నాన్న పారిపోలేదు జగన్, పిచ్చి పక్కన పెట్టు: షర్మిల

వైసీపీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2024 | 11:39 AMLast Updated on: Nov 11, 2024 | 11:39 AM

Ys Sharmila Fires On Ys Jagan

వైసీపీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది ? అంటూ మండిపడ్డారు ఆమె. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని హితవు పలికారు. మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే… ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమన్నారు. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశమన్న ఆమె ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని తెలిపిన ఆమె… మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదన్నారు షర్మిల.

రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం YCPకి ప్రజలు ఇస్తే… ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదన్న ఆమె మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదని తెలిపారు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డామన్నారు. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదన్నారు. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండి… కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండని హితవు పలికారు.