మా అన్నది పాపం, నీది శాపం బాబు: షర్మిల

విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్ అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2024 | 03:09 PMLast Updated on: Nov 05, 2024 | 3:09 PM

Ys Sharmila Fires On Chandrababu Naidu 2

విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్ అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో మా తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారు అని ఆమె ఆరోపించారు. సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు “సర్దుపోటు” అన్నారు. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్ అని మండిపడ్డారు.

విద్యుత్ ఛార్జీల విషయంలో.. ” వైసీపీ చేసింది పాపం అయితే – రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపం” అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం ? అని ప్రశ్నించారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా ? అని నిలదీశారు. 5 ఏళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? అని ప్రశ్నించారు. వైసీపీకి మీకు ఏంటి తేడా ? అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ 9సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు.

ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే.. వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయండని డిమాండ్ చేసారు. పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని మోడీని గల్లా పట్టి అడగండని సూచించారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోందన్నారు. ప్రజల ముక్కు పిండి ట్రూఅప్‌ ఛార్జీల రూపంలో, అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా.. రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నామన్నారు.