YS Sharmila: షర్మిలను ముంచేసిన సలహాదారులు.. దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారా ?
సలహాలు చాలామందే ఇస్తారు.. అందులోంచి నీకు కావాల్సింది ఏంటి అని ఎంచుకోవడమే నిజమైన సక్సెస్‌కు మార్గం. లక్ష్యం లేకుండా ప్రతీ సలహా వింటూ పోతే.. నిండా మునగడం ఖాయం. అటు ఇటుగా వైటీపీ అధ్యక్షురాలు షర్మిలకు పక్కాగా సరిపోయే మాట ఇది. తెలంగాణ కోడలినని.. రాజన్న రాజ్యం తీసుకొస్తానని.. తెలంగాణలో పార్టీ ప్రారంభించారు షర్మిల.
వేల కిలోమీటర్లు నడిచారు. వందల మందిని కలిశారు.. అన్నీ తానై, అన్నింటికి తానై అన్నట్లుగా.. ఒక్కరే ముందుండి నడిపించారు పార్టీని ! ఐనా సరే పెద్దగా వర్కౌట్ కావడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో మినిమం అటెన్షన్ కూడా డ్రా చేయలేకపోయింది. షర్మిల ఎన్ని మాటలు అన్నా, అంటున్నా.. ప్రత్యర్థి పార్టీలు పట్టించుకోవడం మానేశాయ్ కనీసం ! దీంతో షర్మిల కూడా కన్ఫ్యూజన్‌లో పడిపోయినట్లు కనిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారం తెరమీదకు వచ్చింది.
కాంగ్రెస్‌తో పొత్తుతో షర్మిల ఎన్నికలకు వెళ్లబోతున్నారని.. లేదంటే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తారని.. అంతా ఇంతా కాదు కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారం ! ఓ వైపు కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌తో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న షర్మిల.. కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారమే లేదని పదేపదే చెప్తున్నా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. అటు మింగలేక.. ఇటు కక్కలేక అన్నట్లుగా తయారయింది షర్మిల పార్టీ పరిస్థితి. పూర్తిగా కన్ఫ్యూజన్‌లో పడిపోయింది షర్మిల. పార్టీకి బలం లేదు.. బలమైన నేతలు పార్టీలో లేరు. ఒంటరిగా వెళ్తే గుర్తింపు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి.
పొత్తుగా వెళ్తే పొలిటికల్ కెరీర్ ఏమవుతుందో అనే కంగారు. వచ్చే ఎన్నికల్లో ఎలా వెళ్లాలి.. ఎవరితో వెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్‌లో పడిపోయినట్లు కనిపిస్తున్నారు షర్మిల. దీనికి ప్రధాన కారణం.. ఆమె చుట్టూ ఉన్న సలహాదారులే ! రాంగ్ అనుకున్న చోట రైట్ సలహాలు.. రైట్ అనుకున్న రాంగ్ సలహాలు.. కట్ చేస్తే.. ఎడారిలో ఎండమావిలా తయారైంది పార్టీ పరిస్థితి. ఒకరకంగా షర్మిలను, ఆమె పార్టీని ముంచేసింది ఈ సలహాదారులే అనే చర్చ.. తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.
పార్టీ ఆరంభం నుంచి వాళ్లి ఇచ్చిన ప్రతీ సలహా షర్మిలను దెబ్బ తీసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఒక్కటి మాత్రం నిజం.. తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారబోతోంది. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా సమీకరణాలు మారడం ఖాయం. ఇలాంటి సమయంలో సలహాదారుల మాటలు పక్కనపెట్టి.. విజయానికి సరైన దారి ఏదో వెతుక్కోవాల్సిన అవసరం షర్మిలకు ఉంది. లేదంటే వేల కిలోమీటర్ల నడక.. వంద రోజుల రాజకీయ ప్రయాణం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. షర్మిల ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే.