Nandamuri Balakrishna: బాలయ్య కోటను బద్దలు కొట్టేందుకు జగన్ ప్లాన్..
బాలయ్య, చంద్రబాబును ఓడించి ఇంటికి పంపించేందుకు ఉన్న దారులన్నీ వెతకడంలో జగన్ బిజీగా ఉన్నారట. ఈ క్రమంలోనే హిందూపురంలో బాలయ్యపై అభ్యర్ధిని ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారని తెలుస్తోంది.
Nandamuri Balakrishna: రాయలసీమలో టీడీపీకి రెండు కంచుకోటలు ఉన్నాయి. వాటిలో ఒకటి టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం కాగా, మరొకటి నందమూరి బాలకృష్ణ సెగ్మెంట్ హిందూపురం. ఈ రెండు కంచుకోటల్ని ఎలాగైనా బద్దలు కొట్టాలనే కసితో ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రగిలిపోతున్నారట. బాలయ్య, చంద్రబాబును ఓడించి ఇంటికి పంపించేందుకు ఉన్న దారులన్నీ వెతకడంలో జగన్ బిజీగా ఉన్నారట. ఈ క్రమంలోనే హిందూపురంలో బాలయ్యపై అభ్యర్ధిని ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా హిందూపురంలోనే మకాం వేసిన పెద్దిరెడ్డి.. నియోజకవర్గానికి చెందిన వైసీపీలోని నాలుగు వర్గాలను ఇప్పటికే ఏకం కూడా చేశారట.
మహిళా ఓట్లు.. బీసీ ఓట్లు.. టార్గెట్
హిందూపురం నుంచి దీపికను బరిలోకి దింపితే బాగుంటుందనే ఒపీనియన్‌తో పెద్దిరెడ్డి ఉన్నారట. లేడీ సెంటిమెంట్‌తో ఈజీగా వైసీపీని గెలిపించుకోవచ్చనేది ఆయన అభిప్రాయమట. దీపిక కురుబ సామాజికవర్గానికి చెందిన నాయకురాలు. ఆ సామాజికవర్గం ఓట్లు హిందూపురం నియోజకవర్గంలో ఎక్కువ. దీపిక భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో వైసీపీ వ్యూహాత్మకంగా ఆమె పేరును తెరపైకి తెచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. హిందూపురం పరిధిలో ఇటీవల జరిగిన సర్పంచ్ పోల్స్‌లో సాధించిన విజయంతో అక్కడి వైసీపీ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. దీపికను అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆ జోష్ అలాగే ఎన్నికల వరకు కొనసాగుతుందనే అంచనాతో వైసీపీ పెద్దలు ఉన్నారు. నియోజకవర్గాన్ని బాలయ్య పెద్దగా పట్టించుకోరని, ప్రజలకు సమయం కేటాయించరనే అపవాదు ఉంది. ఈ పాయింట్స్‌ను జనంలోకి తీసుకెళ్లి.. దీపిక వైపునకు ప్రజలను తిప్పుకోవాలని వైఎస్సార్‌సీపీ యోచిస్తోందట. ఈ క్రమంలో దీపిక తరఫున ప్రచారం చేయడానికి స్వయంగా సీఎం వైఎస్ జగన్ దాదాపు రెండు, మూడుసార్లు హిందూపురానికి వెళ్లనున్నారని తెలుస్తోంది. అయితే ఈ స్కెచ్‌కు కౌంటర్ ఇచ్చేందుకు బాలయ్య ఎంతమేరకు రెడీ అవుతున్నారో తెలియాల్సి ఉంది.
ఇక్బాల్ చూపు.. కర్నూలు వైపు..
హిందూపురం నియోజకవర్గం నేపథ్యంలోకి వెళితే.. టీడీపీ అనేక సంక్షోభాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయంలోనూ హిందూపురం ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో పి.అబ్దుల్ ఘని టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో బాలయ్యపై వైసీపీ అభ్యర్ధిగా మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎలక్షన్‌లో ఇక్బాల్ పై 17,028 ఓట్ల మెజారిటీతో బాలయ్య విజయఢంకా మోగించారు. ఈనేపథ్యంలో హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ పదవిని కూడా కోల్పోయిన ఇక్బాల్.. వైసీపీ తరఫునే కదిరి లేదా కర్నూలు సీటు నుంచి ఛాన్స్ ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరారని సమాచారం. కదిరిలో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిద్ధారెడ్డి ఉండగా.. కర్నూల్‌లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. అయితే హఫీజ్ ఖాన్‌ను మార్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిద్ధారెడ్డి మరోసారి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఈ రెండు సీట్లలో ఒకదాంట్లో తనకు అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో ఇక్బాల్ ఉన్నారు.