YS Sharmila: వివేకా హత్య వైఎస్ షర్మిల సంచలన సాక్ష్యం!!
హత్యకు సంబంధించి నా దగ్గర ఆధారాలు లేవు. కానీ రాజకీయ కోణంలోనే హత్య జరిగింది అని భావిస్తున్నా. వివేకా హత్యకు కుటుంబ ఆర్ధిక అంశాలు కారణం కాదు. ఈ హత్యకు పెద్ద కారణమే ఉంది. అవినాష్ రెడ్డి కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా ఉండటమే హత్యకు కారణం కావొచ్చు.
YS Sharmila: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా పేర్కొంది. ఆమె పేరును 259వ సాక్షిగా చార్జిషీటులో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 7న షర్మిల ఢిల్లీలో సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది.
“హత్యకు సంబంధించి నా దగ్గర ఆధారాలు లేవు. కానీ రాజకీయ కోణంలోనే హత్య జరిగింది అని భావిస్తున్నా. వివేకా హత్యకు కుటుంబ ఆర్ధిక అంశాలు కారణం కాదు. ఈ హత్యకు పెద్ద కారణమే ఉంది. అవినాష్ రెడ్డి కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా ఉండటమే హత్యకు కారణం కావొచ్చు. కుటుంబంలో అందరూ బాగున్నట్లుగా కనిపించినా లోలోపలే గొడవలు నడిచేవి. నాకు తెలిసి ఈ హత్యకు సన్నిహితులే కారణం. కడప ఎంపీగా పోటీచేయాలని వివేకా నన్ను అడిగారు. ఎంపీగా అవినాష్ పోటీచేయవద్దని కోరుకున్నట్లు వివేకా చెప్పారు. అవినాష్‌కి ఎంపీ టికెట్ ఇవ్వదని జగన్‌ని ఒప్పిద్దామన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా నేను వెళ్లనని వివేకా ఆలోచించారు. జగన్‌ను కచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో వివేకా మాట్లాడారు. జగన్ నాకు మద్దతు ఇవ్వరు అని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి నేను మొదటి నుంచి ఒప్పుకోలేదు. బాబాయి పదేపదే ఒత్తిడి చేయటంతో సరే అన్నాను” అని షర్మిల వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఎంపీగా వివేకానే పోటీ చేయాలనుకోకుండా.. మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని షర్మిలను సీబీఐ ప్రశ్నించింది. దీనికి షర్మిల బదులిస్తూ.. “వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఎంపీగా పోటీకి ఆసక్తి చూపకపోవచ్చు. అది కూడా విజయమ్మపై వివేకా పోటీ చేశాక ఇద్దరి మధ్యా కొంత దూరం పెరిగింది. ఆ కారణంగా ఎలాంటి టికెట్ దక్కకపోవచ్చునని వివేకా భావించారు. ఎమ్మెల్సీగా వివేకా ఓటమికి కూడా సన్నిహితులే కారణం” అని అన్నారు. వివేకా హత్య కేసు విషయంలో కుటుంబ సభ్యురాలైన షర్మిల వాంగ్మూలం ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె వాంగ్మూలం కేసు విచారణలో కీలకంగా ఉపయోగపడుతుందని సీబీఐ భావిస్తోంది.