మీరు ఒకసారి మా అన్న రెండు సార్లు: షర్మిల ఫైర్
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి గారు చేసిన వ్యాఖ్యలు మరో సారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వాటిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి గారు చేసిన వ్యాఖ్యలు మరో సారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వాటిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని అపహస్యం చేసినట్లు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రతిపాదన వస్తే ఆలోచన చేస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలతో బీజేపీ చెలగాటం ఆడుతుంది అనడానికి నిదర్శనమన్నారు.
ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకాని తనానికి అద్దం పడుతుందని ఆమె ఆరోపించారు. కడప ఉక్కు సీమ ప్రజల హక్కు అని స్పష్టం చేసారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమే SAIL ఆధ్వర్యంలో నిర్మించి ఇచ్చేలా కాంగ్రెస్ సారథ్యంలోని UPA ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని విభజన చట్టంలోనూ పెట్టిందన్నారు. అనంతరం అధికారంలోకొచ్చిన బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసిందని మండిపడ్డారు. సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. కడప ప్రజలకు తీరని ద్రోహం చేసిందన్నారు.
తిరుపతి వేదికగా కడప స్టీల్ పై హామీ ఇచ్చిన మోడీ.. తర్వాత సాధ్యం కాదని, సొంత గనులు లేకుండా కష్టమని, లాభదాయకంగా లేదని సన్నాయి నొక్కులు నొక్కారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం… కడప స్టీల్ పై మీ వైఖరి ఏంటి ? కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి ? అని నిలదీశారు. అసలు కేంద్రం పరిశీలనలో లేదనడం మీరు సమర్ధిస్తారా ? కడప స్టీల్ ప్లాంట్ కడతారా ? కట్టరా? అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ పై మీ ముసుగు తీయండి సార్ అని ఆమె డిమాండ్ చేశారు. అనాడు బీజేపీ మోసం చేసిందని, కేంద్రం సహకరించక పోయినా… రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కడుతుందని ఒకసారి మీరు కొబ్బరి కాయ కొడితే.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు రెండు సార్లు టెంకాయలు కొట్టారన్నారు. నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమే అని ఆమె ఎద్దేవా చేసారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.