పెంచిన విపక్షాలు.. జగన్‌ను మరింత కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయ్. ముఖ్యనేతలతో జగన్‌ సమావేశమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు 10రోజుల రిమాండ్ విధించారు. ఓ వైపు భాస్కర్ రెడ్డి విచారణ జరుగుతుండగానే.. అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సీబీఐ.

ఇప్పటికీ ఆయనకు ఐదుసార్లు నోటీసులిచ్చింది సీబీఐ. దీంతో అవినాశ్‌ రెడ్డి అరెస్ట్‌ తప్పదనే పుకార్లు వినిపిస్తున్నాయ్. అదే జరిగితే ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై జగన్ ప్రత్యేంగా దృష్టిసారిస్తున్నారు. తాడేపల్లిలో మీటింగ్ పెట్టి చర్చించింది కూడా అదే ! సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఈ నెలాఖ‌రు నాటికి వివేకా హ‌త్య కేసు విచార‌ణ పూర్తి చేయాలి. దీనికోసం ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది సుప్రీం. ఇలాంటి పరిస్థితుల మధ్య.. భాస్కర్ రెడ్డి అరెస్ట్ జ‌రిగింది. నెక్ట్స్.. అవినాష్‌రెడ్డి అరెస్ట్ ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. దానికి తగినట్లు.. అవినాష్ కూడా ముంద‌స్తు బెయిల్‌కు పిటిష‌న్ వేశారు.

సీఆర్పీసీ 160 నోటీసులు జారీ చేసిన సీబీఐ.. అరెస్ట్ చేస్తుంద‌ని ముందుగానే గ్రహించారు. పిటిష‌న్ వేయ‌డం ద్వారా సోమ‌వారం అరెస్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. హైకోర్టు తీర్పు తర్వాత ఏం జరుగుతుందన్న సంగతి ఎలా ఉన్నా.. ఒకవేళ అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం అనేది మాములు విషయం కాదు. ఇది వైఎస్ఆర్‌ కుటుంబ ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఈ పరిణామాలన్నీ పార్టీ యంత్రాంగంపై ప్రభావం చూపిస్తాయ్. అసలే విపక్షాల నుంచి ఒత్తిడి పెరిగిన వేళ.. వారి చేతికి మరో ఆయుధం అందించినట్లు అవుతుంది. దీంతో ఏం చేయాలి.. ఎలా అడుగులు వేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై.. పార్టీ ముఖ్య నేతలతో జగన్ చర్చలు జరిపారు. పూర్తిగా ఈ విషయం మీద దృష్టి పెట్టారు.

రెండు రోజులుగా షెడ్యూల్‌ను పూర్తిగా తాడేపల్లికే పరిమితం చేసుకున్నారు జగన్. ఏటా వెళ్లే లండన్‌ యాత్రను కూడా రద్దు చేసుకున్నారు. అనంత‌పురం జిల్లాలో బ‌ట‌న్ నొక్కే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. పార్టీ శ్రేణులకు అందుబాటులో అంటూ పరిస్థితులను ఆరా తీస్తున్నారు. విచారణ చేయి దాటుతుంది అనుకుంటే.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల సహకారం తీసుకునేందుకు కూడా జగన్ సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. అరెస్ట్ జరిగితే.. పార్టీకి డ్యామేజీ జరగకుండా.. పులివెందుల‌లో శాంతి ర్యాలీలు చేసేలా కేడర్‌ను సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం కూడా నడుస్తోంది. వీలు ఉన్నంత వరకు.. ప్రత్యర్తి పార్టీలను కార్నర్ చేసేలా ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నారని.. మీడియా ముందు ఎవ‌రు ఏం మాట్లాడాలి.. ఎప్పుడు మాట్లాడాలనే అంశంపై కూడా.. తాడేపల్లి మీటింగ్‌లో జగన్ దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.