YS Sharmila: వై.ఎస్.షర్మిల హడావుడి మామూలుగా లేదుగా..!?
షర్మిల పార్టీకి ఇప్పటికీ తగిన యంత్రాంగం లేదు. అయినా షర్మిల మాత్రం హడావుడి చేయడంలో ముందుంటున్నారు. ఇది కూడా ఆ హడావుడిలో భాగమేననేది విశ్లేషకుల మాట.
వైఎస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (YS Sharmila) స్పీడ్ పెంచారు. తెలంగాణలో ఇప్పటికే సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల.. తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలనేది ఆమె ప్లాన్. అయితే ఇప్పటికీ షర్మిల పార్టీకి సరైన కేడర్ లేదు, సమర్థులైన నాయకులు కూడా లేరు. పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయినా పట్టుదలతో ఆమె పోరాటం సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం పేపర్ల లీకేజీల (Paper Leak) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. నిన్నటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ల లీకేజీ కలకలం సృష్టించింది. ఇప్పుడు టెన్త్ క్లాస్ (Tenth Class) పేపర్లు కూడా బయటకు వస్తుండడం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. దీనిపై విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే షర్మిల దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలన్నింటినీ కలుపుకుని వెళ్లాలని భావించింది. వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఫోన్ చేసి ఉమ్మడిగా పోరాడదామని పిలుపునిచ్చింది.
అంతటితో ఆగని షర్మిల టి-సేవ్ ఫోరం (T-Save Forum) పేరిట ఒక వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణను రక్షించుకోవడమే ధ్యేయంగా ఈ ఫోరంను ఏర్పాటు చేసినట్లు ఆమె ప్రకటించారు. ఈ ఫోరం తరపున అందరం కలసి పోరాడదామంటూ విపక్షాలన్నింటినీ కోరుతున్నారు. అందులో భాగంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను (Kodandaram) ఆయన ఆఫీసుకు వెళ్లి కలిసారు షర్మిల. అలాగే సీపీఎం (CPM), సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram), కూనంనేని సాంబశివరావును (Kunamneni Sambasiva Rao) కూడా వెళ్లి కలిసారు. టీ-సేవ్ ఫోరం భాగస్వామ్యం కావాలని వాళ్లందరినీ కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ఫోరం ద్వారా ఎండగడదామని పిలుపునిచ్చారు.
షర్మిల తన ఉనికికోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ (BRS) నేతలు విమర్శిస్తున్నారు. ఆమె పార్టీకి ఇక్కడ మనుగడ లేకపోవడం వల్లే ఇలా చవకబారు ఎత్తుగడలు వేసి వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. షర్మిల పార్టీకి ఇప్పటికీ తగిన యంత్రాంగం లేదు. అయినా షర్మిల మాత్రం హడావుడి చేయడంలో ముందుంటున్నారు. ఇది కూడా ఆ హడావుడిలో భాగమేననేది విశ్లేషకుల మాట.