YS SHARMILA: కన్‌ఫ్యూజన్ లో షర్మిల.. కబంధ ‘హస్తాల్లో’ చిక్కుకుపోయారా..?
తెలంగాణపైనే తనకు ఆసక్తి ఉందన్న షర్మిల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదని, ఏపీలో అయితేనే ఆమె వల్ల పార్టీకి లబ్ధి చేకూరుతుందనే ఒపీనియన్ లో వారు ఉన్నారని తెలుస్తోంది.
YS SHARMILA: షర్మిల అయోమయంలో పడ్డారా..? ఇక వెనకడుగు వేయలేక కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారా..? వైఎస్సార్టీపీ మొత్తాన్ని విలీనం చేయనున్నందుకు ప్రతిఫలంగా కనీసం ఒక్క అసెంబ్లీ సీటుపైనా హామీని పొందలేకపోయారా..? అంటే రాజకీయవర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇటువంటి అనివార్య పరిస్థితుల నడుమ, చుట్టుముట్టిన అయోమయం నడుమ, అలుముకున్న అనుమానాల నడుమ త్వరలోనే కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ కోసం పనిచేయాలనే సోనియాగాంధీ డైరెక్షన్ లో నడిచేందుకు షర్మిల రెడీ అవుతారా..? సోదరుడు జగన్‌ను రాజకీయంగా ప్రత్యక్షంగా ఢీకొంటారా..? అనే ప్రశ్నలపై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది.
తెలంగాణపైనే తనకు ఆసక్తి ఉందన్న షర్మిల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదని, ఏపీలో అయితేనే ఆమె వల్ల పార్టీకి లబ్ధి చేకూరుతుందనే ఒపీనియన్ లో వారు ఉన్నారని తెలుస్తోంది. ఈనేపథ్యంలో జగన్ తో రాజకీయంగా తలపడటం మినహా షర్మిలకు మరో మార్గం మిగలలేదని పరిశీలకులు చెబుతున్నారు. మీడియాకు సమాచారం ఇచ్చి సోనియాగాంధీతో భేటీ కావడం, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్న అంశాన్ని బహిరంగపర్చడం ద్వారా ఎంతో కష్టపడి క్రియేట్ చేసుకున్న వైఎస్సార్ టీపీ చరిష్మాను షర్మిల చేతులారా దెబ్బతీసుకున్నారని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. ఫలితంగా ఇప్పుడు వైఎస్సార్ టీపీలో ఎవరూ ఉండే పరిస్థితి లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాలను షర్మిల పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయకపోయినా.. ఒంటరిగా పోటీ చేయలేని స్థితి కనిపిస్తోంది.
పాలేరు తుమ్మలకే..
షర్మిల ఆశిస్తున్న పాలేరు అసెంబ్లీ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ హామీ లభించడం వల్లే సెప్టెంబర్ 6న కాంగ్రెస్‌లో తుమ్మల చేరబోతున్నారట. కాంగ్రెస్ లోకి ఎంటర్ అవుతున్న షర్మిలకు ఈ పరిణామం పెద్ద షాక్ గా పరిణమించే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ మిస్సయితే.. సికింద్రాబాద్ ఎంపీగా లేదా కర్ణాటక కోటాలో రాజ్యసభ ఎంపీగా షర్మిలకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలంటే ఈ అసెంబ్లీ పోల్స్ లో పోటీచేయడం అత్యవసరమని పరిశీలకులు సూచిస్తున్నారు. ఒకవేళ నామినేటెడ్ పదవులకే పరిమితమైతే.. పెద్ద రాజకీయ సముద్రం లాంటి కాంగ్రెస్ లో గుర్తింపు అనేది లభించదని అంటున్నారు. ప్రస్తుతం షర్మిల పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఆమె తీసుకోబోయే నిర్ణయమే.. పొలిటికల్ ఫ్యూచర్ కు బాటలు వేస్తుంది.
రేవంత్ సహా పలువురి అభ్యంతరం..
ఇటీవల సోనియాతో షర్మిల భేటీపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, షర్మిల మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని చెప్పారు. షర్మిల కూడా ఈ అంశంపై మీడియాతో మాట్లాడారని తెలిపారు. వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై వేచి చూడాలి అంటూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా షర్మిల నుంచి ఇంకా పార్టీ విలీనం పైన స్పష్టత రాలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలోనే షర్మిల తన రాజకీయం కొనసాగించాలని కోరుకుంటున్నారు. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా మరి కొందరు తెలంగాణలో షర్మిల పోటీ.. పార్టీలో ప్రాధాన్యతపైన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.